– బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు
– మూడు రోజులకు షెడ్యూల్ ప్లాన్
– గన్ పార్క్ నుంచి అమర జ్యోతి వరకు భారీ ర్యాలీ
BRS: తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఒకరోజుతో సరిపెట్టడంపై బీఆర్ఎస్ అభ్యంతరం చెబుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తోంది. ఇదే క్రమంలో బీఆర్ఎస్ మూడు రోజులపాటు ఆవిర్భావ వేడుకలకు ప్లాన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జూన్ 1 నుండి 3 వరకు అవతరణ వేడుకలు జరగనున్నాయి. జూన్ 1న సాయంత్రం 5 గంటలకు పబ్లిక్ గార్డెన్‌కు 10 వేల మంది వచ్చేలా ప్లాన్ చేస్తోంది గులాబీ పార్టీ. సాయంత్రం 6 గంటలకు గన్ పార్క్ వద్ద కేసీఆర్ నివాళులు అర్పించిన అనంతరం, అక్కడి నుంచి సచివాలయం ఎదురుగా ఉన్న అమర జ్యోతి వరకు భారీ కవాతు చేయనుంది.
తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్వహించిన కవాతును గుర్తు చేసేలా, వెయ్యి మంది కళాకారులతో, తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన లాయర్లు, డాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, మహిళలు, ఇలా అందరితో ఈ ర్యాలీ చేయనుంది. ఇందులో కేసీఆర్ కూడా పాల్గొననున్నారు. అలాగే, జూన్ 2న తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాతో పాటుగా పార్టీ జెండా ఆవిష్కరణ, కళింగ భవన్‌లో ఫోటో ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నారు. జూన్ 3న జిల్లాల పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాతో పాటుగా రోగులకు పండ్ల పంపిణి కార్యక్రయాలు ఉండనున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్ని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మీడియాకు వివరించారు.