Revanth Reddy: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భువనగిరిలో ప్రచార సభలో మాట్లాడారు. ఇక్కడి నుంచి బీజేపీ టికెట్ పై పోటీ చేస్తున్న బూర నర్సయ్య గౌడ్‌కు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు రాహుల్ గాంధీ వర్సెస్ మోదీ మధ్య జరుగుతున్నాయని కీలక వ్యాఖ్య చేశారు. రాహుల్ గాంధీ గ్యారెంటీకి, ప్రధాని మోదీ గ్యారెంటీకి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది అని అన్నారు. ఇప్పటికే పూర్తయిన మూడు విడతల ఎన్నికల్లో తమ పార్టీ 200 సీట్లను కైవసం చేసుకుందని తెలిపారు. మొత్తంగా 400 సీట్లు తమ పార్టీ గెలువాల్సి ఉన్నదని అన్నారు. తెలంగాణలో 10 సీట్లు బీజేపీ గెలుస్తుందని, ఇదే తమ 400 లక్ష్యానికి మార్గాన్ని సుగమం చేస్తుందని వివరించారు. ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ రేవంత్ రెడ్డి విను.. ఈ ఎన్నికల్లో 10 కంటే ఎక్కువ సీట్లు తాము గెలుచుకోబోతున్నామని తెలిపారు. తెలంగాణలో డబుల్ డిజిట్ స్కోర్.. దేశంలో మోదీని 400 సీట్లు గెలుచుకోవడానికి రూట్ క్లియర్ చేస్తుందని అన్నారు.
Also Read: మోదీ సెల్ఫ్ గోల్..!
కాంగ్రెస్ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకడం లేదని, సస్పెండ్ చేసిన వ్యక్తిని మళ్లీ నిలబెట్టిందని కేంద్రమంత్రి ఆరోపించారు. మోదీ వస్తే రిజర్వేషన్లు పోతాయని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, పదేళ్లలో ఏనాడైనా రిజర్వేషన్లను తొలగించారా? అని ప్రశ్నించారు. తాము ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి.. వాటిని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేస్తామని వివరించారు. బీజేపీ పది సీట్లు ఇవ్వండి ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి వాటిని ఎస్సీ,ఎస్టీ, బీసీలకు అందిస్తామని చెప్పారు.
తమ మ్యానిఫెస్టోలో మోదీ గ్యారంటీలను ప్రకటించామని, మోదీ చెప్పింది చేసి తీరుతారని అమిత్ షా అన్నారు. రాహుల్ గాంధీ గ్యారెంటీలను రాత్రికల్లా మరిచిపోతారని ఎద్దేవా చేశారు.