- బీఆర్ఎస్ ను కలవరపెడుతున్న ఇండిపెండెంట్ గుర్తులు
- కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్, రోటీ మేకర్, ట్రక్కు
- 2019లో రోడ్డు రోలర్ గుర్తుకు 25 వేలకు పైగా ఓట్లు
- జాతీయ పార్టీలైన సీపీఎం, బీఎస్పీ కన్నా ఎక్కువ ఓట్లు
- అప్పట్లో ఇన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు
- స్పందించని ఎన్నికల అధికారులు
- పార్టీల గెలుపోటములు తారుమారు చేస్తున్న సింబల్స్
- భారీగా ఓటింగ్ శాతం పై ప్రభావం
BRS Tension about party symbls of independents:
ఓటమి దిగులుతో కునారిల్లుతున్న బీఆర్ఎస్ నేతలకు రోజురోజుకూ పరిస్థితి మరింత దయానకంగా తయారవుతోంది. పార్లమెంట్ ఎన్నికలలో గెలుపొందేందుకు వ్యూహాలు రూపొందించుకుంటున్న బీఆర్ఎస్ నేతలకు ఇప్పుడు మరో టెన్షన్ పట్టుకుంది. ఎలాగైనా ఈ సారి జరిగే లోక్ సభ ఎన్నికలలో కనీస స్థానాలు సాధించాలని కలలు కంటున్న కారు పార్టీకి ఇండిపెండెంట్ నేతలకు ఈషీ కేటాయించిన గుర్తులు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలలోనూ ఇదే విషయమై బీఆర్ఎస్ నేతలు అప్పట్లో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. ముఖ్యంగా కారును పోలిన రోడ్డు రోలర్, రోటీ మేకర్‌లు పార్లమెంటు ఎన్నికల బరిలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను టెన్షన్ పెడుతున్నాయి.
కంటోన్మెంట్ లో కలకలం
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో పోటీచేస్తోంది యుగ తులసి పార్టీ. ఆ పార్టీకి కి రోడ్డు రోలర్ గుర్తు కేటాయించబడింది. స్వతంత్ర అభ్యర్థులకు రోటీ మేకర్ గుర్తు లభించింది. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో యుగ తులసి పార్టీ అభ్యర్థి కె. శివ కుమార్‌కు ఈవీఎం బ్యాలెట్ యూనిట్‌లో 5 నంబర్ ఉన్న రోడ్డు రోలర్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. ఈవీఎం బ్యాలెట్ యూనిట్‌లో 4గా ఉన్న కారు గుర్తుపై ఇక్కడ బీఆరెస్ అభ్యర్థి టి. పద్మారావు గౌడ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి దండెం రత్నంకు రోడ్డు రోలర్ గుర్తు లభించగా, నివేదిత సాయన్నఈ స్థానంలో కారు గుర్తుతో బీఆర్ఎస్ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. హైదరాబాద్ లోక్‌సభ రేసులో స్వతంత్ర అభ్యర్థికి రోటీ మేకర్ గుర్తును కేటాయించారు.
రోడ్ రోలర్ గుర్తుకు 25 వేల ఓట్లు
గతంలో 2019 భువనగిరి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 5వేల ఓట్ల మెజార్టీతో గెలవగా.. ఇక్కడ కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్ నుంచి పోటీ చేసిన అభ్యర్థికి ఏకంగా 25 వేల ఓట్లు వచ్చాయి. ఇప్పుడూ ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి రెండు స్థానాల్లోనూ స్వతంత్రులకు రోడ్డు రోలర్, రోటీ మేకర్ గుర్తులు కేటాయించారు. రాష్ట్రంలోని ఇతర ఎంపీ స్థానాల్లోనూ ఆ గుర్తులు కలిగిన వారు పోటీలో ఉన్నారు. దీంతో వారు ఈ సారి పార్లమెంటు ఎన్నికల్లో ఎవరి గెలుపు అవకాశాలను దెబ్బకొడతారనే చర్చ సాగుతోంది. 2018 ఎన్నికల్లో కారును పోలిన గుర్తుల వల్ల బీఆర్ఎస్ అభ్యర్థులకు 20కిపైగా స్థానాల్లో నష్టం జరిగిందని బీఆర్ఎస్ వాపోయింది. ఇందుకు గుర్తింపు పొందిన ఇతర పార్టీల అభ్యర్థులకన్నా కారును పోలిన గుర్తులతో బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు పోలవ్వడాన్ని రుజువుగా చూపింది.
సీపీఎం, బీఎస్పీకన్నా ఎక్కువగా..
మునుగోడు, జహీరాబాద్, సిర్పూర్, డోర్నకల్‌లో 2018 ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తుకు సీపీఎం, బీఎస్పీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆ పార్టీ పేర్కోంది. నర్సంపేట, చెన్నూరు, దుబ్బాక, సిద్దిపేట, ఆసిఫాబాద్, బాన్సువాడ, గద్వాల, నాగార్జునసాగర్‌లో కెమెరా గుర్తుకు కూడా బీఎస్పీ, సీపీఎం కన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయని నివేదించింది. నకిరేకల్ నుంచి పోటీ చేసి గెలిచిన చిరుమర్తి లింగయ్యకు 8259 ఓట్ల మెజార్టీ రాగా ఇక్కడి నుంచి సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ట్రక్కు గుర్తుపై పోటీ చేసినదుబ్బ రవి అనే అభ్యర్థికి ఏకంగా 10383 ఓట్లు వచ్చాయి. అదే ఎన్నికల్లో కోదాడలోనూ బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేకు 756 ఓట్లు మెజార్టీ రాగా, ఇక్కడ స్వతంత్ర అభ్యర్థికి ఏకంగా 5240 ఓట్లు రావడం అప్పట్లో చర్చనీయాంశమైంది.