– కాంగ్రెస్‌లో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
– అదే బాటలో మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్
– సొంతగూటికి మాజీ మంత్రి రవీంద్ర నాయక్
– హస్తం పార్టీలో చేరిన కేటీఆర్ బావమరిది
– మరో వారంలో మరిన్ని వలసలు..
BRS Leaders To Join In Congress Party: గత ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయి విపక్షానికి పరిమితమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీని కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నా్లన్నీ దారుణంగా బెడిసి కొడుతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలను నిలబెట్టుకోవటానికి మైండ్ గేమ్‌కి దిగిన గులాబీ బాస్ గురువారం తెలంగాణ భవన్ సమావేశంలో నేతలతో చిట్‌చాట్‌గా చేసిన కామెంట్లు 24 గంటలు గడవకముందే ఆయనకు షాక్ తినిపించాయి. ‘నాతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు’ అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన కేసీఆర్ మాటలను అబద్ధం చేస్తూ.. శుక్రవారం ఉదయం రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. రేపోమాపో ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.
మరోవైపు శుక్రవారమే.. బీఆర్ఎస్ వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు ఫ్యాక్స్ ద్వారా జిల్లా అధ్యక్షుడికి పంపారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి, గులాబీ పార్టీలో చేరిన రాములు నాయక్‌కు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ నిరాకరించారు. అయినా పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. అలాగే, మాజీ ఎంపీ డి.రవీంద్ర నాయక్ కూడా శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈయన ఉమ్మడి ఏపీలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, 2004లో వరంగల్ ఎంపీగా పని చేశారు. 2019లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రవీంద్రనాయక్.. గత నెలలో బీజేపీకి గుడ్‌బై చెప్పారు. బంజారా కమిషన్ ఏర్పాటు పట్ల బీజేపీ నాయకత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ నేడు ఆయన సొంతగూటికి చేరారు.
Also Read:నాగర్ కర్నూల్‌లో నెగ్గేది ఎవరో..?
మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కూడా శుక్రవారం ఊహించని షాక్ తగిలింది. ఆయన బావమరిది ఎడ్ల రాహుల్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేటీఆర్ సతీమణికి దూరపు బంధువు, కేటీఆర్‌కు వరుసకు బామర్థి అయిన రాహుల్ రావు కాంగ్రెస్ తీర్థం శుక్రవారం మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే భద్రాచలం, స్టేషన్ ఘన్‌పూర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.