- ఒక్క సీటూ దక్కదనే భయంలో కేటీఆర్
- అందుకే తెరపైకి హైదరాబాద్ యూటీ నాటకం
- 12 సీట్లిస్తే.. యూటీ ఆపుతామంటున్న బీఆర్ఎస్
- గోదావరి నీళ్లపైనా కేసీఆర్ రాజకీయం
- బోణీ కొట్టకపోతే పార్టీ ఫినిష్ అనే భయం
brs ut politics : ‘2014 జూన్ 2న తెలంగాణ ఏర్పడింది. ఆ సమయంలో పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. వచ్చే జూన్ 2 నాటికి ఈ గడువు తీరిపోనుంది. ఆ వెంటనే మన బంగారు భాగ్యనగరాన్ని.. కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని బీజేపీ కుట్రచేస్తోంది’ అంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆ వెంటనే గులాబీ నేత హరీష్ రావు మీడియా ముందుకు వచ్చి, హైదరాబాద్‌ను మరికొన్నేళ్లు ఉమ్మడి రాజధానిగా చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు’ అంటూ ఆరోపించారు అయితే, ఆ వెంటనే బీజేపీ వీటిని ఖండించింది. తమకు ఎలాంటి రహస్య ఎజండాలూ లేవని, లోక్‌సభ ఎన్నికల్లో ఉనికిని చాటటానికే కేటీఆర్ అతితెలివి ప్రదర్శిస్తున్నారని మండిపడింది. ఇటు కాంగ్రెస్ నేతలూ దీనిపై స్పందించారు. కేంద్రం అలాంటి ప్రయత్నాలు చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఇక దీనిపై మేధావులు, సామాజిక వేత్తలూ తమతమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వీరిలో మెజారిటీ వ్యక్తులు దీనిని ఎన్నికల ఎత్తుగడగానే కొట్టిపారేశారు. పార్టీ ఇబ్బందుల్లో ఉన్న కాలంలో ఇలాంటి ఊహాజనిత అంశాలను తెరమీదకు తీసుకొచ్చి ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టటం గులాబీ పార్టీ పెద్దలకు అలవాటుగా మారిందని చెప్పుకొచ్చారు. దీనికి ఇటీవలి పరిణామాలే కారణమని వారు చెబుతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి తాను లేకపోతే తెలంగాణ అనే కల సాకారమయ్యేదే కాదని, ఈ క్రెడిట్ అంతా తనదేనని గులాబీ బాస్ భావిస్తూ వచ్చారు. తెలంగాణను ఏలటం తనకు తప్ప మరొకరికి సాధ్యం కాదని, యావత్ తెలంగాణ ప్రజలను తన కంటిసైగతో శాసించగలననే భ్రమలో బతుకుతూ వచ్చారు. తన తర్వాత తన కుమారుడు దీనికి పాలకుడవుతాడని నమ్ముతూ వచ్చారు. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడిన బీఆర్ఎస్ పార్టీకి ఓటమి తర్వాత గానీ రియాలిటీ ఏంటో అర్థం కాలేదు. నెల తిరగక ముందే నిన్నటిదాకా తన దగ్గర చేతులు కట్టుకుని నిలబడిన నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరి, తన ముచ్చట్లన్నీ బయటపెట్టటంతో కేసీఆర్ షాక్‌కు గురయ్యారు. పులిమీద పుట్రలా ఈడీ వచ్చి కూతురు కవితను అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించటం ఆయనను నిలువునా కుంగదీసింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, తన పాలనాకాలపు వైఫల్యాలను కాంగ్రెస్ సర్కారు ఒక్కొక్కటే బయటపెట్టటం, ఎమ్మెల్యేలూ జారుకోవటం మొదలవటంతో కష్టకాలం మొదలైందనే లెక్కకొచ్చారు. ఈ సమయంలోనే వచ్చిన లోక్‌సభ ఎన్నికలకు టిక్కెట్లు తీసుకునేందుకు కూడా నేతలు ముందుకు రాకపోవటంతో ఆయన గతంలో దర్శనం ఇవ్వటానికే ఇష్టపడని నేతలకు టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. టిక్కెట్లైతే ఇచ్చారు గానీ, గెలవటం ఎలా అనే సమస్య వచ్చింది. దీంతో ఉద్యమకాలం నాటి పాత వ్యూహాలకు పదును పెట్టారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయబోతున్నారనే ముచ్చటను ముందుకు తీసుకొచ్చారు కేటీఆర్.
