Bandaru Rammohan Rao Analysis on Telangana Lok Sabha Seats : గత కాలపు అనుభవాలు నేర్పిన పాఠాలను వర్తమానానికి అన్వయింపజేసుకుంటూ, మెరుగైన భవిష్యత్తుకు బాటలు వేయటమే దార్శనికులైన నేతలు ప్రయత్నిస్తుంటారు. కానీ చరిత్రలో కొందరు పాలకులు చేసిన తప్పిదాల కారణంగా మానవ సమాజం వెతలపాలైన సందర్భాలను గుర్తుచేస్తూ మహాకవి శ్రీశ్రీ ‘ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’అన్నాడు. నేటి తెలంగాణ సమాజాన్ని పరిశీలిస్తూ, ఇక్కడ సంభవిస్తున్న మార్పులు,జరుగుతున్న పరిణామాల మీద ఇకపై వారంలో రెండు రోజులు.. తెలంగాణ సమాజపు నడకను నా మాటల్లో మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను.
దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమైంది. కానీ కేంద్ర ఎన్నికల కమిషన్‌లో జరుగుతున్న కొన్ని పరిణామాల కారణంగా ఈపాటికే విడుదల కావాల్సిన షెడ్యూల్ మరికొన్ని రోజులు ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. కమిషన్ సభ్యుల్లో ఒకరు పదవీ విరమణ చేయగా, మరొకరు రాజీనామా చేయటంతో ముగ్గురు సభ్యుల కేంద్ర ఎన్నికల సంఘంలో ఇప్పుడు ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ మాత్రమే ఉన్నారు. దీంతో గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కాలరాస్తూ, కేంద్రంలోని ప్రభుత్వం మరో ఇద్దరు కమిషనర్ల నియామకానికి రంగం సిద్ధం చేసింది. ఈరోజు ప్రధాని, హోం మంత్రి, లోక్‌సభలో విపక్ష నేతల భేటీలో కేంద్రంలో అత్యున్నత స్థాయి అధికారులుగా ఉన్న జ్ఞానేష్ కుమార్(కేరళ), సుఖ్‌బీర్ సింగ్ సంధు (పంజాబ్)లను కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా ఎంపిక చేయటం, వాటిని రాష్ట్రపతికి పంపటం జరిగిపోయాయి. రేపో మాపో వారిద్దరూ కొత్త కమిషనర్లుగా కొలువుదీరనున్నారు. ఈ దశలో అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏ డి ఆర్) సంస్థ, ఈ ఎంపిక గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా జరిగిందనీ, ఈ నియామకాలు ఆపాలని సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఆ విచారణ కొనసాగుతుండగానే, మరోవైపు కొత్త చట్టం ప్రకారం కొత్త ఎన్నికల కమిషనర్ల నియామకానికి ఆమోద ముద్ర పడేలా ఉంది.
ఇక తెలంగాణ విషయానికొస్తే, ఇక్కడ లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే బీజేపీ తెలంగాణలోని 17 స్థానాలకు గానూ 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆ పార్టీకున్న నలుగురు సిట్టింగ్ ఎంపీల్లో ఆదిలాబాద్ నుంచి ఉన్న సోయం బాపూరావు స్థానంలో జి. నగేష్‌ను ప్రకటించిన బీజేపీ అధిష్ఠానం, మిగిలిన మూడు సిట్టింగ్ స్థానాలను పాతవారినే కేటాయించింది. మల్కాజిగిరి నుండి ఈటల రాజేందర్, జహీరాబాద్ స్థానం నుండి బీబీ పాటిల్, చేవెళ్ల బరిలో కొండా విశ్వేశ్వర రెడ్డి, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, నాగర్ కర్నూల్‌లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కుమారుడు భరత్, మెదక్ నుంచి రఘునందన్ రావు, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, నల్గొండ బరిలో శానంపూడి సైదిరెడ్డి, పెద్దపల్లిలో జి. శ్రీనివాస్, మహూబాబాబాద్ నుంచి సీతారామ్ నాయక్ సీట్లు దక్కించుకున్నారు. ఎంఐఎం కంచుకోట హైదరాబాద్ స్థానంలో విరించి హాస్పిటల్స్ ఎండీ మాధవీలతను ప్రకటించి హిందూ ఓటర్ల పోలరైజేషన్‌కు ఆ పార్టీ తెరతీసింది.
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పటికే జహీరాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, మహబూబాబాద్ స్థానాలకు సురేష్ కుమార్ షెట్కార్, కుందూరు రఘువీర్ రెడ్డి, చల్లా వంశీచంద్ రెడ్డి, పోరిక బలరాం నాయక్ పేర్లను ప్రకటించి, మరో ఏడేనిమిది పేర్లను ఫైనల్ చేసింది. ఏ నిమిషంలోనైనా అధిష్ఠానం నుంచి ప్రకటన రావచ్చని సమాచారం.
మరోవైపు విపక్ష బీఆర్ఎస్ సైతం లోక్‌సభ అభ్యర్థుల ప్రకటనలో బిజీగా ఉంది. ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ సీటును మాలోతు కవిత, కరీంనగర్ నుంచి బి. వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, నిజామామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ సీటును కడియం శ్రీహరి కుమార్తె కావ్య, మెదక్ సీటును వంటేరు ప్రతాపరెడ్డి, జహీరాబాద్ సీటును గాలి అనిల్ కుమార్‌కు కేటాయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీకి చాలామంది నేతలు గుడ్‌బై చెప్పటంతో మిగిలిన స్థానాల్లో గట్టి అభ్యర్థులు దొరక్క ఆ పార్టీ సతమతమవుతోంది. నిన్నటి దాకా పార్టీ అధినేతతో రాసుకుపూసుకు తిరిగిన నేతలు సైతం బీఫామ్ ఇస్తారేమోనన్న భయంతో ముఖం చాటేస్తు్న్న పరిస్థితి.
మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో అన్ని పార్టీలు హడావుడిగా తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారానికి సిద్ధమైపోతున్నాయి. ఇక్కడ స్ధానబలం లేక బీజేపీ ఇతర పార్టీల నేతల వైపు చూడటం, వేరే పార్టీల సిట్టింగులు, వారి కుటుంబ సభ్యులకు సీట్లు ఆఫర్ చేయటం మీద ఇప్పటికే విమర్శలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ మాత్రం పోటీకి పార్టీ నేతలను ఒప్పించే పనిలోనే ఉంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం తనదైన శైలిలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ‘సబర్ కా ఫల్ మీఠా రహతా హై’ అన్నట్లు ప్రణాళిక ప్రకారం అన్ని సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటూ ఒక అడుగు ఆలస్యమైనా మంచి అభ్యర్థులనే నిలబెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో వీలున్నన్ని ఎక్కువ స్థానాలను గెలిచి తన బలాన్ని మరింత విస్తరించుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. సీఎం హోదాలో ఆ బాధ్యతను రేవంత్ రెడ్డి తీసుకుని ముందుకు సాగిపోతున్నారు. ఏది ఏమైనా, తెలంగాణలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో హోరాహోరీగా జరగనున్న త్రిముఖ పోరులో తెలంగాణ అభివృద్ధి ప్రధాన ఎజెండాగా మారనుంది.
బండారు రామ్మోహనరావు
సెల్ నెంబర్: 98660 74027