Congress Party: తుక్కుగూడ సభా వేదికగా ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరనున్నట్టు శనివారం ప్రచారం జరిగింది. అంతలోనే ఎమ్మెల్యేలు, నాయకులు అధైర్యపడవద్దని, భవిష్యత్ బీఆర్ఎస్‌దేనని, ఎవరూ పార్టీ మారవద్దని కేసీఆర్ ధైర్యం చెప్పినట్టూ వార్తలు వచ్చాయి. కానీ, గత రెండు మూడు రోజులుగా మీడియాలో నానుతున్నట్టుగానే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కాంగ్రెస్‌లో చేరారు. అంతేకాదు, మరో 20 నుంచి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్‌లో చేరుతారని ఉత్తమ్ కుమార్ రెడ్డి బాంబు పేల్చారు.
ఆదివారం ఉదయం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రావు తెల్లం వెంకటరావును కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెల్లం వెంకటరావుతోపాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు హస్తం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు నాయకులు హాజరయ్యారు. దీంతో ఖమ్మంలోని పదికి పది అసెంబ్లీ సెగ్మెంట్లు కాంగ్రెస్ చేతికి చిక్కినట్టయింది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలు కాంగ్రెస్‌లో చేరారు.
Also Read: జన జాతర కాదు.. అబద్ధాల జాతర: తుక్కుగూడ సభపై కేటీఆర్ ఫైర్
గత కొన్ని రోజులుగా తెల్లం వెంకటరావు బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. అనూహ్యంగా మంత్రి తుమ్మల కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారు. దీంతో ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. రాహుల్ గాంధీ పాల్గొన్న తుక్కుగూడ సభా వేదిక మీద తెల్లం వెంకటరావు కనిపించడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంఛనమే అని స్పష్టమైంది. మరుసటి రోజు ఉదయమే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రావు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావును పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
𝘽𝙝𝙖𝙙𝙧𝙖𝙘𝙝𝙖𝙡𝙖𝙢 𝘽𝙍𝙎 𝙈𝙇𝘼 𝙟𝙤𝙞𝙣𝙚𝙙 𝘾𝙤𝙣𝙜𝙧𝙚𝙨𝙨 𝙥𝙖𝙧𝙩𝙮
కాంగ్రెస్ పార్టీ లో చేరిన భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే
పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు. కండువా కప్పి పార్టీలోకి… pic.twitter.com/L0xXMLQNzJ
— Congress for Telangana (@Congress4TS) April 7, 2024
Also Read: ఆర్జీవీ డైలాగ్ కాపీ కొడుతున్న తెలుగు ముఖ్యమంత్రులు జగన్, రేవంత్ రెడ్డి
ఇదిలా ఉండగా త్వరలోనే మరో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ దుకాణం మూసుకోవాల్సిందేనని జోస్యం చెప్పారు. ఈ వ్యాఖ్యల్లో నిజమెంతో తెలియకపోయినా బీఆర్ఎస్ అధిష్టానానికి మాత్రం కొంత గగుర్పాటు కలిగిస్తున్నాయి. వెంటనే ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు రియాక్ట్ అయ్యారు. ఉత్తమ్ కుమార్ పై విమర్శలు చేశారు. ఒక వైపు రాహుల్ గాంధీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోబోమని చెబుతుంటే.. మరో వైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని విడ్డూరంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యేలను చేర్చుకుని బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలని కాంగ్రెస్ చూస్తున్నదని మండిపడ్డారు. అయితే.. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ కాంగ్రెస్‌లో చేరరు అని పేర్కొన్నారు.