Revanth Reddy: బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యం చేసుకుని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవి కోసం పది మంది పోటీ పడుతున్నారని, డిప్యూటీ సీఎం కోసం ఐదుగురు తీవ్రంగా పోటీ పడుతున్నారని ఆరోపించారు. హస్తం పార్టీలో మూడు వర్గాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఒకటి ఎల్లో కాంగ్రెస్, రెండు గ్రీన్ కాంగ్రెస్, మూడు గాంధీ కాంగ్రెస్ గ్రూపులు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఐదుగురు షిండేలు ఉన్నారని ఆరోపణలు చేశారు.
రేవంత్ రెడ్డి పార్టీలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఎందుకంటే ఆయనకు పార్టీలో కంఫర్ట్ లేదని పేర్కొన్నారు. అందుకోసం తన వర్గానికి తోడుగా బీఆర్ఎస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలను తెచ్చుకోవాలని ప్లాన్లు వేస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా 25 మంది బీఆర్ఎస్ నాయకులు తనతో టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారని అన్నారు. రేవంత్ రెడ్డి సొంత దుకాణం పెట్టాలని చూస్తున్నారని ఏలేటి తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డికి రెండు ప్లాన్లు ఉన్నాయని, ఒకటి తను కాంగ్రెస్‌లోనే కొనసాగితే ఎంత మంది ఎమ్మెల్యేలు వెంట ఉన్నారు? ఇక రెండో ప్లాన్ తాను కొత్త పార్టీ పెడితే ఎంత మంది వెంట వస్తారు? అనేది ఆలోచించుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు.
Also Read: Kavitha and Kejriwal : గతమెంతో ఘనం..!
కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో విభేదాలు ఎక్కువ అని, వాళ్లకు వాళ్లే గొడవలు పెట్టుకుని విడిపోతారని ఏలేటి అన్నారు. వాళ్లలో వాళ్లే కొట్టుకుంటారని, వారి ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. మహబూబ్ నగర్‌లో కాంగ్రెస్ పార్టీని ఓడించే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్వయంగా సీఎం రేవంత్ చెబుతున్నారని, వారి పార్టీలో వెన్నుపోటు రాజకీయాలు నడుస్తున్నాయని ఆయనే చెబుతున్నారని అన్నారు. చంద్రబాబుకు, రేవంత్ రెడ్డికి పోలికలు ఉన్నాయని తెలిపారు. సీఎం స్థాయిలో ఉండి కుట్ర చేస్తుందని రేవంత్ అనడం ఏమిటని ప్రశ్నించారు. గేట్లు ఓపెన్ చేస్తే పార్టీ ఎమ్మెల్యేలతో నిండిపోతుందని అన్నారని, కానీ, ఇప్పుడు వాళ్లు గేట్లు ఓపెన్ చేసినా.. విండోలు ఓపెన్ చేసినా రావడం లేదేం అని ప్రశ్నించారు. తమ పార్టీ నేతలు ఎవరితోనూ టచ్‌లో లేరని పేర్కొన్నారు.