– ప్రైవేట్ వర్శిటీలకు రెడ్ కార్పెట్ వేసిన బీఆర్ఎస్ సర్కార్
– ప్రణాళిక లేని విధానాలతో ప్రభుత్వ వర్శిటీలపై అలసత్వం
– కొత్త ప్రభుత్వంపైనే పేద విద్యార్థుల ఆశలు
– రేపటితో ముగుస్తున్న యూనివర్సిటీ వీసీల పదవీకాలం
– ఖాళీ అయ్యే పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్న విద్యాశాఖ
– ఇప్పటికే సెర్చ్ కమిటీల నియామకం
– కమిటీల భేటీకి ఈసీ అనుమతి కోరిన అధికారులు
Telangana: విజ్ఞానాన్ని పంచి అనేక మంది మేధావులను, ఉన్నత విద్యావంతులను సమాజానికి అందిస్తూ అనేక ఆసక్తికరమైన అంశాలను తెరపైకి తీసుకువచ్చే పరిశోధన కేంద్రాలుగా విలసిల్లవల్సిన ప్రభుత్వ యూనివర్శిటీలు నేడు కనీస సౌకర్యాలు లేక నిర్లక్ష్యానికి గురవుతూ అసౌకర్యాలకు నిలయంగా మారాయి. స్వరాష్ట్రం వస్తే ప్రభుత్వ యూనివర్సిటీల్లో మెరుగైన వసతులతో కూడిన విద్య అందుతుందనే నమ్మకంతో తెలంగాణ ప్రాంతంలోని ఉస్మానియా, కాకతీయ సహా అన్ని యూనివర్సిటీల విద్యార్థులు తెగించి కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అయితే, ఎన్నో ఆశలు పెట్టుకున్న నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం యూనివర్సిటీలను కనీసం పట్టించుకోకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసిందనే విమర్శలున్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను పూర్తిగా నిర్వీర్యం చేసిందనే ఆరోపణలు వినిపించాయి. బీఆర్ఎస్ తీరుతో పేద బడుగు బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులు మెరుగైన విద్యకు దూరం అయ్యారు. కొత్తగా ఏర్పడ్డ రేవంత్ సర్కార్ అయినా పట్టించుకుని న్యాయం చేస్తుందన్న ఆశల్లో విద్యార్థులు ఉన్నారు. త్వరలో ఖాళీ అవుతున్న వీసీల నియామకానికి సంబంధించిన కసరత్తును విద్యాశాఖ వేగవంతం చేయడంతో ప్రభుత్వ యూనివర్సిటీలపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని నమ్ముతున్నారు.
రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా?
2014లో కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ సర్కార్ అప్పటి వీసీల కాలపరిమితి తీరిన తర్వాత రెండేళ్లు ఐఎఎస్ ఆఫీసర్లను వీసీలుగా నియమించింది. అయితే, అప్పడు విశ్వవిద్యాలయాల పరిపాలన నత్తనడకన సాగింది. 2016లో తొలిసారిగా తెలంగాణలో వీసీల నియామకాలు జరిగాయి. 2019లో మళ్ళీ ఇన్‌చార్జిల పాలన తర్వాత పూర్తిస్థాయిలో 2021లో నియామకాలను చేపట్టింది. ఈ కాలం అంతా యూనివర్సిటీలను ఎన్నడూ పేదలకు విద్యను అందించే కేంద్రాలుగా కేసీఆర్ ప్రభుత్వం చూడలేదన్న అపవాదు ఉంది. కేవలం అప్పటి అధికార పార్టీ రాజకీయ నాయకుల పునరావాస కేంద్రాలుగా వీటిని మార్చారనే విమర్శలున్నాయి. అధ్యాపకుల నియామకాలు చేపట్టకపోవడం, రీసెర్చ్ గ్రాంట్స్ విడుదల చేయకపోవడంతో పరిశోధనలు పక్కదారి పట్టాయి. రాజకీయ జోక్యం కారణంగా కుల, మత ప్రభావంతో విశ్వవిద్యాలయాలు తమ ప్రభ కోల్పోయాయి. అభివృద్ధి, నాణ్యత లేక ప్రమాణాలు దిగజారిపోయి ర్యాంకింగ్స్‌లో పడిపోయాయి. అందుకే, వైస్ ఛాన్సలర్స్ నియామకాలు పారదర్శకంగా జరిగినప్పుడే వర్సిటీల అభివృద్ధి సాధ్యమవుతుంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు యూనివర్సిటీల నిధులు క్రమంగా తగ్గాయి. అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు శూన్యం. కొత్తగా మహిళా, ఫారెస్ట్ యూనివర్సిటీలను గత ప్రభుత్వం తీసుకుని వచ్చినా, కనీసం సౌకర్యాలు, ఫ్యాకల్టీ నియామకాలను చేపట్టలేదు. నిధులు లేక బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేసిన ఆందోళనలు చూశాం. విద్యార్థులకు మెస్, ల్యాబ్స్, లైబ్రరీ సౌకర్యాలు లేవు. రేకుల షెడ్లు, పాత భవనాల్లో హాస్టళ్లు నడుస్తున్నాయి. నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ యూనివర్సిటీల ప్రాధాన్యత తగ్గించే కుట్రలు జరిగాయన్న ఆరోపణలు వినిపించాయి. సరైన భోజన సదుపాయాలు, వైద్య, వసతి సదుపాయాలు కూడా లేవు.
రేపటితో ముగుస్తున్న వీసీల పదవీకాలం
ప్రస్తుతం పనిచేస్తున్న వీసీల పదవీకాలం రేపటితో ముగుస్తోంది. ఆ లోపు వీసీల నియామకానికి సంబంధించిన కసరత్తును విద్యాశాఖ వేగవంతం చేసింది. సెర్చ్ కమిటీల భేటీకి సిద్ధం అయ్యింది. ప్రస్తుతం ఒక్కో సెర్చ్ కమిటీలో యూజీసీ నామినీతో పాటు వర్సిటీ నామినీ, సర్కారు నామినీ ఉంటారు. ఈ కమిటీ సమావేశాలను నిర్వహించేందుకు విద్యాశాఖ రెడీగా ఉంది. కానీ, ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో కమిషన్ అనుమతి కోసం విద్యాశాఖ లేఖ రాసింది. ఎలక్షన్ కోడ్ జూన్ మొదటి వారం వరకూ ఉంటుంది. దీంతో సెర్చ్ కమిటీల భేటీ తర్వాత ఆ పేర్లను ప్రకటించాలన్నా మళ్లీ ఈసీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ముందుగానే సెర్చ్ కమిటీల భేటీతో పాటు, కొత్త వీసీల నియమాకానికి అనుమతి కోరింది. త్వరలోనే అనుమతి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈసీ అనుమతి రాగానే అన్ని వర్సిటీల సెర్చ్ కమిటీల సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పెరుగుతున్న వీసీల అక్రమాలు
కొన్ని కేసుల్లో హైకోర్టులు జడ్జిమెంట్లు ఇచ్చినా వర్సిటీల వీసీలు మాత్రం వాటిని అమలుపరచకపోవడంతో ధిక్కరణ నేరం కింద కూడా యూనివర్సిటీల మీద కేసులు పరిపాటి అయ్యాయి. విశ్వ విద్యాలయాల్లో అనేక అక్రమాలకు పాల్పడుతున్న వీసీల పట్ల విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తుంటే వారిపై అక్రమ కేసులు బనాయించడం, బదిలీలు చేయడం, షోకాజ్ నోటీసులు ఇవ్వడం, వ్యక్తగత కుట్రలు పన్నడం లాంటి పనులకు వీసీలు దిగజారారు. అందువల్ల హైకోర్టు జడ్జిమెంట్ కోసం వేచి చూస్తూ నిరాశకు గురవుతున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే వర్సిటీ విద్యార్థులు, ఉద్యోగులు కొంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ, ఇప్పటి వరకు వీసీ కేసుల పట్ల హైకోర్టు తేల్చకపోవడంతో అక్రమాలు ఇంకా పెరిగిపోతున్నాయని అంటున్నారు.
