Politics

Hyderabad : ఫెయిల్యూర్స్ ను ప్రశ్నిస్తున్న ఫ్లెక్సీ లు

సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణలో మళ్లీ ఫ్లెక్సీల వార్
బీజేపీ వైఫల్యాలపై వెలసిన ఫ్లెక్సీలు
పదేళ్ల మోసం..వందేళ్ల విధ్వంసం
20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏది?
బీజేపీ వస్తే పెట్రోల్ రేటు లీటర్ రూ. 420 కావడం పక్కా
మాములు రైళ్లకే దిక్కు లేదు కానీ బుల్లెట్‌ రైలు
బీజేపీని ఇరకాటంలో పెడుతున్న ఫ్లెక్సీలు
జనాలను ఆలోచింపజేసేలా ఏర్పాటు చేసిన బ్యానర్లు

 

Flexies on BJP Failures lok sabha target telangana: దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో.. తెలంగాణలో మళ్లీ ఫ్లెక్సీ వార్ మొదలైంది. బీజేపీని టార్గెట్ చేస్తూ.. గాంధీభవన్ ఎదుట ‘నయవంచన’ పేరుతో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ‘‘పదేండ్ల మోసం – వందేళ్ల విధ్వంసం’’ అంటూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఇచ్చిన హామీలకు విరుద్ధంగా మోదీ ప్రభుత్వం సాగిందని అందులో ఎత్తిచూపారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయంపై వెలసిన ఫ్లెక్సీలు జనాన్ని ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. గత పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదంటూ బ్యానర్ ఏర్పాటు చేశారు. ప్రజలకు మోదీ సర్కార్, బీజేపీ నాయకత్వం ఇచ్చిన హామీలు, వాటిని విస్మరించిన తీరు, తెలంగాణ విషయంలో కేంద్రం ఏ విధంగా వివక్ష చూపిందనేది ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు.

వైరల్ గా మారిన ఫ్లెక్సీలు
ప్రధాని మోదీ సర్కార్ 10 ఏళ్ల మోసంపై గాంధీ భవన్ దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వైరల్ అవుతోంది. మోదీ నయవంచన.. పదేండ్లలో మోసం..వందేండ్ల విధ్వంసం అంటూ రాశారు. 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ.. విదేశాల్లో నల్లధనం తీసుకొచ్చి వేస్తానన్న రూ.15 లక్షలు ఎక్కడా?…పదేండ్లలో లక్షల రైతుల ఆత్మహత్యలు, మళ్లొస్తే పెట్రోల్ రేట్లు లీటర్ రూ. 420 కావడం పక్కా అని రాశారు . పదేండ్లలో కన్నీళ్ల పాలనను యాదుంచుకుందాం..ప్రజాద్రోహుల పాలనను అంతం చేద్దాం..అంటూ ఫ్లెక్సీలో రాశారు.

హామీలు మర్చిపోవడం మామూలే

బీజేపీకి ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వటం ఎంత సులభమో, వాటిని మరచిపోవడం కూడా అంతే సులభం అంటుంటారు. ఎందుకంటే 2014 మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలే ఇంకా నెరవేరలేదు. కొత్తగా 2024లో మళ్లీ కొత్త వాగ్దానాలతో ప్రజల ముందుకు వచ్చిందని విపక్షాలు అంటున్నాయి. 2014లో విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని దేశానికి తీసుకొచ్చి ప్రతి ఒకరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తాం అని చెప్పిన బీజేపీ దాని గురించి సమాధానం చెప్పలేదు. 2019 ఎన్నికల సమయంలో రైతులకు వడ్డీ లేకుండా రూ. లక్ష రుణాలు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఎంత మంది రైతులకు వడ్డీలేని రుణాలు కేంద్రం నుంచి ఇచ్చారో ఆ పార్టీ వాళ్లే చెప్పాలంటున్నారు విపక్షాలు.

రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి?

