సమాంతర మహిళా రిజర్వేషన్లపై బద్నాం చేస్తున్న కేసీఆర్ అండ్ కో
ఉద్యోగావకాశాలను కోల్పోతున్న మహిళలు అంటూ ప్రచారం
ఉద్యోగ నియామకాలలో సమాంతర రిజర్వేషన్ల అమలుపై జీవో ఇచ్చిన కేసీఆర్
నాడు సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించే జీవో విడుదల చేసిన బీఆర్ఎస్
ఆ జీవోనే రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగిస్తోంది
తప్ప వాళ్లు చేసి నిందలు కాంగ్రెస్ సర్కార్ పై మోపుతున్న బీఆర్ఎస్
ఇంత జరుగుతున్నా నోరు మెదపని సంబంధిత అధికారులు
అధికారుల మౌనంతో కాంగ్రెస్ సర్కార్ ను అనుమానిస్తున్న మహిళా నిరుద్యోగులు
BRS rise voice on T.Congress horizontal reservations issue women jobs:
తెలంగాణలో ఉద్యోగ నియామకాలలో మహిళలకు కాంగ్రెస్ సర్కార్ తీరని అన్యాయం చేస్తోందంటూ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతలు గొంతు చించుకుని నేరారోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే నెంబర్ 3 జీవో జారీ చేసి సమాంతర రిజర్వేషన్ల పేరిట మహిళలకు అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ నేతల ఆందోళన. ఆ మధ్య గ్రూప్ పరీక్షల నోటిఫికేషన్ సమయంలోనూ ఎమ్మెల్సీ కవిత మహిళా రిజర్వేషన్లపై ప్రస్తుత ప్రభుత్వ ఉత్తర్వులు రద్దు చేయాలని ఇలా చేస్తే మహిళలకు 33 శాతం ఉద్యోగావకాశాలు దెబ్బతింటాయని,మహిళా రిజర్వేషన్ల వ్యవస్థకు రేవంత్ రెడ్డి తూట్లు పొడుస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు తీరని అన్యాయం జరుగుతోందని బహిరంగ విమర్శలకు దిగారు. ఆమె ఆరోపణల్లో నిజం ఎంత శాతం? బీఆర్ఎస్ నేతలు చెబుతున్నది నిజమేనా? అని ప్రశ్నించుకుంటే అసలు తప్పంతా బీఆర్ఎస్ నేతలదే అంటున్నారు విమర్శకులు.
వర్టికల్-హారిజంటల్ రిజర్వేషన్లు
భారత రాజ్యాంగం ఆర్టికల్ 16(4) ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఉద్యోగ నియామకాల్లో కల్పించే రిజర్వేషన్లను సోషల్ రిజర్వేషన్లుగా పరిగణిస్తారు. ఈ సోషల్ రిజర్వేషన్లను వర్టికల్ విధానంలో అమలు చేస్తారు. వర్టికల్ రిజర్వేషన్ విధానంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులు నాన్-రిజర్వుడ్ పోస్టులకు తమ ప్రతిభ ఆధారంగా ఎంపికైతే, సదరు పోస్టులను వారికి నిర్దేశించిన రిజర్వుడ్ కోటాలో లెక్కించరు. రిజర్వుడ్ కోటా పోస్టులను తగ్గించరు కూడా. ఓపెన్ కాంపిటీషన్‌లో ఎంతమంది అభ్యర్థులు ఎంపికైనా రిజర్వేషన్ కోటా పూర్తయినట్లు కాదు. ఈ అభ్యర్థులను లెక్కలోకి తీసుకోకుండానే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికి నిర్దేశించిన మొత్తం రిజర్వుడ్ పోస్టులను సైతం వారితో భర్తీ చేయాల్సిందే. దీన్నే వర్టికల్ విధానంగా పేర్కొంటారు. ఇక, ఆర్టికల్ 16(1) లేదా 15(3) ప్రకారం ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు మహిళలకు ఉద్యోగ నియామకాల్లో కల్పించే రిజర్వేషన్లను స్పెషల్ రిజర్వేషన్లుగా పరిగణిస్తారు. ఈ స్పెషల్ రిజర్వేషన్లను హారిజాంటల్ విధానంలో అమలు చేయాలని పేర్కొంటూ రాజేష్ కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని రిట్ పిటిషన్ నం.27844 ఆఫ్ 2022 రిట్ పిటిషన్ నం.38502 ఆఫ్ 2022లో ప్రభుత్వాన్ని, టీఎస్పీఎస్సీ రాష్ట్ర హైకోర్టు అక్టోబర్ 14, 2022 నాడు ఆదేశించింది. మహిళలు, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు తమ మెరిట్‌తో ఓపెన్ కోటాలో సెలెక్టయ్యే పోస్టులను వారికి నిర్దేశించిన రిజర్వుడ్ కోటా పోస్టుల నుంచి తగ్గించి, మిగతా పోస్టులను మాత్రమే రిజర్వేషన్లతో భర్తీ చేయాలని చెప్పేదే హారిజాంటల్ విధానం.ఉదాహరణకు, ఒక కేటగిరి ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 25 పోస్టులు రిజర్వుడ్ కోటాలో భర్తీ చేయాల్సి ఉందనుకుందాం. ఓపెన్ కాంపిటీషన్‌లోనే 25 లేదా అంతకు మించి మహిళా అభ్యర్థులు సెలెక్టయితే, ఇక మహిళలకు రిజర్వుడ్ కోటా ఉండదు. మహిళా కోటా పూర్తిగా భర్తీ అయినట్లే భావిస్తారు. ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు సైతం ఈ నిబంధనే వర్తిస్తుంది.
