Politics

Hyderabad : గంప ’గుత్త‘ విమర్శలు అందుకేనా?

  • బీఆర్ఎస్ కు దూరం అవుతున్న సీనియర్ నేతలు
  • ఇప్పుడు అదే బాటలో పయనిస్తున్న గుత్తా సుఖేందర్ రెడ్డి
  • పార్టీ తీరు, కేసీఆర్ వ్యవహార శైలిపై బాహాటంగా విమర్శలు
  • గుత్తాకు ఆరు నెలలుగా అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్
  • కేసీఆర్ బూతులు మాట్లాడటం సరికాదు
  • అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిపై ఇంతవరకూ సమీక్సించలేదు
  • రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారిన గుత్తా కామెంట్స్
  • గుత్తా పార్టీ మారతారేమోనని బీఆర్ఎస్ నేతల కలవరం
  • కాంగ్రస్ పార్టీలోకి మారతారని ప్రచారం
  • తాను ఓడినా గౌరవప్రదంగా భావిస్తానంటున్న గుత్తా
  • జగదీశ్ రెడ్డితో గత కొంతకాలంగా విబేధాలు

BRS Gutta Sukhendar Reddy changing congressparty
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అన్న తీరుగా ఉంది బీఆర్ఎస్ పార్టీ…వెళ్లే వాళ్లకు బుజ్జగింపులు లేవు…వచ్చేవారికి హారతులు లేవు. తుపాను ముందర ప్రశాంతతలా ఉంది ఆ పార్టీ. కడియం, కేకే లాంటి సీనియర్ నేతలు బీఆర్ఎస్ కు బైబై చెబుతుంటే వాళ్లను ఎంత మాత్రం వారించకుండా కుక్కలు, నక్కలు అంటూ అవాకులు, చవాకులు పలుకుతున్నారు కేటీఆర్. ఇప్పుడు ఆ సీనియర్ల బాటలోనే మరో సీనియర్ నేత పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా? ఇంతకీ ఎవరా నేత ? ఏమా కథ?

స్వరం మారుస్తున్న గుత్తా సుఖేందర్ రెడ్డి
బీఆర్ఎస్ పార్టీకి అండదండగా ఉంటూ వచ్చిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా క్రమంగా స్వరం మారుస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ తీరుపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఆ పార్టీ లీడర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి. భవిష్యత్‌లో గుత్తా సైతం పార్టీ వీడేందుకు సిద్ధం అవుతున్నారా..? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన గులాబీ బాస్ కేసీఆర్ పనితీరుపై విమర్శలు చేశారా..? అని చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోడానికి సిద్దంగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతున్నది. ఇలాంటి సమయంలో గుత్తా చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్‌గా మారాయి.

పార్టీ అధినేతపై హాట్ కామెంట్స్

” రానున్న ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కష్టమే. పార్టీ నిర్మాణాత్మకంగా లేదు. గెలిచినా, ఓడినా సమీక్ష చేయలేదు. ఆరు నెలలుగా అపాయింట్‌మెంట్ అడిగినా కేసీఆర్ టైం ఇవ్వలేదు. అమిత్‌ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలని కేసీఆర్ చెప్పారు.నల్గొండ పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అమిత్‌ని కలిశారు. అమిత్ పోటీ చేస్తే కొందరు సహకరిస్తామన్నారు. మరికొందరు పార్టీ మారుతామన్నారు. ఆ పరిస్థితుల్లో గెలవాలని అనుకోలేదు. ఓడినా గౌరవప్రదంగా ఉండాలనుకున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బూతులు మాట్లాడటం సరికాదు. రాజకీయాల్లో ఇది మంచిది కాదు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌తో పార్టీ నష్టపోయింది. కేసీఆర్ ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తేనే పార్టీ మనుగడ సాధ్యమవుతుంది” అని గుత్తా పేర్కొన్నారు. గుత్తా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశం అవుతున్నాయి.

జగదీశ్ రెడ్డితో విభేధాలే కారణమా?

రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఇమడలేకపోతున్నారనే టాక్ ఉంది. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డితో ఆయనకు రాజకీయ విభేదాలు ఉండటం వల్లే ఆయన కుమారుడికి ఎంపీ టికెట్ రాలేదని చర్చ జరుగుతున్నది. అందుకే ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం ఉంది. అయితే తాను పార్టీ మారే ప్రసక్తి లేదని గుత్తా క్లారిటీ ఇచ్చినా, ఎప్పుడో ఒకప్పుడు ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆయనకు పార్టీ మారే ఆలోచన లేకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కేసీఆర్ తీరునే కారణమని అర్థం వచ్చే విధంగా ఎందుకు మాట్లాడారు..? అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తులు రాజకీయాలు మాట్లాడకూడదు. కానీ గుత్తా మొదట్నించి ఇష్టానుసారంగా రాజకీయాలపై ప్రకటనలు చేస్తున్నారనే విమర్శలు గులాబీ పార్టీలో ఉన్నాయి.

కొంప ముంచుతున్న కేసీఆర్ కామెంట్స్

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారంటూ కేసీఆర్ చేసిన కామెంట్స్ తరువాత గులాబీ పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. తెల్లారే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కేసీఆర్ పనితీరే కారణమని ఆరోపించారు. దీనితో గులాబీ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళన పట్టుకున్నది. అయితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఇద్దరు ఎమ్మెల్సీలు కూసుకుంట్ల దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుపై చైర్మన్ హోదాలో గుత్తా ఏం చర్యలు తీసుకంటారు..? ఫిర్యాదుపై విచారణ చేపడుతారా..? ఒకవేళ విచారణ మొదలుపెట్టి, తుది నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు..? అనేది ఆసక్తికరంగా మారింది.