Big Shock To MLC Kavitha, ED Imposed 7 days Custody : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఏడు రోజుల కస్టడీ కోసం ఈడీకి అప్పగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో కవిత కీలక సూత్రధారుల్లో ఒకరిగా కోర్టు పరిగణించింది. ఈ మేరకు రిమాండ్ రిపోర్టులో పలు అంశాలను కోర్టు పేర్కొంది. మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కలిసి సౌత్ సిండికేట్ ఏర్పాటు చేసి కుట్ర చేశారని తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో కుమ్మక్కై రూ.వంద కోట్ల మేర ముడుపులను సమర్పించారని తేల్చింది. ఆ మేరకు ప్రతిఫలం పొందేలా ఢిల్లీ మద్యం పాలసీలో తమకు అనుకూలంగా నిబంధనలు రూపొందించారన్న విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అంతకుముందు ఇరు వర్గాల మధ్య వాడీవేడి వాదనలు కొనసాగాయి. సుప్రీంకు ఇచ్చిన హామీని ఈడీ ఉల్లంఘించిందని కవిత తరఫు లాయర్ విక్రమ్ చౌదరి తెలిపారు. అలాగే, కవితను అరెస్ట్ చేయబోమని చెప్పారని గుర్తు చేశారు. ఈడీ తరఫు న్యాయవాది జోయబ్ హుస్సేన్ మాట్లాడుతూ, ఆనాడు పది రోజులకు మాత్రమే ఏం చేయమని చెప్పామని అన్నారు. విచారణ నుంచి మినహాయింపు ఇవ్వలేదని తేల్చి చెప్పారు. ఇరు వర్గాల వాదనల తర్వాత కోర్టు కవితను ఈడీ కస్టడీకి అనుమతించింది.
రిమాండ్ రిపోర్టులోని విషయాలు
కవిత రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను ప్రస్తావించింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తి అని, ఆప్ నేతలతో వంద కోట్ల ముడుపుల డీల్ చేశారని చెప్పింది. ఢిల్లీ లిక్కర్ విధానంలో కీలక కుట్రదారు, లబ్ధిదారు ఆమేనని, సౌత్ గ్రూపులోని శరత్ చంద్రారెడ్డి, రాఘవ, శ్రీనివాసులు రెడ్డితో కలిసి ఆప్ నేతలతో కుట్రకు పాల్పడ్డారని తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో ఒప్పందం కుదుర్చుకున్నారని పేర్కొంది ఈడీ. ముడుపులు అందజేసిన కారణంగా కవిత మద్యం విధానం ముందుగానే పొందగలిగారని, నిబంధనలు తనకు అనుకూలంగా ఉండేలా చూసుకోగలిగారని తెలిపింది. అరుణ్ పిళ్లైని డమ్మీగా పెట్టి ఇండో స్పిరిట్ కంపెనీలో కవిత వాటా పొందారని, ఇతరులతో కలిసి వంద కోట్ల రూపాయల లంచాలను ఆప్ నేతలకు ఇచ్చారని ఆరోపించింది.
Read More:ఎకో టూరిజాన్ని డెవలప్ చేద్దాం: సీఎం
ఢిల్లీ లిక్కర్ బిజినెస్ లో వ్యాపారం చేయడం కోసం కవిత తనను సంప్రదించారని అరవింద్ కేజ్రీవాల్ తనతో చెప్పినట్లు మాగుంట శ్రీనివాసులురెడ్డి వాంగ్మూలమిచ్చారని పేర్కొంది ఈడీ. కేజ్రీవాల్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో కవితతో సమావేశమయ్యానని, ఆ సమావేశంలోనే ఆప్ నేతలకు వంద కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని, వెంటనే 50 కోట్లు అందజేయాలని కవిత తనతో చెప్పారని శ్రీనివాసులు రెడ్డి చెప్పారని వివరించింది. కవిత సూచనలతో 25 కోట్లను తన కుమారుడు రాఘవ అందజేశాడని మాగుంట చెప్పారని తెలిపింది ఈడీ. రాఘవ కూడా ఇదే వాంగ్మూలం ఇచ్చారని చెప్పింది. ఒక సందర్భంలో 10 కోట్లు మరో సందర్భంలో 15 కోట్లను అభిషేక్ బోయినపల్లి చెప్పిన అడ్రస్‌లో అందజేసినట్లుగా రాఘవ చెప్పారని తెలిపింది. ఇంకా పలు విషయాలను రిమాండ్ రిపోర్టులో పొందుపరిచింది ఈడీ.