బీఆర్ఎస్ పాలనలోనే ఉత్తర్వులు
సుప్రీంకోర్టు తీర్పు, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఉద్యోగ నియామకాల్లో 33.33 % శాతం మహిళా రిజర్వేషన్లను హారిజాంటల్ విధానంలో అమలు చేయాలని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ని ఆదేశిస్తూ కేసీఆర్ ప్రభుత్వం, 2022లో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మెమోతో కేసీఆర్ ప్రభుత్వమే మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చింది. దీని కొనసాగింపుగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 10న 3వ నెంబర్ జీవో జారీ చేసింది. మహిళా రిజర్వేషన్ల అంశంలో వాస్తవాలు ఇవి కాగా, మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వమే హారిజాంటల్ రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చి అన్యాయం చేస్తోందంటూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రభుత్వాన్ని విమర్శించడం, నిరాహారదీక్షలకు దిగడం ద్వారా వారు తమ సహజ గుణాన్ని మరోసారి బయట పెట్టుకున్నారు. అబద్ధాలు, అవాస్తవాలు ప్రచారం చేసి ప్రజలను మభ్య పెట్టవచ్చని వారు ఇంకా నమ్ముతున్నట్టున్నారు. పదేళ్ళపాటు పారదర్శకతకు పాతరేసి, జీవోలను దాచిపెట్టి, చీకటి పాలన చేసిన వారి నైజాన్ని ప్రజలు అప్పుడే మర్చిపోలేదు. హారిజాంటల్ విధానంలో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని 2022లో తమ ప్రభుత్వ హయాంలోనే ఉత్తర్వులు జారీ చేసిన విషయం దాచిపెట్టి కొత్త ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఆ పార్టీ నేతలు ఉద్దేశ్యపూర్వకంగా యత్నించినట్లు స్పష్టమవుతోంది.
అధికారులు ఏం చేస్తున్నారు
బీఆర్ఎస్ పార్టీ నేతలు మహిళా రిజర్వేషన్లపై అబద్ధపు ప్రచారాలతో నిరాహారదీక్షలకు కూర్చొని ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మహిళా వ్యతిరేకిగా చిత్రీకరిస్తుంటే, రాష్ట్ర ఉన్నతాధికారులు కనీసం దానిని ఖండించకపోవడం శోచనీయం. ఎన్నికల సమయంలో మహిళా ఓటర్ల మెప్పుకోసం, వారి ఓట్ల కోసం కేసీఆర్ అండ్ కో చేస్తున్న ఈ విష ప్రచారాన్ని కనీసం తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేయడం లేదు అధికారులు. మహిళా రిజర్వేషన్ వంటి సున్నితమైన అంశంలో ప్రధాన ప్రతిపక్షం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంటే, వాస్తవాలను ప్రజలకు వెల్లడించేందుకు తనకెందుకు బ్రీఫ్ చేయలేదో సంబంధిత అధికారుల నుంచి సీఎం వెంటనే వివరణ కోరాలి. రేవంత్ సర్కార్ మౌనంగా ఉంటే తప్పంతా వీళ్లదే అనుకునే ప్రమాదం ఉంది. ఇకనైనా సమాంతర రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ ఓ క్లారిటీ ఇస్తే బాగుంటుందని రాజకీయ విమర్శకులు కోరుతున్నారు.