Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలతో విరుచుకుపడ్డారు. తాను సంధించిన 19 ప్రశ్నల్లో కేవలం ఒక్కదానికి మాత్రమే ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం ఇచ్చారని, తన ప్రశ్నలను ఉత్తమ్ పర్సనల్‌గా తీసుకుంటున్నారని అన్నారు. తనపైనా పర్సనల్‌గా కామెంట్లు చేస్తున్నారని, అలా చేయవద్దని సూచిస్తున్నట్టు తెలిపారు. పుట్టింటి వ్యవహారం మేనమామకు తెలుసు అన్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి ఎలా పొందాడో తనకు పూర్తిగా తెలుసు అని వివరించారు. తాను పార్టీలోని అందరి నాయకుల సమ్మతంతోనే బీజేఎల్పీగా మారానని, ఉత్తమ్ కుమార్ రెడ్డిలా అపాయింట్‌మెంట్ లీడర్‌ను కాదని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై చేసిన కామెంట్లపై స్పందించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి సీఎంనే అనుమానిస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. తమ అధ్యక్షుడి అనుమతితోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని వివరించారు. ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకరినొకరు అనుమానించుకుంటున్నారని ఆరోపించారు. తాను ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ అన్నప్పుడు స్పందించని ఉత్తమ్ కుమార్ యూట్యాక్స్ అనగానే స్పందించారంటే ఎంత పెద్ద మొత్తంలో అవినీతి జరుగుతున్నదో ఊహించుకోవచ్చని ఆరోపించారు.
బకాయిలున్న మిల్లర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, డీఫాల్టర్ల పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రి ఏనాడైనా క్షేత్రస్థాయిలో పర్యటించి తరుగుపై పరిశీలించారా? కుంభకోణాలు కళ్లముందే కనిపిస్తున్నా మంత్రి ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదని అడిగారు. ఏప్రిల్ 18న జలసౌధలో మిల్లర్లతో జరిగిన చర్చల వివరాలను ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించిన ఏలేటి.. మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మక్కయిందని తీవ్ర ఆరోపణలు చేశారు. మిల్లర్లతో రూ. 100 బాండ్ పేపర్ పై సంతకాలు చేసుకున్నారని ఆరోపించారు. ‘మీరే కుంభకోణం చేసి మీరే దొంగతనం మీద చర్యలు తీసుకుంటామని చెబుతున్నట్టుగా ఉన్నద’ని ఫైర్ అయ్యారు. సివిల్ సప్లై శాఖ నిండా అవినీతిలో కూరుకుపోయి ఉన్నదని ఆగ్రహించారు. సివిల్ సప్లైపై లీగల్ యాక్షన్ కేంద్ర ప్రభుత్వంలోని హోం శాఖ తీసుకుంటుందని, కాబట్టి, కేంద్రానికే ఫిర్యాదు చేస్తామని, అవినీతి అంశాలపై సిట్టింగ్ జడ్జీతో లేదా సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతామని అన్నారు. సివిల్ సప్లైలో అవినీతి అంశాలపై పూర్తి విచారణ జరిగే వరకు బీజేపీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.
ఇక పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన కొన్ని రోజులకే అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. అవినీతి జరిగిందని ప్రశ్నిస్తే రాజకీయ విమర్శలు చేస్తున్నదని, చిత్తశుద్ధి ఉంటే మంత్రుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ అవినీతికి కేంద్రానికి ఏమైనా సంబంధం ఉన్నదా? అని జీవన్ రెడ్డిని ప్రశ్నించారు. మిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ లేదా? లేక ప్రభుత్వమే మిల్లర్లతో కుమ్మక్కు అయిందా? అని అడిగారు.