Muslim Community: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2011లో ముస్లింలకు జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లను కలకత్తా హైకోర్టు రద్దు చేసింది. ఇది చట్ట వ్యతిరేకం అని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు కుహనా మేధావులకు, కుహనా సెక్యులర్లకు చెంప పెట్టు అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. సంతుష్టి రాజకీయాలు చేసే వారికి గట్టి దెబ్బ వంటిదని వివరించారు. ఇకనైనా ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలకాలని, ముస్లిం సమాజాన్ని ఒక వస్తువుగా చూడరాదని పేర్కొన్నారు. బెంగాల్ తరహాలోనే ఏపీ, తెలంగాణలోనూ ముస్లింలను బీసీఈలో చేర్చారని అన్నారు.
ఈ విధంగా బీసీల హక్కులను కాలరాస్తున్నారని, ముస్లింల ఓట్లను గంపగుత్తగా పొందడానికి బీసీలను బలిపెడుతున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. కలకత్తా హైకోర్టు తీర్పును అన్ని పార్టీలు, రాష్ట్రాలు పరిశీలించాలని, ఈ తీర్పు అన్ని చోట్ల వర్తించేదేనని అన్నారు. ఇదిలా ఉండగా.. మమతా బెనర్జీ మాత్రం కలకత్తా హైకోర్టును ఖాతరు చేయడం లేదని మండిపడ్డారు. కలకత్తా హైకోర్టు తీర్పును తాము పరిగణనలోకి తీసుకోబోమని చెబుతున్నారని అన్నారు. ఇది రాజ్యాంగాన్ని అవమానించడమేనని దుయ్యబట్టారు. కోర్టు తీర్పులను రాజకీయాలతో ముడిపెడుతున్నారని పేర్కొన్నారు. ఎలాంటి అధ్యయనం చేయకుండా ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా కేవలం ఓట్ల రాజకీయాలలో లబ్ది పొందాలనే లక్ష్యంతో ముస్లిం వర్గాలను బీసీల్లో చేరుస్తున్నారని తెలిపారు.
మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం అని ప్రధాని మోదీ పలుమార్లు చెప్పారని, కానీ, కొందరు కుహనా సెక్యులర్లు మోదీపై వ్యతిరేక ప్రచారం చేశారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇప్పుడు స్వయంగా మోదీ చెబుతున్నట్టు కలకత్తా హైకోర్టు కూడా తీర్పు ఇచ్చిందని వివరించారు. ఇది వరకే ఉద్యోగాలు పొందినవారు.. విద్యా సంస్థల్లో చేరిన వారికి ఈ తీర్పు వర్తించదని కోర్టు పేర్కొంది.