Chhattisgarh: ఛత్తీస్‌గడ్ అడవుల్లో మరోసారి భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలో పెడియా అడవుల్లో శుక్రవారం ఉదయం 6 గంటలకు మొదలై సుమారు 11 గంటలపాటు ఉభయ వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఘటనా స్థలం నుంచి 12 మంది మావోయిస్టుల మృతదేహాలు, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనను ఛత్తీస్‌గడ్ సీఎం విష్ణుదేవ్ సాయి ధ్రువీకరించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో సైనికులు గొప్ప విజయం సాధించారని ప్రకటించారు.
మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారనే సమాచారం అందడంతో సుమారు 1200 మంది డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, కోబ్రా, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. గంగలూరు పోలీసు స్టేషన్ పరిధిలోని పెడియా అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు మొదలయ్యాయి. సుమారు 11 గంటలపాటు ఈ కాల్పులు జరిగాయి. బస్తర్ ఐజీ, బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాల డీఐజీ, ఎస్పీలు ఈ ఎన్‌కౌంటర్‌ను పర్యవేక్షించారు.