2014 ఎన్నికల సమయంలో సంవత్సరానికి రెండు కోట్లు చొప్పున ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారని.. మరి మీ పదేళ్ల పాలనలో 20 కోట్లు ఉద్యోగాలు ఇచ్చారా? అని ఆ ఫ్లెక్సీలో ప్రశ్నించారు. తెలంగాణకు ఒక్క యూనివర్సిటీ కూడా ఇవ్వని బీజేపీ ప్రభుత్వం.. కృష్ణా జలాలలో ఆంధ్రాకే ఎక్కువ వాటా ఇచ్చారని పేర్కొన్నారు. గత పదేండ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదన్న అంశాన్ని కూడా హైలైట్ చేశారు. గతంలో తాము అధికారంలోకి వస్తే నిత్యావసరాలతో పాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్ని తగ్గిస్తామని మోదీ ఇచ్చారని.. కానీ అందుకు భిన్నంగా వాటి ధరలు ఆకాశాన్నంటాయని రాసుకొచ్చారు. ధరలు పెంచేసి, పేదలపై ఆర్థిక భారం మోపారంటూ ఆరోపించారు. అందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి, ఆ హామీని తుంగలో తొక్కేశారన్నట్టుగా ఫ్లెక్సీని డిజైన్ చేశారు.

నల్లధనాన్ని వెనక్కి రప్పించేదెప్పుడు?

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మోదీ మాటిచ్చారని, అవినీతిని కూడా రూపుమాపుతామని చెప్పారని, మరీ ఈ పదేళ్లలో అవి జరిగాయా? అని ప్రశ్నిస్తున్నట్టు ఫ్లెక్సీలో చిత్రాలను డిజైన్ చేశారు. విదేశాల్లో నల్లధనాన్ని వెనక్కు తీసుకొచ్చి, ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని మోదీ హామీని గుర్తు చేస్తూ.. మా రూ.15 లక్షలు ఎక్కడ అని నిలదీశారు. సరిహద్దులో చైనా భారత భూభాగాన్ని ఆక్రమిస్తుంటే.. చైనా ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదంటూ అబద్ధాలు చెప్తున్నారని పేర్కొన్నారు. తీవ్రవాదాన్ని నిర్మూలిస్తామన్న మాటని సైతం గాలికొదిలేశారన్న అర్థం వచ్చేలా ఫ్లెక్సీలో ఫోటోల్ని అమర్చారు.

బుల్లెట్ రైళ్లు సాధ్యమా?

ఇప్పటిదాకా ప్రతీ ఎన్నికల సందర్భంగా భారత్‌ను ఫుడ్‌ ప్రాసెసింగ్‌ హబ్‌గా మారుస్తాం చెప్పటం బీజేపీకి ఓ అలవాటుగా మారిందని అంతా అంటున్నారు. 2019లో రైతుల కోసం బడ్జెట్‌లో ప్రత్యేకంగా రూ. 25 లక్షల కోట్ల కేటాయిస్తాం అని చెప్పిన బీజేపీ 5 సంవత్సరాలలో ఎన్ని లక్షల కోట్లు కేటాయించారో చెప్పాలటున్నారు రాజకీయ ప్రత్యర్థులు. ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు అని పేర్కొన్న బీజేపీ ఈసారి కొత్తగా మూడు కోట్ల మందికి పక్కా ఇళ్లు అని వాగ్దానం చేస్తున్నారంటే గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఒప్పుకున్నట్టేనని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ప్రతి కుటుంబానికి వంట గ్యాస్‌ అని చెప్పి ఇప్పుడూ అదే చెప్తున్నారని అలాగే 2019లో వన్‌మిషన్‌, వన్‌ డైరెక్షన్‌ అంటే 2024లో వన్‌ నేషన్‌ వన్‌ఎలక్షన్‌ అని కొత్తపలుకు పలుకు పలుకుతున్నారు. ఇక రాష్ట్రంలో మాములు రైళ్లకే దిక్కు లేదు కానీ బుల్లెట్‌ రైలు అని పేర్కొనటం సిగ్గుచేటని విపక్షాలు పేర్కొనడం గమనార్హం. 2024 బీజేపీ మ్యానిఫెస్టోలో తమిళ భాషని విశ్వవ్యాప్తం చేస్తామన్నారు. అంతా బాగానే ఉంది మరి తెలుగు భాష ఏం పాపం చేసిందని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు. మొత్తానికి బీజేపీ సర్కార్ ను అంటకాగుతూ వెలసిన ఫ్లెక్సీలు సంచలనంగా మారాయి. దీనికి కౌంటర్‌గా బీజేపీ వాళ్లు ఎలాంటి ఫ్లెక్సీలని దింపుతారో చూడాలి.