BJP’s Way To The South: పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికలకు రాజకీయ పక్షాలన్నీ రెడీ అయిపోయాయి. అధికారంలో ఉన్న బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌తో సహా ప్రధాన పక్షాలన్నీ ఇప్పటకే తమ అభ్యర్థులను దాదాపుగా ప్రకటించేశాయి. బీజేపీ సొంతగా 370 స్థానాలను, ఎన్టీయే కూటమి తరపున 400 సీట్లు సాధించబోతున్నట్లుగా ప్రచారం చేసుకుంటోంది. ‘అబ్ కీ బార్.. చార్ సౌ పార్’ అనే అందమైన నినాదాన్నీ విపరీతంగా ప్రచారం చేసుకుంటోంది. గత పదిహేనేళ్లుగా ఎన్నికల పరీక్షలో విలువల కంటే ఫలితాలే ప్రధానంగా ఆ పార్టీ ఎన్నికలను ఎదుర్కొంటూ వచ్చే క్రమంలో విపక్షాలకు అందని వ్యూహాలు, వాటి అమలులో బీజేపీ పండిపోయింది. మరోవైపు ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ప్రధాన అంశాలుగా చెప్పుకొస్తున్న ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణాలను సాకారం చేసి ఉమ్మడి పౌరస్మృతినీ తీసుకురావటమే ఆలస్యం అన్నట్లుగా వ్యవహరిస్తోంది. తమ పాలనా కాలంలో భారత్‌ను ప్రపంచపు ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టామని గొప్పగా చెప్పుకుంటోంది. ఇటీవలి అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లోనూ సత్తాచాటి ఇక ముచ్చటగా మూడోసారి ఢిల్లీ గద్దెనెక్కటమే ఆలస్యం అన్నట్లుగా ప్రచారం చేసుకుంటోంది. అయితే.. తాను సాధించిన ఇన్ని విజయాలకు తగిన ఫలితం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో లభిస్తుందో లేదోననే ఒక తెలియని ఆందోళన ఆ పార్టీ అధినాయకత్వాన్ని లోలోపల వేధిస్తూనే ఉంది.
గత ఏడాది కాలంగా జరిగిన పరిణామాలను నిశితంగా గమనిస్తే బీజేపీకి గెలుపు విషయంలో భయాలున్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంతగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని సాధించుకుంది. ఆదినుంచి తనకు బలమైన పునాదులున్న రాష్ట్రాల్లో ప్రత్యర్థుల మీద పైచేయి సాధించటమే ఈ వెసులుబాటుకు ప్రధాన కారణం. ఉత్తరప్రదేశ్‌లో 80కి 62, మధ్యప్రదేశ్‌లో 29కి 28, రాజస్థాన్‌లో పాతిక సీట్లలో 24 సీట్లను, జార్ఖండ్‌లో 14 సీట్లలో 11, ఛత్తీస్‌గఢ్‌లో 11 సీట్లకు 9, అసోంలో 14 సీట్లకు గానూ 9 ఆ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. ప్రధాని స్వరాష్ట్రమైన గుజరాత్(26), కర్ణాటక(25), హర్యానా(10), ఉత్తరాఖండ్(5), హిమాచల్ ప్రదేశ్(4), త్రిపుర(2)లో మొత్తం సీట్లు ఆ పార్టీ ఖాతాలో చేరాయి. ఇక మిత్రపక్షాల సాయంతో మహారాష్ట్రలో 48 సీట్లకు గానూ 23, ఒడిసాలో 21లో 8, తెలంగాణలోని 17 సీట్లలో 4, బీహార్‌లో 17, పశ్చిమబెంగాల్‌లో 18, జమ్ముకశ్మీర్‌లో ఆరు సీట్లకు మూడు ఆ పార్టీ గెలుచుకుంది.
Read Also : అంతర్గత సవాళ్లే అతిపెద్ద టాస్క్
అయితే, ఈసారి వీటిలో ఏ రాష్ట్రంలోనూ గతం మాదిరిగా ఏకపక్ష విజయాలు సాధించే అవకాశం కన్పించటం లేదు. ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వాములుగా మారటం, మరికొన్ని పార్టీలు స్థానికంగా ఉన్న చిన్నాచితకా పక్షాలతో అవగాహన కుదుర్చుకుని బరిలో నిలుస్తున్నాయి. దీనికి తోడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి రావటం, హర్యానాలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందనే సర్వేలు బీజేపీని కలవరపరుస్తున్నాయి. అలాగే, ఇటీవల శాసన సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ గెలిచినా అది ఏకపక్ష విజయం స్థాయిలో లేదు. ఈ మూడుచోట్లా కాంగ్రెస్ పార్టీకి గణనీయమైన ఓట్లు, సీట్లు వచ్చాయి. దీనికి తోడు ఇటీవల రాహుల్ చేసిన 66 రోజుల భారత్ న్యాయ యాత్ర 6,713 కి.మీ మేర సాగింది. ఇంఫాల్ నుంచి మొదలైన ఈ యాత్ర 110 జిల్లాల్లో 100 లోక్‌సభ స్థానాలను, 337 శాసన సభ స్థానాలను కవర్ చేస్తూ సాగింది. మరీ ముఖ్యంగా బీజేపీ ఆయువుపట్టు రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో 11 రోజుల పాటు సాగింది. ఈ యాత్రలో పదేళ్లలో పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పెరిగిన ధరలు, పడిపోతున్న జీవన ప్రమాణాలు, రైతుల ఉద్యమాలు, మద్దతు ధర వంటి సామాన్యులను ప్రభావితం చేసే అంశాలనే రాహుల్ ప్రస్తావిస్తూ సాగటమూ కమలనాథులకు చికాకుగా మారింది. దీంతో స్వతంత్రంగా అధికారంలోకి వచ్చేందుకు దక్షిణాది మీద ఆధారపడక తప్పదనే ఓ స్థిరమైన అంచనాకు వచ్చేసింది బీజేపీ.
