– కేసీఆర్ ఇంటికి అతి దగ్గరలో క్షుద్రపూజల ఆనవాళ్లు
– గులాబీ కలర్ బొమ్మ, నిమ్మకాయలు, మిరపకాయలు, నల్ల కోడి ఈకల లభ్యం
– భయాందోళనకు గురైన స్థానికులు
– వెంటనే పోలీసులకు సమాచారం
– ప్రముఖులు ఉండే ప్రదేశాలలో క్షుద్ర పూజలపై ఆరా
– ప్రస్తుతం ఫాంహౌస్‌లో ఉన్న గులాబీ బాస్
Black Magic Near KCR House in Nandinagar : కొన్ని బలమైన కోర్కెలు తీరడం కోసం కొందరు క్రుద్ర పూజలను ఆశ్రయిస్తుంటారు. అయితే, రాజకీయ నాయకులపై ఈ క్షుద్ర పూజలంటూ గతంలో అనేక కథనాలు వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న నందమూరి తారక రామారావు హయాంలో కూడా పెద్ద ఎత్తున వదంతులు విన్నాం. ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ ఇంటికి దగ్గర్లో క్షుద్ర పూజలు జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ ఇంటి పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. పింక్ కలర్ బొమ్మ, నిమ్మకాయలు, మిరపకాయలు, కవర్‌లో నల్ల కోడి దాని ఈకలు, కుంకుమ వంటి ఆనవాళ్లు అక్కడ ఉండటం కలకలంగా మారింది. సోమవారం రాత్రి ఈ క్షుద్ర పూజలు చేయగా ఈ విషయాన్ని గమనించిన స్థానికులు, కేసీఆర్ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
తమకు అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ నివాసానికి అత్యంత సమీపంలో ఈ క్షుద్రపూజలు చేసింది ఎవరు? అనేది సంచలనంగా మారింది. ప్రస్తుతం కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉన్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటం, కవిత అరెస్ట్ వంటి అంశాలు బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బలుగా మారాయి. ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ భవన్‌కు వాస్తు మార్పులను సైతం చేపట్టారు. ఇంతలో కేసీఆర్ నివాసానికి అత్యంత సమీపంలో క్షుద్ర పూజల అనవాళ్లు కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది.
ఇది ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రముఖులు నివాసం ఉంటే ఈ ప్రాతంలో క్షుద్రపూజల అనవాళ్లు కనిపించడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పని చేసిందెవరూ అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.