Delhi Liquor Policy: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లు శుక్రవారం ఉదయం ఢిల్లీలోని తిహార్ జైలుకు వెళ్లి కల్వకుంట్ల కవితతో ములాఖత్ అయ్యారు. జైలులో ఆమెను కలిసి మాట్లాడిన తర్వాత వారిద్దరు మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వాలు రూపొందించిన పాలసీలపై కేసులు పెడితే ఎలా అని బాల్క సుమన్ ప్రశ్నించారు. కొన్ని పాలసీలు విజయవంతం అవుతాయని, మరికొన్ని అనేక కారణాలతో అనుకున్నట్టుగా అమలు కాలేకపోవచ్చని, లోపాలు ఉన్నాయని భావించినప్పుడు వాటిని వెనక్కి తీసుకుంటారని వివరించారు. అంతేకానీ, కేసులు పెట్టేసుకుంటూ వెళ్లితే ఎలా అని అడిగారు. బీజేపీ తెచ్చిన పాలసీలపైనా కేసులు పెడితే రేపు అవి కుంభకోణాలుగా తేలుతాయని ఆరోపించారు. ఢిల్లీ మద్యం పాలసీ కారణంగా ఏ ఒక్కరికీ నష్టం జరగలేదని స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసు పూర్తిగా బీజేపీ రాసిన బూటకపు కేసు అని అన్నారు. ఇలాంటి నకిలీ కేసులకు అదిరేది లేదు, బెదిరిది లేదు అని వివరించారు. ఆ పార్టీ నేత పర్వేష్ వర్మ చెప్పినట్టే దర్యాప్తు సంస్థలు వ్యవహరించాయని ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 200 నుంచి 220 సీట్లు మాత్రమే దక్కే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. స్టాక్ మార్కెట్ల పతనం కూడా ఇదే సూచిస్తున్నదని పేర్కొన్నారు. నేడు దేశంలో పేరుకే డెమోక్రసి ఉన్నదని, అంతా అటోక్రసీ అమలవుతున్నదని అన్నారు.
Also Read: కిషన్ రెడ్డిపై విజయశాంతి ట్వీట్ వైరల్.. రాములమ్మ ఏం చెప్పాలనుకున్నారు?
కవితపై పెట్టిన కేసు పూర్తిగా దురుద్దేశపూరితమైనదని అర్థం అవుతున్నదని, మొదట ఆమెను సాక్షి అన్నారని ,ఆ తర్వాత అనుమానితురాలు అని పేర్కొని అనంతరం ఏకంగా అరెస్టు చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈడీ కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉండగానే సీబీఐ కూడా అరెస్టు చేయడం కక్ష సాధింపు కాకమరేంటీ? అని ప్రశ్నించారు. మోదీ మూడు నల్లచాట్టాలు తెచ్చారని, రైతుల వ్యతిరేకతతో వెనక్కి తీసుకున్నారని గుర్తు చేస్తూ ఢిల్లీ లిక్కర్ పాలసీని కూడా కేజ్రీవాల్ ప్రభుత్వం రద్దు చేసిందని వివరించారు. కవితపై మోపిన మనీలాండరింగ్ అభియోగం అవాస్తవం అని, కానీ, ఈ కేసులో తాను అమాయకురాలినని నిరూపించుకునే బాధ్యత నిందితులపైనే ఉంటుందని, ఈ లొసుగు ఆధారంగానే ఈడీ వేధింపులకు పాల్పడుతున్నదని వివరించారు.
ఈ కేసులో ఎక్కడైనా నగదు స్వాధీనం చేసుకున్నారా? ఎక్కడైనా లంచం డిమాండ్ చేసినట్టు తేలిందా? అలాంటప్పుడు మనీలాండరింగ్ చట్టాన్ని, అవినీతి నిరోధక చట్టాన్ని ఎలా ప్రయోగిస్తారని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. కేవలం అప్రూవర్లు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కవితను జైలులో పెట్టారని అన్నారు. జైలులో కవితపై దర్యాప్తు సంస్థలు తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నాయని, ఇతరులను ఇరికించడానికి వారి పేర్లు కూడా ప్రస్తావించాలని ఒత్తిడి పెడుతున్నాయని ఆరోపించారు. బీజేపీతో చేతులు కలిపిన నాయకులపై కేసులను మూసేస్తున్నారని అన్నారు. జైలులో ఉన్నా కవిత ధైర్యంగా ఉన్నారని వివరించారు.