Balmoori Venkat: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం న్యాయంగా తెలంగాణకు దక్కాల్సిన, రావాల్సినవాటిని ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. బీజేపీ తీరును నిరసిస్తూ ఒక వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది. తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందనే ప్రచారాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ప్రారంభించారు. తెలంగాణకు ఏమీ ఇవ్వలేదనే విషయాన్ని వాళ్లు వ్యంగ్యంగా గాడిద గుడ్డు ఇచ్చిందని ప్రచారం చేస్తున్నారు. బల్మూరి వెంకట్ సహా అద్దంకి దయాకర్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు బెల్లయ్య నాయక్, యూత్ కాంగ్రెస్ నేషనల్ స్పోక్స్‌పర్సన్ రామ్మోహన్ రెడ్డి, ఇతర ఎన్ఎస్‌యూఐ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు.
తెలంగాణ అభివృద్ధి కోసం న్యాయబద్ధంగా రాష్ట్రానికి రావాల్సినవి ఇవ్వాలని అడిగితే బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వమంటే, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమంటే బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందని విమర్శించారు. కనీసం ఒక ఐఐఎం, ఎన్ఐడీ విద్యాలయం ఇవ్వమంటే, 811 టీఎంసీల కృష్ణా జలాల్లో సరైన వాటా ఇవ్వమంటే గాడిద గుడ్డు ఇచ్చిందని అన్నారు. బడ్జెట్‌లో ఉత్తరాది రాష్ట్రాలతో సమాన వాటా తెలంగాణకు ఇవ్వాలని అడిగితే గాడిద గుడ్డు ఇచ్చిందని విమర్శలు చేశారు.
Also Read: అవును..అవి వాడితే తప్పేంటి?
చట్టం ప్రకారం దక్కాల్సిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని అడిగితే కేంద్రంలోని బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందని, వరంగల్, కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా చేయాలని కోరితే గాడిద గుడ్డు ఇచ్చిందని అన్నారు. ఇలా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి తెలంగాణ అభివృద్ధికి ఏమాత్రం సహకరించలేదని మండిపడ్డారు. ఈ విషయాలకు కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని వాళ్ల ప్రభుత్వం నుంచి వారు తెలంగాణకు తెచ్చింది గాడిద గుడ్డే కదా అని సెటైర్ వేశారు. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సినవాటిని, చట్టంలో మనకు చెందాల్సిన వాటిని కూడా బీజేపీ ఇవ్వలేదని, అలాంటి బీజేపీ నాయకులకు రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు లేదని మండిపడ్డారు. బీజేపీ నాయకులను గెలిపించినా అభివృద్ధి జరగలేదని ప్రజలు గమనించాలని, మళ్లీ వాళ్లను గెలిపించినా గాడిద గుడ్డే ఇస్తారు తప్పా అభివృద్ధి చేయరని అన్నారు.