Bonus: కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లతోపాటు మిగిలిన అన్ని పంటలకూ కనీస మద్దతు ధర, దానిపై బోనస్ ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టుగా మద్దతు ధర, బోనస్ ఇచ్చి పంటను కొనుగోలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ధర్నాకు పిలుపు ఇస్తుందని హెచ్చరించారు. అదే విధంగా రైతు భరోసానూ ప్రస్తావించారు. జూన్ నెలలో రైతాంగానికి రైతు భరోసా ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెబుతున్నదని, రైతాంగం నోట్లో మట్టికొడుతోందని హరీశ్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో యాసంగిలో దొడ్డు వడ్లు మాత్రమే పండిస్తారని, అలాంటప్పుడు సన్నవడ్లకే బోనస్ ఇస్తామని చెప్పడం అంటే పండించని వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పినట్టు అవుతుందని అన్నారు. కాంగ్రెస్ అగ్రనాయకులు, రాష్ట్ర నాయకులు ప్రజలకు హామీ ఇచ్చినట్టుగా ప్రతి పంటకు మద్దతు ధర, బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మొన్నటి రైతు బంధు విడతకు సంబంధించి ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ. 2,500 బాకీ పడ్డారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కాబట్టి, ఆ 2,500లతోపాటు తాజా విడత రూ. 7,500లు కలిపి మొత్తంగా జూన్ నెలలో రైతులకు ఎకరాకు రూ. 10,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. వడ్లతోపాటు వేరే పంటలకూ ఎందుకు బోనస్ ఇవ్వరని ప్రశ్నించారు. భట్టి విక్రమార్క మాటలు వట్టి మాటల్లాగే ఉన్నాయని ఆరోపించారు.
కాళేశ్వరంపై కామెంట్:
కాళేశ్వరంపై ఎన్‌డీఎస్ఏ మధ్యంతర నివేదికను ఇచ్చింది. పూర్తిస్థాయి రిపోర్టును ఇవ్వాల్సి ఉన్నది. ఇప్పుడు రిపేర్ చేసినా భవిష్యత్‌లో ముప్పు ఉండదని చెప్పలేమని ఎన్‌డీఎస్ఏ తన మధ్యంతర నివేదికలో పేర్కొంది. ఈ విషయంపై హరీశ్ రావు మాట్లాడుతూ అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుకు ముప్పు ఉందని ఎన్‌డీఎస్ఏ రిపోర్టును మాత్రమే కాదు.. బీజేపీ అనుకుంటే మస్తు రిపోర్టులు ఇస్తుందని సెటైర్ వేశారు. మేడిగడ్డ రిపేర్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అమూల్యమైన ఆరు నెలల సమయాన్ని వృధా చేసిందని ఆరోపించారు. రైతులకు మేలు చేయాలని అనుకుంటే మార్గం తప్పకుండా ఉంటుందని అన్నారు.