– ప్రజా భవన్ దగ్గర రోడ్డు ప్రమాదం కేసు
– ఎట్టకేలకు షకీల్ కుమారుడు రాహిల్ అరెస్ట్
– జడ్జి ముందు ప్రవేశపెట్టిన పోలీసులు
– 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధింపు
– చంచల్ గూడ జైలుకు తరలింపు
రోజులన్నీ ఒకలా ఉండవు. తప్పు చేసినవారు ఎవరైనా కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే. తప్పించుకుని తిరుగుదామంటే కుదరని పని. ఎప్పటికైనా అరెస్ట్ కావాల్సిందే. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ విషయంలో జరిగింది ఇదే. ఎట్టకేలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గతంలో ప్రజా భవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసు రాహిల్‌ను వెంటాడుతోంది. ఈ కేసులో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు జడ్జి ముందు ప్రవేశపెట్టారు. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు న్యాయమూర్తి.
అసలేం జరిగింది..?
గతేడాది డిసెంబర్ 23వ తేదీన ప్రజా భవన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. అందులో రాహిల్ ఉన్నాడు. పోలీసులు అతడ్ని పట్టుకున్నారు. కానీ, తన తండ్రి షకీల్ సూచనల మేరకు రాహిల్ తన ప్లేస్‌లో డ్రైవర్‌ను ఉంచి దుబాయ్ పారిపోయాడు. రాహిల్‌ను కాకుండా వారి డ్రైవర్‌ను పట్టుకున్న ఘటనలో పంజాగుట్ట సీఐపైనా పోలీసులు యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేశారు. దుబాయ్ పారిపోయిన రాహిల్‌పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
ఎలా తప్పించుకున్నాడు?
రాహిల్‌ను తప్పించి అతని డ్రైవర్‌ను నిందితుడిగా చూపించే ప్రయత్నం జరిగింది. కానీ, సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ప్రమాదం జరిగిన రోజు రాత్రి ఘటనా స్థలం నుంచి రాహిల్‌ను అప్పటి సీఐ దుర్గారావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. బ్రీత్ అనలైజర్ టెస్టు కోసం మరో కానిస్టేబుల్‌కు అతడ్ని ఇచ్చి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అప్పుడు కానిస్టేబుల్ నుంచి రాహిల్ తప్పించుకుని అతని కోసం సిద్ధంగా ఉన్న కారులో ఎక్కి పారిపోయాడు. తన డ్రైవర్‌ను నిందితుడిగా పంపించాడు. యాక్సిడెంట్ చేసింది తానే అని ఆ డ్రైవర్ అంగీకరించాడు కూడా. కానీ, సోషల్ మీడియాలో యాక్సిడెంట్ చేసింది రాహిల్ అని బయటపడింది. ఈ విషయాలను సీఐ దుర్గారావు ఉన్నతాధికారులకు చెప్పకుండా దాచినట్టు అప్పుడు కథనాలు వచ్చాయి. రాహిల్ అక్కడి నుంచి ముంబై, అటు నుంచి దుబాయ్ పారిపోయాడు. దుర్గారావు సహకరించాడని, కేసు పక్కదారి పట్టించడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించాడనే అభిప్రాయాన్ని ఉన్నతాధికారులు రావడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.
హైకోర్టులో చుక్కుదెరు.. రిమాండ్ విధింపు
ఇటీవలే రాహిల్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై జారీ చేసిన లుకౌట్ నోటీసులు ఎత్తేయాలని కోరాడు. ఇక్కడికి వచ్చి దర్యాప్తులో పోలీసులకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. ఈ తరుణంలోనే రాహిల్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగాడు. ఆ వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత జడ్జి ముందు హాజరుపరిచారు. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు.