– పదేళ్ల పాలనలో అర్థవ్యవస్థ కుదేలు
– పల్లీ బఠానీలకు జాతి సంపద ధారాదత్తం
– జాతి సంపదను కార్పోరేట్లకు ధారాదత్తం
– మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఒక మాయ
BJP news today(Latest political news in India): లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరోసారి భారీ వాగ్దానాలతో జనం ముందుకొస్తోంది. తాజాగా విడుదల చేసిన బీజేపీ మ్యానిఫెస్టో గతానికి భిన్నంగా ఆకాశమే హద్దుగా హామీలను కుమ్మరించింది. అయోధ్య రామాలయం, ఆర్టికల్ 370 గురించి ఎవరికీ ఏ అనుమానాలు లేవు గానీ,ఆర్థిక విషయాల్లో ఆయన చెబుతున్న లెక్కల్లో ఎక్కడో తేడా కొడుతోంది. ఆదాయాలు పెరిగాయని చెబుతున్న మాటకి, క్షేత్రస్థాయి సామాన్యుల జీవితాలకీ పొంతన కనిపిచంటం లేదు. ముఖ్యంగా గత పదేళ్ల పాలనలో సాధించిన ఆర్థిక ప్రగతిని, 2004-14 నాటి యూపీఏ పాలనతో పోల్చి చూసినప్పుడు వర్తమానం కంటే గతమే ఘనమనే అభిప్రాయం కలుగుతోంది. కమలనాథుల వాక్చాతుర్యం కారణంగా అపఖ్యాతి పాలైన ఆర్థికవేత్త, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలోనే దేశం ఆర్థికంగా బలంగా ఉందని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రంగాల వారీగా మనముందున్న గణాంకాలే ఇందుకు రుజువుగా నిలుస్తున్నాయి.ప్రధాని చెప్పే ‘వికసిత భారత్’లో నిరుద్యోగం తారస్థాయికి చేరింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాటిస్టిక్స్ అండ్ ప్రొగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వశాఖ తాజా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్)లో ఈ విషయం బయటపడింది. 2023 అక్టోబర్‌లో నిరుద్యోగిత రేట్ 10 శాతానికి చేరింది.ప్రపంచ దేశాల స్థితిగతులను సరిపోలుస్తూ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యుఎన్‌డిపి ఏటా మానవాభివృద్ధి సూచీ(హెచ్‌డిఐ)ని ప్రచురిస్తుంటుంది. 2015 నాటి హెచ్‌డిఐలో 188 దేశాల్లో మన ర్యాంక్ 130. 2022 – 23 నాటికి 191 దేశాల్లో 132వ ర్యాంక్. మరి ఇన్నేళ్లలో సాధించినదేమిటి?
మంచి ఆహారం కరువై ఏడాదికి 17 లక్షల మంది భారతీయులు మరణిస్తున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆర్థికాభివృద్ధిలో అందరికీ వాటా లభించకపోవటమే ఇందుకు కారణమనేది ఆర్థిక వేత్తలు చెబుతున్న మాట.వేతనాల్లో పెంపు లేకపోవటంతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశంలో కుటుంబాల నికర ఆర్థిక పొదుపు మొత్తాలు గత ఐదు దశాబ్ధాల్లో ఎన్నడూ లేనంతగా జిడిపిలో 5.1 శాతానికి పడిపోయాయి.2024 మార్చి 31వ తేదీ నాటికి కేంద్రం అప్పులు ఏకంగా 169 లక్షల కోట్లకు పెరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులతో దేశంలోని 142 కోట్ల మంది జనాభాలో ఒక్కొక్కరి తలపైన సుమారు 1.75 లక్షల రూపాయల అప్పుల భారాన్ని మోడీ ప్రభుత్వం మోపింది.సెంటర్ ఫర్ మోనిటరినింగ్ ఇండియన్ ఎకానమీ ప్రతి నెలా నిర్వహించే నిరుద్యోగ సర్వే ప్రకారం 2023 నవంబరు నాటికి భారత్‌లో సగటు నిరుద్యోగం 10.5 శాతం ఉంది. అందులో గ్రామీణ నిరుద్యోగం 10.8 శాతం కాగా, పట్టణాల్లో 8.5 శాతం ఉంది.