ఇక.. దక్షిణాదిలోని కేరళలో 20, తమిళనాడులో 39, ఆంధ్రప్రదేశ్ 25, తెలంగాణలో 17, కర్ణాటకలో 28, పుదుచ్చేరిలో ఒక సీటు.. మొత్తం 131 స్థానాలున్నాయి. వీటిలో 2019 ఎన్నికల్లో బీజేపీకి కర్నాటకలో 25, తెలంగాణలో 4 సీట్లు వచ్చాయి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి ఆ పార్టీ ఖాతా కూడా తెరవలేకపోయింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో బీజేపీకి ఓట్లు పెరుగుతాయేమో గానీ సీట్ల పరంగా ఈసారీ ఇదే పరిస్థితి ఎదురయ్యే వాతావరణం కనిపిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీ, జనసేన గెలిచే సీట్లన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్డీయేకే దక్కబోతున్నాయి. ఇక తెలంగాణలో ఆ పార్టీ గతంలో సాధించిన నాలుగు సీట్లు నిలుపుకోవటమే ఇప్పుడు కష్టంగా మారింది. అటు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో అక్కడ గతంలో వచ్చిన సీట్లలో సగం వచ్చినా చాలనుకునే పరిస్థితి. మరోవైపు తమిళనాడులో ఎన్డీయే కూటమి నుంచి అన్నాడీఎంకే తొలగిపోయింది. కానీ, అయోధ్య రాముడికి రామేశ్వరంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసి దానిని ఓట్లుగా మార్చుకునేందుకు ఆ పార్టీ అక్కడ తపన పడుతోంది. కేరళ మీద సమయం వెచ్చించి ప్రయోజనం లేదని తెలిసి దానిని ప్రస్తుతానికి పక్కనబెట్టేశారు.
Read Also : లౌక్యమే కాదు.. దూకుడు కావాలి
ఇక్కడ బీజేపీ సీట్లతో బాటు తమమీద పడిన ఉత్తరాది పార్టీ అనే మచ్చను తొలగించుకోవాలనే కోణంతో బాటు తమ ఓటు బ్యాంకును పెంచుకోవాలనే తపనా ఈ ప్రయత్నంలో కనిపిస్తోంది. చోళ వంశపాలకుల చరిత్రకు అద్దంపట్టే సెంగోల్‌ను పార్లమెంటులో ప్రతిష్ఠించటం, ప్రధాని పదేపదే దక్షిణాది ఆలయాలను దర్శించుకోవటం, తమిళంలో మాట్లాడేందుకు ప్రయత్నించటం, ఏదో ఒక రోజు దేశం తమిళ ప్రధానిని చూస్తుందని కేంద్ర అమిత్ షా వ్యాఖ్యానించటం, పదేపదే తెలంగాణలో పర్యటనలు దీనినే సూచిస్తున్నాయి. ఒక దశలో దక్షిణాది నుంచి మోదీ పోటీచేస్తారనే వార్తలొచ్చినా ఎందుకో వెనక్కి తగ్గారు. అయితే బీజేపీ ఎంత ప్రయత్నించినా దాని ప్రయత్నాలు దక్షిణాదిలో పెద్దగా ఫలించే పరిస్థితులు ప్రస్తుతానికి కనిపించటం లేదు. జాతీయవాదం పేరుతో ఒకే దేశం, ఒకే భాష, ఒకే సంస్కృతి వంటి ఆలోచనలను పక్కనబెట్టి స్థానిక సంస్కృతిని, ప్రాంతీయ భాషలను, ఇక్కడి ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను బీజేపీ నిజాయితీగా గౌరవించగలిగితే మరో పదేళ్ల తర్వాత ఆ పార్టీ అనుకున్న ఫలితాలను దక్షిణాదిలో సాధించగలదేమో గానీ, ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం అది తీరని కలగానే మారబోతోందేమోనని అనిపిస్తోంది.
-సదాశివరావు ఇక్కుర్తి (సీనియర్ జర్నలిస్ట్)