– బీఆర్ఎస్‌లో కొత్త టెన్షన్
– అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ జోరుగా వలసలు
– భయపెడుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు
– కొన్ని జిల్లాల్లో ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిన లోకల్ లీడర్లు
– ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఖాళీ అవుతోన్న బీఆర్ఎస్
– లోక్ సభ ఫలితాల తర్వాత పరిస్థితి మరింత దైన్యం
– కాంగ్రెస్, బీజేపీ వైపు చూస్తున్న నేతలు
brs tension about local elections leaders jumping into congress continue: లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ఎంతో ధీమాగా ఉంది కాంగ్రెస్ సర్కార్. ఎలాగైనా డబుల్ డిజిట్ స్థానాలు సొంతం చేసుకుంటామని ఆత్మ విశ్వాసంతో ఉంది. అదే వేడిలో రాబోయే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తే మళ్లీ ఐదేళ్ల దాకా తమకు ఢోకా ఉండదని భావిస్తోంది. ఈ సంవత్సరం చివర్లో మున్సిపాలిటీ, సహకార సంఘాల ఎన్నికలు కూడా పూర్తి చేయాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. ముందుగా గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్ ఎన్నికలకు పక్కాగా ప్లాన్ జరుగుతోంది. అయితే, బీఆర్ఎస్‌కు మాత్రం కాలం కలిసి రావడం లేదు. నేతలు పైకి ధైర్యంగా ఉన్నా లోపల మాత్రం ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిని, పార్లమెంట్ ఎన్నికలలో భారీ సంఖ్యలో ఇతర పార్టీలకు వలస వెళ్లిపోగా మిగిలినవారు తీవ్ర నైరాశ్యంతో ఉన్నారనే చర్చ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చాలా వరకు కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్లిపోయారు. సరిగ్గా ఈ సమయంలో వస్తున్న పంచాయతీ ఎన్నికలకు ముందే మరింత మంది నేతలు జంప్ అయ్యే పనిలో నిమగ్నమైపోయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అగ్ర నేతలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఏం జరగనుందనే ఉత్కంఠ నెలకొంది.
భయపెడుతున్న నల్గొండ నేతలు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తప్ప మిగిలిన ఆరుగురు కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో చాలామంది గంపగుత్తగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారనే టాక్ నడుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలకు గానూ 11 స్థానాలు కైవసం చేసుకుంది కాంగ్రెస్. రేపటి లోక్ సభ ఫలితాలలోనూ నల్గొండ, భువనగిరి ఎంపీ స్థానాలను దక్కించుకుంటామనే ధీమాలో ఉంది. అయితే, ఎంపీ ఎన్నికల సమయంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరిగింది. తాజాగా జిల్లాకు చెందిన మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు, కో- ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు కాంగ్రెస్‌లో చేరేందుకు పార్టీ సీనియర్లతో రహస్య మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది.
లోకల్ ఎన్నికల కోసం
చేరికలపై ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ బడా నేత ఒకరు తెర వెనుక చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. హైకమాండ్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. జూన్ నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనుండటంతో బీఆర్ఎస్ పార్టీని మరింత వీక్ చేసి కాంగ్రెస్ బలాన్ని పెంచే ప్రయత్నాలు సాగుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే చేరికలపై వేగం పెంచినట్టు వార్తలు వస్తున్నాయి.