– వేళ్లన్నీ ఈఐపీఎల్ శ్రీధర్ రెడ్డి వైపే
– ఎమ్మార్వో ఇక్బాల్ కీలక పాత్ర
– తప్పును కప్పిపుచ్చుకోవడంలో శ్రీధర్ రెడ్డి దిట్ట
– మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డికి బినామీ
– మహేశ్వరంలో 42 ఎకరాల భూదాన్ భూమి కబ్జా కేసులోనూ నిందితుడు
– సుప్రీం తీర్పుతో బయటపడుతున్న పేర్లు
– బీఆర్ఎస్ పాలనలో లిటిగేషన్ భూములే టార్గెట్
– 10 ఏండ్లలో 3 వేల కోట్ల ఆస్తులకు ఎదిగిన ఈఐపీఎల్ శ్రీధర్
– మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని 620 ఎకరాలకు గండ్ర స్కెచ్
– గులాబీ.. బినామీ.. సునామీ పార్ట్-3
– ‘స్వేచ్ఛ’ ఎక్స్ క్లూజివ్
Benami Sketch, Rs.380 Crore Forest Land Hamphat: బీఆర్ఎస్ హయాంలో ఎన్నో అక్రమాలు జరిగాయి. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అన్నీ బయటకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ‘స్వేచ్ఛ’ వరుస కథనాలు ఇస్తోంది. ‘గులాబీ.. బినామీ.. సునామీ’ పేరుతో గతంలో జరిగిన అవినీతిని బయటపెడుతోంది. అధికారం ఉందని గులాబీ లీడర్లు విచ్చలవిడిగా ప్రవర్తించిన తీరును నిలదీస్తోంది. కేవలం నగరంలోనే కాదు, జిల్లాల్లోనూ బినామీ లీడర్ల దందాలు అన్నీఇన్నీ కావు. భూపాలపల్లి జిల్లాలో అటవీశాఖకు చెందిన 740 ఎకరాల భూమికి ఎసరు పెట్టారు. సర్వే నెంబర్ 171లో ముస్లింల పేర్లను వాడుకుని కోర్టు నుంచి క్లియర్ చేసుకోవాలని పక్కా ప్లాన్ గీశారు. పాత రికార్డులను కొత్తగా కోర్టుల్లో కలెక్టర్ అఫిడవిట్ ఇస్తే సరిపోతుంది అనుకుని అనుకూలమైన అధికారులతో కొట్టేశారు. కథ అడ్డం తిరగడంతో సుప్రీంకోర్టు తీర్పుతో వారందరికీ దిమ్మ తిరిగిపోయింది. ఇదే భూమి కోసం 2014 నుంచి 2018 వరకు ఉన్న అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మధుసూదనాచారి ప్రయత్నించారనే టాక్ ఉంది. అయితే, 2019లో గండ్ర వెంకట రమణారెడ్డి గెలుపొందడంతో సీన్ రివర్స్ అయింది. అటవీశాఖ భూమిని పొజిషన్ తీసుకునేందుకు ప్రయత్నం చేస్తుండగానే గండ్ర ఎంట్రీ ఇచ్చారు. తన బినామీ సంస్థ అయిన ఈఐపీఎల్‌తో 10 ఎకరాల అగ్రిమెంట్ చేయించారు. అధికారులకు హైదరాబాద్‌లో ఆస్తులు ఆశ చూపించి కొట్టేసే ప్రయత్నం సక్సెస్ చేసుకున్నారు. అందుకు, ప్రతిఫలంగా ఎమ్మార్వో ఇక్బాల్‌కి బంజారాహిల్స్‌లో లగ్జరీ అపార్ట్‌మెంట్ ఇచ్చేందుకు అన్నీ జరిగిపోయాయి. కలెక్టర్ తన పని తాను పూర్తి చేశారని చెప్పడానికి కారణం ఆయన కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్స్‌యే సాక్ష్యం.
కబ్జాకోర్‌గా ఈఐపీఎల్
ఎక్కడ వివాదం ఉంటే అక్కడ నేనుంటా అనే సంస్థ ఈఐపీఎల్ కన్‌స్ట్రక్షన్ సంస్థ. రియల్ ఎస్టేట్ వ్యాపారులను అడిగితే దీని గురించి పేజీలకు పేజీలు చెప్తుంటారు. కానీ, ఎక్కడా ఎవిడెన్స్ ఉండదు. పాపం పండితే బయటపడే నిజాలు ఏంటో ఈఐపీఎల్‌కి మాత్రమే తెలుసు. మహేశ్వరంలోని నాగారం గ్రామంలో 181 సర్వే నెంబర్‌లో 42 ఎకరాలను కబ్జా చేసి భూధాన్ భూమిని ఆక్రమించుకున్నారు. హైకోర్టు తీర్పుతో ఈ భూ వ్యవహారం బయటపడింది. ప్రైవేట్ పిటిషన్‌తో అప్పటి ఎమ్మార్వో జ్యోతితో పాటు కాసీం, ఈఐపీఎల్ శ్రీధర్ రెడ్డి, మొత్తం ఐదుగురిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. మోకిలలో 40 ఫీట్ల రోడ్డుని 500 మీటర్ల దూరం కబ్జా చేసినా అధికారులను మేనేజ్ చేసి దర్జాగా విల్లాలు నిర్మించారు. పుప్పాలగూడలో అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టడంతో హైకోర్టు వరకు విచారణకు వెళ్లింది. ఇలా ఎన్నో దందాలు చేసి 3 వేల కోట్ల దాకా అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించారని ఆధారాలు ఉన్నాయి.
మాజీ ఎమ్మెల్యే గండ్ర బరితెగింపు
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి భార్య జ్యోతి సొదరైనా ఇందిర అల్లుడే ఈ కొండపల్లి శ్రీధర్ రెడ్డి. బినామీల రూపంలో డబ్బులు పొగు చేయాలనుకునే సంస్థలు ఇతన్నే ఎంచుకుంటాయనే టాక్ ఉంది. బాచుపల్లిలో చెరువును కబ్జా చేసి మరీ స్టేర్నింగ్ హోమ్స్‌కి నిర్మాణానికి ఇచ్చినట్లు అప్పుడు అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఇలా రాజకీయ ముసుగులో ఎన్నో దందాలు రియల్ ఎస్టేట్‌లో చేశారని తెలుస్తోంది. ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశిస్తే తప్ప నిప్పులాంటి నిజాలు బయటపడవు.
నాకేం సంబంధం లేదు- శ్రీధర్ రెడ్డి
‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ టీం అనుమానాలకు వివరణ ఇచ్చారు శ్రీధర్ రెడ్డి. మహేశర్వం భూమికి సంబంధించి క్రిమినల్ కేసలు అయింది నిజం. మిగితా భూ వ్యవహారంలో ఎక్కడ నిరూపించినా అన్నింటినీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. భూపాలపల్లి భూ వ్యవహారం తనకు సంబంధం లేదని అంటున్నారు. కానీ, ఇదంతా ఆయనకు తెలిసి జరిగిందా? తెలియకుండానే ఆయన పేరును, సంస్థని వాడుకుని బినామీగా పెట్టుకున్నారా? ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంది.
-దేవేందర్ రెడ్డి చింతకుంట్ల (సీనియర్ జర్నలిస్ట్)