– ఓవైపు ఎండలు.. ఇంకోవైపు ఎన్నికలు
– జోరుగా బీర్ల అమ్మకాలు
– ఈనెలలో ఇప్పటికే రికార్డు స్థాయి సేల్స్
– రూ.670 కోట్లకు పైగా రాబడి
– గత ఏడాదితో పోలిస్తే 28.7 శాతం పెరుగుదల
Hyderabad Beer sales increase maximum in April : అసలే ఎన్నికల సమయం.. పైగా ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో మిట్ట మధ్యాహ్నం వేళ రోడ్లపై రద్దీ తగ్గిపోయింది. దీనికి తోడు వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువ కావడం, ఉక్కపోతతో జనం విలవిలలాడుతున్నారు. సాయంత్రం అయ్యేసరికి మందు బాబులు బీర్ల కోసం బార్లకు క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రతతో బీర్ల విక్రయాలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి.
మద్యంపై ఆదాయం
తెలంగాణ రాష్ట్రంలో ఏ సందర్భం వచ్చినా సరే ముక్క, సుక్క కచ్చితంగా ఉండాల్సిందే. మరీ ముఖ్యంగా మందు లేనిదే తెలంగాణలో శుభం అయినా అశుభం అయినా ఏ కార్యం ముందుకు సాగదు. గడిచిన పది సంవత్సరాల్లో ఇది మరింత పెరిగిపోయింది. ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం, జల్సాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో మద్యం అమ్మకాలు అధికంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మద్యంపై వచ్చే ఆదాయం దాదాపు రూ.30 వేల కోట్లకు చేరుకుంటోంది. రానున్న కాలంలో ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
18 రోజుల్లోనే రూ.670 కోట్ల బీర్లు
మందుబాబులు సరదా సరదాకే బీర్లు తాగుతారు. అలాంటిది ఎండలు మండిపోతున్నాయి చూస్కో మరి, మా కెపాసిటీ ఏంటో చూపిస్తామ్ అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 18 వరకు దాదాపు రూ.670 కోట్ల రూపాయల బీర్లను తాగినట్లు లెక్కలు చెబుతున్నాయి. దాదాపు 23,58,827 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే బీర్ల అమ్మకాలు 28.7 శాతం పెరిగి అమ్మకాల్లో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పాయి. ఎండలు అంతంతమాత్రంగా ఉండే ఏప్రిల్ నెలలోనే ఇలా తాగితే.. మే నెలలో ఏ రేంజ్ అమ్మకాలు సాగుతాయో అంచనా వేయవచ్చు. వచ్చే నెల ఎన్నికలను బేస్ చేసుకుని బీర్ల అమ్మకాలు మరింత జోరందుకోనున్నాయి. రాజకీయ నాయకుల వెంట తిరిగే వాళ్లందరికీ ప్రతిరోజూ మందు, ముక్క ఉండాల్సిందే. ఇటు, రోజురోజుకు పెరిగిపోతున్న బీర్ల అమ్మకాలకు తగ్గట్టుగా స్టాక్ అందుబాటులో ఉంచుతున్నట్లు తెలుస్తోంది.