Telangana Congress news: వరంగల్ సభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. భారత్ గొప్ప వైవిధ్యాన్ని వివరించడానికి సామ్ పిట్రోడా చెప్పిన విషయాన్ని సందర్భానుసారంగా ఉటంకిస్తూ, కోవింద్, ముర్ములను, కాంగ్రెస్ సామాజిక నేపథ్యం కారణంగా వ్యతిరేకించిందని ఆరోపించడం అర్థరహితం, అవాస్తవమన్నారు.
సమాజంలోని అణగారిన వర్గాల నుండి వచ్చిన అనేక మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎదిగి దేశంలో ఉన్నత పదవులు పొందారని గుర్తు చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనకపోగా బ్రిటీష్ వాళ్లని బలపరిచిన ఆర్ఎస్ఎస్, అన్నింటా రిజర్వేషన్లను వ్యతిరేకించిన బీజేపీ అబద్ధాలను ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. మోదీ, బీజేపీలది ప్రతీకార సిద్ధాంతమన్నారు. దళితుల పట్ల వారిది కపట ప్రేమ అని, బూటకపు మాటలతో ప్రజలను మోసం చేయడం ఎన్డీఏకు అలవాటేనని విమర్శించారు. దళితులు, ఆదివాసీలను నిజంగా గౌరవించే వారే అయితే రామ్‌నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ములను ఎందుకు అవమానించారని ప్రశ్నించారు.
Also Read: Revanth Reddy: ఈసారి టీడీపీ ఓట్లు ఎటు?
కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేసినప్పుడు, అయోధ్యలో రామమందిరానికి శంకుస్థాపన జరిగినప్పుడు కోవింద్‌ను అవమానించింది వాస్తవం కాదా? అంటూ నిలదీశారు. దళితులను గౌరవించడంపై మోదీకి చిత్తశుద్ధి ఉంటే, రెండు సందర్భాల్లోనూ కోవింద్ చేత శంకుస్థాపన చేసి ఉండేవారని చెప్పారు. కొత్త పార్లమెంట్ భవనం, రామ మందిరాన్ని ప్రారంభించినప్పుడు ద్రౌపది ముర్మును ఎందుకు అనుమతించలేదని అడిగారు తుమ్మల. నిజానికి బీజేపీ, మోదీ దళితులను, ఆదివాసీలను ద్వేషిస్తున్నారని విమర్శించారు.