- వరంగల్ బీఆర్ఎస్ నేతల నిర్వాకం
- ఎన్నికల ఫండ్‌ను వాటాలేసుకున్న వైనం
- మాజీమంత్రి, మాజీ ఎమ్మెల్యేలే వాటాదారులు
- ప్రచారంలో వెనకబడ్డ సుధీర్ కుమార్
- ఇలాగైలే ఓటమి ఖాయమంటున్న శ్రేణులు
- అధిష్ఠానం చెప్పినా పట్టించుకోని లోకల్ నేతలు
BRS party today news(Latest political news telangana): లోక్‌సభ ఎన్నికల వేళ.. వరంగల్ బీఆర్ఎస్ పార్టీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ ఎన్నికల్లో తొలుత కడియం కావ్యను బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ అక్కడ ప్రకటించారు. తర్వాతి పరిణామాల్లో ఆమె పోటీకి సిద్ధపడకపోవటంతో అక్కడ మారేపల్లి సుధీర్ కుమార్‌ను తమ అభ్యర్థిగా గులాబీ బాస్ ప్రకటించారు. అయితే, కొత్త అభ్యర్థిగా బరిలో దిగిన సుధీర్ కుమార్‌కు సొంత పార్టీ నేతలే సమస్యలు సృష్టిస్తు్న్నారు. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల కోసం అధిష్ఠానం పంపిన పార్టీ ఫండ్‌ను జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వరంగల్ పార్లమెంటు పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు కలిసి పంచుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామంతో బిత్తర పోయిన సుధీర్ కుమార్ పార్టీ పెద్దలకు ఈ విషయం చెప్పి వాపోయినట్లు సమాచారం. ప్రత్యర్థులు ఇంటింటా ప్రచారం ప్రారంభించి మహిళా కార్యకర్తలతో బొట్టు, మెహందీ వంటి కార్యక్రమాలు చేస్తుండగా తాము ప్రచారంలో పూర్తిగా వెనకబడిపోయామని ఆయన అధిష్ఠానంతో మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా లోక్‌సభ ఎన్నికల వేళ బూత్ కమిటీలు ఏర్పాటు చేయటం, మండలస్థాయిలో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసి ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పార్టీ నేతలు ప్రచారంలో పాల్గొనటం తెలిసిందే. వీటి నిర్వహణ కోసం పార్టీలు తమవంతుగా కొంత సొమ్మును పంపుతుంటాయి. అవసరాన్ని బట్టి అభ్యర్థులు తమ వాటాను కూడా జోడించి, గ్రామాల వారీగా బూత్‌లలో పోలింగ్ రోజున తమ ఓట్ల సంఖ్యను పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ, ఈసారి ఇంతవరకు బూత్ కమిటీలకు నయా పైసా అందకపోవటంతో ఆ నేతలంతా నిరాశలో కూరుకుపోయారు. మరోవైపు గతంలో ఇక్కడ సీటు కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని తిరిగిన నేతలెవరూ ఇప్పుడు నియోజక వర్గంలో కనిపించటం లేదు. వరంగల్ సీటు పరిధిలో విపక్ష బీజేపీ, అధికార కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే గ్రామాల స్థాయి ప్రచారం చేస్తుంటే, తమ పార్టీ నేతలు ఇల్లు కదలకపోవటం పట్ల గులాబీ పార్టీ కేడర్ మండిపడుతోంది. పదేళ్ల తమ పాలనలో మంత్రిగా ఉన్న నేత, ఆయా సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలుగా బాగా సంపాదించుకున్న తమ పార్టీ నేతలు చివరికి ఎన్నికల కోసం పంపిన పార్టీ ఫండ్‌ను వాటాలు వేసుకుని మరీ పంచుకు తినటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: రైతు జపం.. ఎవరికి వరం..?
మరో నాలుగు రోజుల్లో ప్రచార పర్వం ముగియబోతుంటే, ఈ చిల్లర వేషాలేంటని అటు పార్టీ అధిష్టానం కూడా చిలక్కొట్టుడు నేతల మీద మండిపడినట్లు సమాచారం. ఎన్నికలంటేనే అందర్నీ కలుపుకొనిపోవాలని, పదేళ్ల పాటు పదవులు అనుభవించిన నేతలు.. పార్టీ ఫండ్‌కు తమ వాటా వేసి, అక్కడి అభ్యర్థిని గెలిపించాల్సింది పోయి, ఇలాంటి చౌకబారు వేషాలు వేస్తే జనానికి ఎలాంటి సందేశం పోతుందని పార్టీ పెద్దలు వాటాలు పంచుకున్న ప్రజాప్రతినిధులను మందలించినట్లు సమాచారం. చివరి నాలుగు రోజులైనా సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రచారంలో పాల్గొనాలని, ద్వితీయ శ్రేణి నాయకులను కలుపుకుని సుధీర్ కుమార్ గెలుపుకు కృషి చేయాలని పార్టీ ఎన్నికల వ్యవహారాల బాధ్యలు వరంగల్ నేతలను బతిమిలాడుకుంటున్నారని సమాచారం.