– బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం
– కాకాని కారు స్టిక్కర్ వాడిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు
– పాజిటివ్ వచ్చిన 86 మందికి నోటీసుల జారీ
– సినీ నటి హేమకు కూడా సమన్లు
– రేపు విచారణకు రావాలని ఆదేశం
– రంగంలోకి హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు
Bengalore rave party speedup the case police narcotics tests telangana police:
బెంగళూరు రేవ్ పార్టీ మూడు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. డ్రగ్స్ తీసుకున్నట్టు 86 మందికి పాజిటివ్ వచ్చింది. వారిలో అధికంగా ఉన్నది తెలుగు వాళ్లే. అందులోనూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారూ ఉన్నారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
ఆ 86 మందికి నోటీసులు
డ్రగ్స్ కేసులో బెంగళూరు పోలీసులు నటి హేమతో పాటు టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన 86 మందికి నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు రావాలని ఆదేశించారు. ఆమె రక్త నమూనాల్లో డ్రగ్స్ తీసుకున్నట్టు తేలడంతో కంపల్సరీగా రావాల్సిందేనని స్పష్టం చేశారు. నోటీసులు అందుకున్న వారు తప్పనిసరిగా బెంగళూరుకు వెళ్లి విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ హేమ విచారణకు హాజరైతే ఆమె ఎలాంటి విషయాలు బయటపెడతారనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. హేమ వ్యవహరంలో ఆమెకు ఎవరు డ్రగ్స్ అలవాటు చేశారు? ఆమె ఎప్పటి నుంచి తీసుకుంటోంది. ఇలా అనేక ప్రశ్నలు ఆమెకు విచారణలో ఎదురయ్యే అవకాశం ఉంది.
ఎమ్మెల్యే స్టిక్కర్ వాడిన వ్యక్తి అరెస్ట్
మరోవైపు, సీసీబీ పోలీసులు కాకాని కార్ స్టిక్కర్ వాడిన వ్యక్తిని గుర్తించారు. పూర్ణ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో పోలీసుల నెక్స్ట్ స్టెప్ చాలా కీలకంగా మారనుంది. ఇలాంటి కేసులలో ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే వారిని బాధితులుగా మాత్రమే పరిగణిస్తారు. కానీ, బెంగళూరు లాంటి ప్రాంతాల్లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన సినిమా తారలను ఆ రాష్ట్ర పోలీసులు గతంలో ఎన్నోసార్లు అరెస్టులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు ఎలా ముందుకు వెళతారన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలన కోసం ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చర్యలు చేపడుతోంది.
హైదరాబాద్ నార్కోటిక్ పోలీసుల ఆరా
ఇదిలా ఉంటే బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంపై తెలంగాణ నార్కోటిక్ పోలీసులు దృష్టి సారించారు. సాధారణంగా తెలంగాణలో నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఏర్పడిన తర్వాత ఎక్కడ డ్రగ్స్ మూలాలు దొరికినా వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఈ సమయంలో బెంగళూరు రేవ్ పార్టీలో ఎక్కడి నుండి డ్రగ్స్ చేరాయనే వ్యవహారంలో హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ పార్టీలో తెలుగు వారు ఎక్కువగా ఉండటంతో వారి వివరాలను సైతం సేకరిస్తున్నారు. ఇలా ఒక్క కేసుతో ఎన్నో చిక్కుముడులు వీడే అవకాశం ఉండటంతో తెలంగాణ నార్కోటిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు.