– 370 కాదు.. 150 సీట్లు గెలిస్తే మహాగొప్ప
– ఈ ఎన్నికల తర్వాత బీజేపీ ఇంటికే
– చాపకింది నీరుల కాంగ్రెస్‌కు పెరుగుతున్న మద్దతు
– మోడీ ఓ అవినీతి ఛాంపియన్: రాహుల్ విమర్శలు
– వారసులకు టికెట్ ఇవ్వలేమని బీజేపీ ప్రతిజ్ఞ చేస్తుందా?: అఖిలేశ్
Rahul Gandhi: లోక్ సభ తొలి విడత ఎన్నికలు 19వ తేదీన జరగనున్నాయి. దీంతో 17వ తేదీన ఈ విడత ఎన్నికలకు ప్రచారం ముగిసింది. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్ కలిసి విలేకరులతో మాట్లాడారు. ఇండియా కూటమి ఐక్యతను వారిద్దరూ వేదికను పంచుకుని చూపించారు. వారిద్దరూ బీజేపీపై విమర్శలు సంధించారు.
బీజేపీకి అంత సీన్ లేదని, 150 సీట్లు గెలిస్తే మహా గొప్ప అని రాహుల్ గాంధీ అన్నారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. తాను సీట్ల లెక్కలు చేయనని తెలిపారు. కానీ, గత కొన్ని రోజుల క్రితం వరకు ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 180 సీట్ల వరకు గెలుచుకోవచ్చని అనుకున్నానని, కానీ, ఇప్పుడు చూస్తే ఆ పార్టీ 150 సీట్ల వరకు గెలుచుకోవచ్చని వివరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌కు గణనీయమైన మద్దతు వస్తున్నదని, దేశవ్యాప్తంగా హస్తం పార్టీ చాప కింది నీరులా మద్దతు పెరుగుతున్నదని తెలిపారు.
ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకం ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అని రాహుల్ గాంధీ విమర్శించారు. భారతదేశంలోని వ్యాపారవేత్తలందరికీ ఈ విషయం అర్థమైందని తెలిపారు. ఏఎన్ఐకి ప్రధాని మోడీ ఇచ్చిన ఇంటర్వ్యూ మొత్తం స్క్రిప్టెడ్ అని ఆరోపించారు. ‘ఈ సంభాషణలో మోడీ ఎలక్టోరల్ బాండ్స్ గురించి వివరిస్తూ..పారదర్శకత కోసమే ఆ స్కీమ్ తీసుకొచ్చారని చెప్పారు. ఇదే నిజమైతే దానిని సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేసింది’ అని ప్రశ్నించారు. ఈ స్కీమ్ ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకంగా అభివర్ణించారు. దీనిపై ప్రధాని ఎంత వివరణ ఇవ్వాలనుకున్నా ఎటువంటి మార్పూ ఉండబోదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరిగే లోక్‌సభ ఎన్నికలు భావజాలానికి సంబంధించిన ఎన్నికలని అన్నారు. ‘ఒకవైపు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు ప్రయత్నిస్తుండగా.. మరోవైపు ఇండియా కూటమిఆ రెండు వ్యవస్థలను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల్లో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అతిపెద్ద సమస్యలు. కానీ వాటిపై ప్రధాని మోడీ, బీజేపీలు ఎన్నడూ మాట్లాడటం లేదు’ అని వ్యాఖ్యానించారు. అలాగే అమేథీలో పోటీ చేయడంపై స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే తప్పకుండా అక్కడి నుంచి పోటీ చేస్తానన్నారు.
Also Read: Phone Tapping: గవర్నర్‌ను కూడా వదిలిపెట్టలేదా?
ప్రస్తుతం జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 150సీట్లకే పరిమితం అవుతుందని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కూడా జోస్యం చెప్పారు. ఇండియా కూటమికి బలమైన నాయకత్వం ఉందని తెలిపారు. ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా చీలకుండా చూసుకోవాలని చెప్పారు. యూపీ ప్రజలు కూడా ఇండియా కూటమిని స్వాగతిస్తున్నారని తెలిపారు. బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. కాగా, ఘజియాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా డాలీ శర్మ పోటీ చేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ మద్దతు ఇస్తున్నది. ఘజియాబాద్ నుంచి ఘాజీపూర్ వరకు ఇండియా కూటమి హవానే కొనసాగుతున్నదని అన్నారు.