Also Read: ఆ గట్టునుంటే దొంగ, ఇటు చేరితే దొర ఇదే బీజేపీ మంత్రం..
కాలంచెల్లిన దేశీయ విద్యావిధానాలతో అపారమైన యువశక్తి నిర్వీర్యమవుతోంది. ‘ఇండియా నైపుణ్యాల నివేదిక-2023’ లెక్కప్రకారం దేశవ్యాప్తంగా ఉన్నత విద్య తర్వాత కేవలం 51.25% మందికే మంచి ఉద్యోగాలను సంపాదించే సత్తా ఉంది.ఆర్థిక వృద్ధిపై ఉపన్యాసాలు ఇస్తున్న భారత ప్రధాని తమ పాలనలో ఆర్థిక లోటు ఎంత ప్రమాదకరంగా పెరుగుతున్నదో గమనించడం లేదు. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లోటు 24 శాతం పెరిగి రూ.6.4 లక్షల కోట్లకు చేరింది.ఏటా 2 కోట్ల ఉద్యోగాలని హామీ ఇచ్చిన మోదీ సర్కారు ప్రభుత్వ నియామకాలు నిలిపేసింది. ఇదేంటని నిలదీస్తే.. పకోడీలు అమ్ముకోమని సలహాలిచ్చింది. పాకిస్తాన్‌లో 11.3%, బంగ్లాదేశ్‌లో 12.9%, భూటాన్‌లో 14.4%, చైనాలో 13.2%గా ఉన్న నిరుద్యోగ రేటు మన దేశంలో 23.22 శాతంగా ఉంది.నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం 2014లో నమోదైన నిరుద్యోగుల ఆత్మహత్యల శాతం 7.5 కాగా 2023 నాటికి ఇది 10 శాతాన్ని మించిపోయింది. 2019- 2023 మధ్యకాలంలో 5 లక్షల చిన్న మధ్యతరహా పరిశ్రమలు మూతపడగా, లక్షల మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు.మనదేశంలో వైద్యం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. ఏటా దేశంలో రూ. 30 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోంది. దేశంలో ప్రజలు వైద్యం పెట్టే ఖర్చు (ఔటాఫ్ పాకెట్’) వాటా 73%. అటు.. ప్రభుత్వం వైద్యసదుపాయాల కల్పన మీద పెడుతున్నది మాత్రం జాతీయాదాయంలో కేవలం 1.1 శాతమే.
దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్‌పోలియో పెట్టుబడులు తగ్గిపోతున్నాయి. ‘డాలర్‌తో పోల్చితే అంతకంతకూ పడిపోతున్న రూపాయి మారకం విలువ.. దేశీయ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్‌పోలియో పెట్టుబడులకు ప్రతిబంధకంగా మారుతున్నది. ‘కరెన్సీ మార్కెట్లో బలహీనపడుతున్న రూపాయి మారకం విలువ.. భారత్‌లోకి వచ్చే విదేశీ పోర్ట్‌పోలియో పెట్టుబడులను అడ్డుకుంటున్నది. చైనాకు ఆ పెట్టుబడులు వెళ్లేందుకు దారితీస్తున్నది. దేశంలో అధిక ఇంధన ధరలు, ద్రవ్యోల్భణం కూడా విదేశీ పోర్ట్‌పోలియో మదుపరులను భయపెడుతున్నాయి.ఎగుమతుల కంటే దిగుమతులు పెరగటంతో వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో పెరుగుతోంది. 2023 అక్టోబర్‌లో 65.03 బిలియన్ డాలర్ల వాణిజ్య దిగుమతులుండగా, సరుకుల ఎగుమతులు 33.57 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీంతో రికార్డు స్థాయిలో 31.46 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు చోటు చేసుకుంది. ఇది ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచడంతో ధరలు పెరగడానికి దారి తీసింది.
Also Read: ఓవర్ కాన్ఫిడెన్స్..!?
