MLC Election: అధికారంలో ఉన్నప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా కనిపించింది. ఎప్పుడైతే అధికారం పోయిందో తరుచూ ఆ పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. పార్టీ శ్రేణులకు, నాయకులకు మధ్య గ్యాప్ తరుచూ కనిపిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక కొన్ని చోట్ల ఓటమిపై సమీక్షా సమావేశాలు నిర్వహించగా క్యాడర్ నుంచి తీవ్ర అసంతృప్తిని అధినాయకులు చవిచూడాల్సి వచ్చింది. తాజాగా, ఎమ్మెల్సీ ఉపఎన్నిక కోసం బీఆర్ఎస్ నిర్వహించిన సన్నాహక సమావేశానికీ పార్టీ నాయకులు డుమ్మా కొట్టారు. మాజీ ఎమ్మెల్యేలు సైతం గైర్హాజరయ్యారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 30 మంది నాయకులకు ఆహ్వానం పంపారు. కానీ, సుమారు 100 మంది నాయకులు ఈ మీటింగ్‌కు డుమ్మా కొట్టారు. వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులు సమీక్షకు రాలేదు.
అభ్యర్థి పైనా వ్యతిరేకత
బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన పల్లారాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్నది. నాలుగు సార్లు బీఆర్ఎస్ గెలిచిన ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ ఏనుగుల రాకేశ్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఈయన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సన్నిహితుడు. రాకేశ్ రెడ్డికే అవకాశం వచ్చేలా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇన్‌ఫ్లుయెన్స్ చేసినట్టు వరంగల్ నాయకులు భావిస్తున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. ఏనుగు రాకేశ్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి దాస్యం వినయ్ భాస్కర్‌కు మధ్య కొంతకాలంగా విభేదాలు నెలకొన్నాయి.
Also Read: గ్యాంగ్‌స్టర్ నయీంతో తీన్మార్ మల్లన్నకు పోలిక.. కేటీఆర్ ఏమన్నారు?
బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్!
ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డిని ఎంపిక చేస్తూ తీసుకున్న నిర్ణయంపై సీనియర్ నాయకులే వ్యతిరేకించడంపై బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ అయింది. నేతల మధ్య సమన్వయం తప్పకుండా ఉండాలని ఈ నేపథ్యంలోనే కేటీఆర్ అన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేయాలని వరంగల్ నాయకులకు సూచనలు చేశారు. సిట్టింగ్ స్థానాన్ని కచ్చితంగా గెలిచి తీరాలని నేతలను ఆదేశించారు.
విద్యావంతుడైన ఏనుగుల రాకేశ్ రెడ్డి.. నరేంద్ర మోదీ పాలనతో ప్రేరణ చెంది 2013లో బీజేపీలో చేరారు. బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా, బీజేపీ రాష్ట్ర ప్రతినిధిగా పని చేశారు. కేసీఆర్ నాయకత్వంలో సేవ చేయాలనే లక్ష్యంతో 2024లో ఆయన బీఆర్ఎస్‌లో చేరారు. తాజాగా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్నారు.