BRS MLA Tellam Venkata Rao: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్‌కు సవాల్ విసిరారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడానికి పని చేస్తానని అన్నారు. కానీ, ఖమ్మం జిల్లాలోని పది స్థానాలకు గాను 9 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. ఒక్క భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకటరావు గెలిచారు. ఖమ్మం నుంచి కాంగ్రెస్‌కు పది మంది ఎమ్మెల్యేలను ఇస్తానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన మాటే త్వరలో నిజం కాబోతున్నట్టు తెలుస్తున్నది. భద్రాచలం ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భద్రాచలం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ పై తెల్లం వెంకటరావు గెలిచారు. ఇటీవల కొంత కాలం నుంచి ఆయన బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. పలు పార్టీ సమావేశాలకూ ఆయన డుమ్మా కొట్టారు. ఇదిలా ఉండగా.. ఇల్లందులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశానికి హాజరయ్యారు. ఈ మార్పుపై చర్చ రేగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయం అనే అంటున్నారు.
ఈ నెల 5వ తేదీన దీపాదాస్ మున్షి సమక్షంలో తెల్లం వెంకటరావు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని, లేదంటే తుక్కుగూడలో ఈ నెల 6న నిర్వహించే సభలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఆయన మిత్రులు చెబుతున్నారు. దీంతో మరొక బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖరారు అయినట్టేనని తెలుస్తున్నది.
ఇది వరకే దానం నాగేందర్, కడియం శ్రీహరిలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ మారితేనే బీఆర్ఎస్ అగ్గిమీద గుగ్గిళం అవుతున్నది. అవసరమైన సుప్రీంకోర్టు వరకైనా వెళ్లి వారిపై అనర్హత వేటు వేయిస్తామని కేటీఆర్ అన్నారు. గేట్లు మూసే ప్రయత్నాలు చేస్తున్నా… వలసలు ఆగేలా లేవు.