యూనివర్సిటీలు నిర్వీర్యం
బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టింపు లేని తనంతో తెలంగాణలోని ప్రభుత్వ యూనివర్సిటీలు నిర్వీర్యమయ్యాయనే విమర్శలున్నాయి. బోధన, బోధనేతర సిబ్బంది లేక, కనీస వసతులు లేక యూనివర్సిటీల్లో చదువుకొనే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు అనేక అవస్థలు పడ్డారు. సరైన వసతి లేకపోవడంతో పాటు పెరిగిన ఫీజులు విద్యార్థులకు తలనొప్పిగా మారాయి. యూనివర్సిటీలో సరైన సమీక్షలు లేకపోవడంతో అనేక అక్రమాలకు నిలయాలుగా మారాయని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ యూనివర్సిటీలను బీఆర్ఎస్ ప్రభుత్వం నీరుగార్చి ప్రైవేట్ యూనివర్సిటీలకు విచ్చలవిడిగా అనుమతులిచ్చి ప్రోత్సహించిందనే విమర్శలు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వ విధానాలు, అలాగే కొనసాగితే పేద బడుగు బలహీన వర్గాలకు పరిశోధన విద్య అందని ద్రాక్షగా మారే ప్రమాదం అయ్యేదని విద్యార్థి నాయకులు అంటున్నారు. అందుకే, బీఆర్ఎస్ ప్రభుత్వంపై విద్యార్థులు యుద్ధం ప్రకటించారనే చర్చ ఉంది. ఇప్పుడు రేవంత్ సర్కార్ యూనివర్సిటీల నిర్వహణపై విచారణ చేపట్టి, అక్రమార్కులపై చర్యలు తీసుకుని, పూర్తిస్థాయిలో సంస్కరించి పేద విద్యార్థులకు నాణ్యమైన, అన్ని వసతులతో కూడిన విద్యను అందిస్తారనే ఆశాభావంలో విద్యార్థులు ఉన్నారు.
జడ్జిమెంట్లకు నోచుకోని వీసీల కేసులు
రాజకీయ జోక్యంతో వచ్చిన వీసీలు రెగ్యులర్ కోర్సులను రద్దు చేస్తూ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను ప్రోత్సహిస్తున్నారు. వేలాది రూపాయలు పేద విద్యార్థుల నుంచి దండుకుంటున్నారు. తెలంగాణ రాకముందు ఉస్మానియా యూనివర్సిటీలో 3 నుంచి 5 వేల రూపాయలు ఉన్న కోర్సు ఫీజును రూ.35 వేలు చేశారు. రెండు వేలు ఉన్న పీహెచ్‌డీ ఫీజు 20 వేల రూపాయలకు పెంచారు. దీంతో అణగారిన వర్గాలు చదువుకు దూరం అయ్యాయి. గత ప్రభుత్వం కనీసం ఒక్కసారి కూడా యూనివర్సిటీ విద్య, సౌకర్యాలపై సమీక్ష చేయలేదు. ఈ ప్రభుత్వమైనా సమీక్షించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు విద్యార్థులు. పేద వర్గాల విద్యార్థులను పరిశోధనలు చేయడానికి ప్రోత్సహించాలి. నేషనల్ ఫెలోషిప్స్ రాని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు 25 వేల రూపాయలు ఫెలోషిప్ ఇవ్వాలి. పీజీ విద్యార్థులకు నెలకు 5 వేలు ఫెలోషిప్ ఇవ్వాలి. స్కిల్స్ పెంచడానికి చర్యలు తీసుకోవాలి. యూనివర్శిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు ఇవ్వాలి. నూతన హాస్టల్స్ నిర్మాణం, మోడ్రన్ లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, రిసెర్చ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవడానికి, ప్రజాస్వామ్య రక్షణకు విద్యార్థి సంఘాలు ఎన్నికలు నిర్వహించాలి. ప్రతి సంవత్సరం అన్ని యూనివర్శిటీలకు రిసెర్చ్ గ్రాంట్స్ ఇవ్వాలి. వీసీల నియామకాలు ఒక్కటే కాకుండా ప్రభుత్వ యూనివర్శిటీలను, వాటి అనుబంధ క్యాంపస్‌లను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.