– కొత్త టెలికాం చట్టంతో మారిన రూల్స్
– సెప్టెంబరు 15 నాటికి అమల్లోకి రానున్న చట్టం
– నకిలీ సిమ్‌లు, సైబర్ నేరాలకు చెక్ అంటున్న కేంద్రం
SIM Card: దేశవ్యాప్తంగా పెరిగి పోతున్న సిమ్ కార్డు మోసాలు, సైబర్ నేరగాళ్ల ఆటకట్టించేందుకు కేంద్రం నడుం బిగించింది. ఈ క్రమంలోనే టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023లో తీసుకొచ్చిన నిబంధనలను డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) త్వరలో అమలు చేయనుంది. ఈ విషయంపై డాట్‌కు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) గతంలో సిఫార్సు చేసింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి.
కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే నకిలీ సిమ్ కార్డ్‌లు, సైబర్ మోసాలు తగ్గుతాయని కేంద్రం భావిస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై ఎవరైనా కొత్త సిమ్ కార్డు తీసుకోవాలంటే తప్పనిసరిగా బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటి సున్నితమైన సమాచారాన్ని సేకరించడంలో ఎటువంటి పొరపాట్లకు అవకాశం లేని రీతిలో టెలీ కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ టెలికాం కంపెనీలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయటానికి రంగం సిద్ధం చేసింది. మరోవైపు దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించాలను కంపెనీలు విధిగా ప్రభుత్వం నుంచి స్పెక్ట్రమ్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసిన కేంద్రం స్పెక్ట్రమ్ కేటాయింపులు, శాటిలైట్ కమ్యూనికేషన్‌కు సంబంధించిన సరికొత్త నిబంధనలనూ తీసుకురానుంది.
టెలికమ్యూనికేషన్స్ చట్టంలోని వివిధ సెక్షన్లలోని నూతన నిబంధనలను సెప్టెంబర్ 15 నాటికి అమల్లోకి తీసుకురావాలని డాట్ లక్ష్యంగా పెట్టుకుంది. బ్రిటిషర్ల కాలం నాటి ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, ఇండియన్ వైర్‌లెస్ టెలిగ్రాఫ్ చట్టం, టెలిగ్రాఫ్ వైర్స్ చట్టం స్థానంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రూపొందించిన నూతన కమ్యూనికేషన్ల బిల్లును భారత పార్లమెంటు 2023 డిసెంబరు 20న ఆమోదించిన సంగతి తెలిసిందే.