మోడీ పదేళ్ల పాలన దేశభక్తి, జాతీయ సంస్కృతి పేరుతో సాగుతోందని అందరికీ తెలిసిందే. అయితే, తెరచాటున కార్పొరేట్లకు ఉడిగం చేస్తున్నదని పై గణాంకాలు చెప్పకనే చెబుతున్నాయి. ఈ పదేళ్ల పాలనలో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించగా, ధరలు ఆకాశన్నంటాయి. నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు అంతకంతకూ పెరుగుతూనే వచ్చాయి. ప్రభుత్వరంగ సంస్థల వాటాలు కారుచౌకగా ఆశ్రిత పెట్టుబడిదారుల పరమయ్యాయి. కాకులను కొట్టి గద్దలకు వేసే నీతి కారణంగా కార్పొరేట్ల ఆట ఆడింది ఆటగా సాగుతోంది. ఈ దుర్మార్గపు, నియంతృత్వ ప్రభుత్వపు అసమర్థ పాలన ఆగిపోతే తప్ప కునారిల్లుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు తిరిగి జవసత్వాలు చేకూరే అవకాశమే లేదు.
(2004-14) (2014-24)
- పదేళ్ల సగటు జీడీపీ వృద్ధి 7.68% 5.47%
- తలసరి ఆదాయంలో పెరుగుదల రేటు 50.3% 43.6%
- జీడీపీలో కుటుంబ పొదుపు రేటు 23% 19%
- ఆర్థిక వృద్ధి నమోదు రేటు 6.6% 5.7%
- వ్యవసాయ రంగ వృద్ధి రేటు 4.6% 1.8%
- రైతు ఆదాయంలో వార్షిక వృద్ధిరేటు 2.8% 3.1%
- వృద్ధిలో సాగురంగం వాటా 18.7% 14.6%
- వృద్ధిలో తయారీ రంగం వాటా 17% 14%
- నిరుద్యోగం శాతం 2.2% 6.6%
- 15 – 29 ఏళ్ల వారిలో నిరుద్యోగం 4.9% 8%
- విద్యాధికుల్లో నిరుద్యోగుల శాతం 4.7% 6.6%
- వ్యవసాయేతర అసంఘటిత రంగాల్లో నిరుద్యోగం 37% 40.3%
- రైతు కూలీల వేతనాల్లో వృద్ధి 4.1% 1.3%
- డాలర్- రూపాయి మారక విలువ రూ. 61 (2014) రూ.83 (2024)
- జీడీపీలో ప్రభుత్వ పెట్టుబడుల వాటా 7.8% 7.2%
- జీడీపీలో ప్రైవేటు పెట్టుబడి వాటా 25.5% 21.5%
- ఆదాయం, ఖర్చుకు మధ్య తేడా 4.5% 5.8%
- పెట్టుబడుల్లో వాస్తవ వృద్ధి రేటు 9.9% 6.7%
- జీడీపీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వాటా 1.9% 1.7%
- బ్యాంకు రుణాల్లో వృద్ధిరేటు 21.9% 10.3 %
- బ్యాంకు డిపాజిట్ల వృద్ధి రేటు 17.8% 10.05%
- ప్రభుత్వ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల విలువ రూ. 8 లక్షల కోట్లు రూ. 55.5 లక్షల కోట్లు
- నిరర్థక ఆస్తులపై ప్రభుత్వ బ్యాంకుల రుణమాఫీలు రూ. 2.3 లక్షల కోట్లు 14.56 లక్షల కోట్లు
- వాణిజ్య బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల విలువ రూ. 3.3 లక్షల కోట్లు 15.08 లక్షల కోట్లు
- నిరర్థక ఆస్తులపై వాణిజ్య బ్యాంకుల రుణమాఫీలు రూ. 63,502 కోట్లు 14.8 లక్షల కోట్లు
- స్టాక్ మార్కెట్ లాభాలు 18.2 % 13.8%
- దిగుమతులు, ఎగుమతులు మధ్య అంతరం రూ. 8.1 లక్షల కోట్లు 21.13 లక్షల కోట్లు
- ఎగుమతుల వృద్ది రేటు 13.9 % 4.9 %
- కేంద్ర ప్రభుత్వ రుణం రూ. 58.6 లక్షల కోట్లు రూ. 169 లక్షల కోట్లు
- జీడీపీలో రుణాల వాటా 52 % 58 %
- అప్పుల మీద వడ్డీల చెల్లింపు 1.42 % 1.49 %