- మళ్లీ వివాదంలోకి భద్రాద్రి రామాలయం
- మరోసారి తెరపైకి రామనారాయణ వివాదం
- భద్రాద్రి ఆలయంలో వేద పండితులకు మెమొలు
- హైకోర్టును ఆశ్రయించిన పలువురు స్థానికులు
- దశాబ్ద కాలంగా రగులుతున్న రామనారాయణుడి వివాదంBhadradri sri rama temple priests memos on the issue of ramanarayanam:
భద్రాచలంలో కొలువున్నది శ్రీరాముడా.. రామనారాయణుడా? అనే వివాదం కొంతకాలంగా జరుగుతున్న విషయం విదితమే. కాగా శ్రీరామనవమి కళ్యాణ వేడుకల సందర్భంగా ప్రవర మార్చి చదువుతున్నారంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో భద్రాద్రి ఆలయంలోని అర్చకులకు, వేద పండితులకు ఆలయ ఈవో మెమోలు జారీ చేశారు. రామనారాయణ, ప్రవర విషయంలో హైకోర్టు ఉత్తర్వులతో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కమిటీ సూచనల మేరకు వివరణ కోరుతూ అర్చకులకు, వేద పండితులకు ఈ మేరకు అధికారులు మెమోలు జారీ చేశారు.
అర్చకులు చేస్తున్నది అపచారమా?
గతంలోనూ భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి, భద్రాద్రి దేవస్థానం వైదిక సిబ్బంది ఈ అంశంపై విమర్శలు, ప్రతి విమర్శలతో చర్చకు తెరలేపారు. భద్రాచలంలో కొలువై ఉన్నది శ్రీరామచంద్రుడేనని భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి, రామ భక్తులు పేర్కొంటుండగా.. వైకుంఠం నుంచి వచ్చి భద్రుని కోరికపై శంఖుచక్రాలు, ధనుర్బాణాలతో కొలువై ఉన్న స్వామి వారు కాబట్టి రామనారాయణుడుగా భావించాలని దేవస్థానానికి చెందిన వైదిక సిబ్బంది పేర్కొంటున్నారు. స్వామివారికి నిర్వహించే నిత్య కల్యాణాల్లో ప్రవర చదివే సమయంలో ‘రామచంద్ర స్వామినే వరాయ’ అని చెప్పాల్సి ఉండగా.. ‘రామనారాయణ స్వామినే వరాయ’ అని మార్చడం ద్వారా అర్చకులు అపచారం చేస్తున్నారని భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి ఆరోపిస్తూ తమ వద్ద ఉన్న ఆధారాలను చూపే ప్రయత్నం చేసింది. శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయానికి తూట్లు పొడుస్తూ ఈ విధంగా మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తోంది. అయితే భద్రాద్రి దేవస్థానం వైదిక సిబ్బంది మాత్రం.. భద్రాదిల్రో వెలసిన శ్రీరామచంద్రుడిని కోదండ రాముడుగా, భద్రాద్రి రాముడుగా, వైకుంఠ రాముడుగా, ఓంకార రాముడుగా, రామనారాయణుడుగా కొలవడం జరుగుతోందని పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని తమ అనువంశిక అర్చకత్వంలో ఎందరో పెద్దలు ప్రస్తావించిన విషయాన్ని వారు ఉదాహరిస్తున్నారు.
బ్లాగ్‌లో ప్రత్యేక ఓటింగ్
భద్రాచలంలో కొలువై ఉన్నది శ్రీరామచంద్రుడేనని, జరగాల్సింది సీతారాముల కల్యాణమేనని అందరూ దీనిని సమర్థించి, దైవాపచారాన్ని ఖండించాలని కోరుతూ భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి ప్రత్యేక బ్లాగ్ ద్వారా గతంలో ఓటింగ్ నిర్వహించింది. ఇందులో హిందువులంతా పాల్గొనాలని కోరింది. అనంతరం భద్రాద్రిలో కొలువై ఉన్నది రాముడా, రామనారాయణుడా అనే అంశంపై బహిరంగ చర్చను నిర్వహించనున్నట్లు తెలిపింది. దీనిపై సీఎంకు లేఖ రాసి.. స్పందించకుంటే న్యాయ పోరాటం సైతం చేస్తామంటున్నారు.