అయితే దీనిని జనం అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఎందుకంటే గతంలో ఇలాంటి అనేక వ్యూహాలను గులాబీ పార్టీ తెరమీదికి తీసుకొచ్చిన సంగతి ఇంకా జనం మరచి పోలేదు కాబట్టే. గత నవంబరులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు కొన్ని గంటల ముందు ఏపీ పోలీసులు హడావుడిగా నాగార్జున సాగర్ మీదికి రావటం, తెలంగాణ పోలీసులు వారిని అడ్డుకునే యత్నం చేయటం జరిగింది. అదే సమయంలో తెలంగాణలోని వైసీపీ నేతలు మీడియా ముందుకొచ్చి హైదరాబాద్‌ను యూటీగా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ వెంటనే హడావుడిగా గులాబీ నేతలంతా మీడియా ముందుకొచ్చి, తెలంగాణ నీటి వనరులు కాపాడలన్నా, హైదరాబాద్ ఎప్పటికీ తెలంగాణలోనే ఉండాలన్నా.. ప్రజలు తిరిగి తమకే ఓటేయాలని కోరటం జరిగింది. అయితే, ఈ సెంటిమెంట్ వర్కవుట్ కాలేదు. ఇటీవల తెలంగాణలో బస్సు యాత్ర సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ, ఇదే రాజకీయ వాతావరణం కొనసాగితే ‘గోదావరిని మోదీ ఎత్కపోతరు’ అనే కొత్త మాట మాట్లాడారు. గోదావరిని ఎత్కపోవడం ఏమిటో కానీ.. తాను సీఎంగా లేకపోతే తెలంగాణకు గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకవని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్‌కు దిగారు. తద్వారా ఈ నాలుగు నెలల్లోనే ఇన్ని సమస్యలు వస్తే, ఐదేళ్ల నాటికి జనం సమస్యలతో అల్లాడిపోతారని కేసీఆర్ చెప్పకనే చెప్పారు.
మొత్తంగా చెప్పాలంటే.. తాము అధికారంలో ఉన్నప్పుడు అంతా స్వర్గం.. ఇతరులు ఉంటే అంతా నరకం అనేదే వీరు జనానికి చెప్పాలనుకుంటున్నారు. అందుకోసమే, హైదరాబాద్ యూటీ డ్రామాను మరోసారి తీసుకొచ్చారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో 12 సీట్లు తమకు ఇస్తే, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా ఆపుతామనే భరోసా ఇవ్వటం. ప్రస్తుత ఎన్నికల్లో ఒక్కసీటూ దక్కే పరిస్థితి లేదని గ్రహించే కేటీఆర్ ఈ కొత్త మైండ్ గేమ్ ఆడుతున్నారని, ఇది పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి ఎన్నికల స్టంట్ అంటున్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్‌కు చిత్తశుద్ధి ఉంటే ఏపీలో 7 మండలాలను కలిపినప్పుడే ఎందుకు పోరాటం చేయలేదని వారు నిలదీస్తున్నారు. అలాగే ‘సార్వత్రిక ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాలలో పెనుమార్పులు’ అని కేసీఆర్ చెబుతున్న మాటలకు అర్థం ఆయన ఎన్డీయేలో కలవబోవటమేనని హస్తం నేతలు చెబుతున్నారు. మొత్తం మీద లోక్ సభ ఎన్నికలలో జీరో సీట్లకు పరిమితం కాకుండే ఉండేందుకు కేసీఆర్, కేటీఆర్ కలసి బీజేపీతో చేతులు కలపడానికీ, తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడానికీ కూడా వెనుకాడటం లేదని వారు మండిపడుతున్నారు.