- పాతగూటికి చేరనున్న కేకే, ఆయన కుమార్తె?
- అదే జాబితాలో ఇంద్రకరణ్ రెడ్డి, ఒంటేరు పేర్లు?
- కాంగ్రెస్ వైపు పలువురు ఎమ్మెల్యేల చూపు
- జీహెచ్ఎంసీలో పలువురు కార్పొరేటర్లదీ అదే దారి
BRS Leaders Getting Down From The Car : లోక్‌సభ ఎన్నికల వేళ.. తెలంగాణ రాజకీయం రోజుకోరకంగా మారుతోంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరటంతో బాటు ఇద్దరు ఎమ్మెల్యేలు, పలువురు సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్‌లో చేరగా, ఇంకా డజనుకు పైగా ఎమ్మె్ల్యేలు ఇదే బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సొంతపార్టీపై అసంతృప్తితో వస్తున్న నేతలకు కాంగ్రెస్ ఆహ్వానం పలకుతుండటంతో విపక్షాలు కిందామీదా అయిపోతున్నాయి.
తాజాగా బీఆర్ఎస్ నేత, రాజ్యసభ్య సభ్యుడు కె.కేశవరావును కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ కలిశారు. బంజారాహిల్స్‌లోని కేకే నివాసానికి ఆమెతో పాటు ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డితో కలిసి ఆమె కేకే నివాసంలో ఆయన కుమార్తె, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిని కలవటం గులాబీ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. దాదాపు 40 నిమిషాల పాటు కొనసాగిన ఈ భేటీ అనంతరం విజయలక్ష్మి మాట్లాడుతూ, పార్టీలో చేరే విషయంలో కార్యకర్తల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఇప్పటికే డిప్యూటీ మేయర్ శ్రీలతా రెడ్డి సహా 10మందికి పైగా కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరగా.. మరో 13మంది హస్తం గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోన్న వేళ.. విజయలక్ష్మి, కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ భేటీ రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ హైదరాబాద్ నగరంలోని ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించలేకపోయింది. కానీ, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ స్థానాలను కాంగ్రెస్ టార్గెట్ చేసిందనీ, ఈ వరుస భేటీలు, కొనసాగుతున్న చేరికలు దానినే సూచిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also : మల్కాజ్ గిరిపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్
ఇక, గురువారం రోజున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గురువారం మాజీ హోం మంత్రి జానారెడ్డితో భేటీ కావటం, శుక్రవారం కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ కే.కేశవరావు ఇంటికి రావటం, కేకేతో ఇంద్రకరణ్ రెడ్డికి సన్నిహిత సంబంధాలుండటంతో ఇంద్రకరణ్ రెడ్డి కూడా కాంగ్రెస్ చేరటం ఖాయమేననే వార్తలకు బలమిస్తోంది. రెండు రోజుల క్రితమే ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈయన గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలిచారు.
మరోవైపు నిన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థిగా వార్తల్లో నిలిచిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తనకు ఇవ్వజూపిన ఎంపీ అభ్యర్థిత్వాన్ని ఆయన నిరాకరించటం వెనక అసలు కారణం అదేనని స్థానిక గులాబీ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. మరోవైపు ఖమ్మం గులాబీ అభ్యర్థిగా ఉన్న నామా నాగేశ్వరరావు కూడా అన్యమనస్కంగానే ఎంపీగా బరిలో దిగుతున్నారని, వాస్తవానికి ఆయనను పార్టీలో చేరాలని బీజేపీ ఒత్తిడి చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి.