– ఒవైసీని ఢీకొడుతున్న మాధవీలత
– తప్పకుండా ఓడిస్తానని ధీమా
– వినూత్న ఎన్నికల ప్రచారం
– ఫ్లైట్‌లో వాటర్ బాటిల్స్ పంపిణీ
– వాళ్లేమన్నా నిరుపేదలా అంటూ మాధవీలతపై ట్రోలింగ్
– పేదలకు పంచితే పుణ్యమంటూ సెటైర్లు
BJP Hyderabad MP Candidate Trolling, Who Madhavi Latha : ఒకే ఒక్క ఛాన్స్. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా, ప్రజల పాలనను తెస్తా అంటూ హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన కంటే ముందే మాధవీలత పేరును బీజేపీ కన్ఫామ్ చేయడంతో వినూత్న రీతిలో ఆమె ప్రచారం చేస్తున్నారు. భాగ్యనగరంలో ఒవైసీ హవాకు బ్రేక్ వేస్తామని గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే, ప్రచారంలో భాగంగా ఆమ చేస్తున్న కొన్ని పనులతో ట్రోల్‌కు గురవుతున్నారు.
విమానంలో వాటర్ బాటిల్స్ పంపిణీ
ఎవరైనా విమానం ఎక్కుతున్నారంటే, వారు ఆర్థికంగా మంచిగా ఉన్నట్టే. వేలల్లో ఉండే విమాన టికెట్లను కొని పర్యటిస్తున్నారంటే డబ్బులకు కొదవ లేదన్నట్టే. మరి, అలాంటి వారికి వాటర్ బాటిల్స్ పంచితే ఎలా ఉంటుంది. ఈ పాయింట్ ను పట్టుకునే బీజేపీ అభ్యర్థిని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. పాతబస్తీలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాధవీలత, తాజాగా వాటర్ బాటిల్స్‌ను విమానంలో పంచుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఫ్లైట్ లో వెళ్లే వాళ్లు పది రూపాయల వాటర్ బాటిల్స్ కొనుక్కోలేరా? పేదలకు పంచితే పుణ్యం వస్తుంది కదా? అంటూ సెటైర్లు వేస్తున్నారు.
Read Also: ఫ్రస్ట్రేషన్ పీక్స్, కేటీఆర్‌కు ఏమైంది..?
ఓట్ల కోసం రామ జపం
అయోధ్యలో రామ మందిరాన్ని బీజేపీ గట్టిగా వాడేస్తోంది. ఈసారి ఆలయాన్ని చూపించి ఓట్లు దండుకునే పనిలో ఉంది. అయోధ్యకు సంబంధించిన ప్రతీ అంశాన్ని క్యాష్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే మాధవీలత అయోధ్యకు వెళ్లే రామ భక్తులకు వాటర్ బాటిల్స్, పండ్లు అందించారు. అయితే, ఫ్లైట్ లో తిరిగే నిరు పేదలకు వాటర్ బాటిల్స్ పంచుతున్న బీజేపీ అభ్యర్థి అంటూ నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. కేవలం ఓట్ల కోసం అయోధ్య రాముడ్ని వాడుకుంటున్నారని మండిపడుతున్నారు. కొందరైతే ఆమెకు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు.
ఎవరీ మాధవీలత..?
హైదరాబాద్ స్థానం ఎంఐఎం కంచుకోట. గత నాలుగు పర్యాయాలుగా అసదుద్దీన్ ఒవైసీ ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. ఐదోసారి పోటీకి సిద్ధమయ్యారు. మోడీ హవా ఉన్న గత రెండు పర్యాయాల్లోనూ ఒవైసీ గెలిచారు. ఈసారి తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఆపార్టీ తరఫున ఒవైసీని ఢీకొట్టేదెవరు? అనే చర్చ జరుగుతున్న సమయంలో మాధవీలత పేరును ప్రకటించింది హైకమాండ్. దీంతో ఈమె ఎవరనే దానిపై నెట్టింట శోధన జరిగింది. ఈమె ప్రముఖ విరించి ఆస్పత్రుల చైర్ పర్సన్. హిందూ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. హిందూత్వం, భారతీయ సంస్కృతిపై అనర్గళంగా మాట్లాడగలరు. పాతబస్తీలో పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు టికెట్ కేటాయించింది అధిష్టానం.