– 24 గంటల్లో నిందితుడి అరెస్టు
– ప్రజా భవన్, నాంపల్లి కోర్టుకు బెదిరింపు కాల్స్
Bomb Threatening: ప్రజా భవన్, నాంపల్లి కోర్టులో బాంబులు ఉన్నాయని, కాసేపట్లో పేలుతాయని బెదిరిస్తూ ఫోన్ కాల్స్ చేసిన ఆగంతకుడిని పోలీసులు పట్టుకున్నారు. ఈ బెదిరింపు కాల్స్ చేసిన 24 గంటల్లోనే నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన రామకృష్ణగా నిందితుడిని గుర్తించారు. రామకృష్ణకు ఆయన భార్యకు మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆమె ఆయనకు దూరమైంది. ఈ క్రమంలోనే మద్యానికి బానిసై ఈ బెదిరింపు కాల్స్ చేసినట్టు అనుమానిస్తున్నారు.
ప్రజా భవన్‌లో, నాంపల్లి కోర్టులో బాంబు ఉన్నదని, అది కాసేపట్లో పేలిపోతుందని 100 నెంబర్‌కు ఫోన్ వచ్చింది. దీంతో పోలీసు కంట్రోల్ రూం వెంటనే సంబంధిత సిబ్బందిని అలర్ట్ చేశారు. ప్రజా భవన్‌కు హుటాహుటిన స్క్వాడ్స్ చేరుకుని జల్లెడపట్టారు. బాంబు కోసం అణువణువు వెతికారు. నాంపల్లి కోర్టులోనూ తనిఖీలు చేశారు. బాంబులు దొరకలేదు. మరోవైపు పోలీసులు కాల్ చేసిన ఆగంతకుడి కోసం అన్వేషణ ప్రారంభించారు.
కాల్ వచ్చిన 24 గంటల్లోనే విజయవంతంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడు రామకృష్ణను అరెస్టు చేసి నాంపల్లి పోలీసులకు అప్పగించారు. గతంలో ఈ నిందితుడు బైక్‌ల చోరీ కేసులో నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.