Mangoes: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైలులో ఉన్నారు. ఈ కేసులో అరెస్టయిన రాజకీయ ప్రముఖులకు బెయిల్ దొరకడం లేదు. వారి జ్యుడీషియల్ కస్టడీ తరుచూ పొడిగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. బెయిల్ పొందడానికి అరవింద్ కేజ్రీవాల్ మామిడి పండ్లు తింటున్నారని ఆరోపించింది. స్వీట్లు, ఆలూ పూరీ తీసుకుంటున్నారని, తద్వార ఆయన బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగితే.. ఆ కారణాన్ని చూపి బెయిల్ పొందాలని ప్లాన్ వేశారని పేర్కొంది.
అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లిన రోజుల వ్యవధిలో ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నదని, బరువు తగ్గారని ఆప్ పేర్కొంది. అప్పుడు సోషల్ మీడియాలో ఈ విషయమై హల్‌చల్ సాగింది. కానీ, ఆ వాదనలను జైలు అధికారులు ఖండించారు. ఆయన బరువు తగ్గలేదని, ఆరోగ్యం బాగానే ఉన్నదని, ఆయనకు ఇంటి భోజనం వస్తున్నదని వివరించారు. జైలుకు వెళ్లాక బరువు తగ్గడం కాదు కదా.. ఒక కిలో బరువు పెరిగాడని బీజేపీ నేతలు కౌంటర్ చేశారు.
షుగర్ లెవెల్స్ తగ్గిపోతున్నాయనీ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. తన షుగర్ లెవెల్స్‌లో హెచ్చతగ్గులు వస్తున్నాయని, వాటిని క్రమం తప్పకుండా టెస్ట్ చేయడానికి వారానికి మూడు సార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన ప్రైవేట్ డాక్టర్‌కు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేజ్రీవాల్ పిటిషన్‌ను ఈడీ తిరస్కరించింది.
Also Read: వారణాసి వర్సెస్ వయనాడ్.. రాహుల్ గెలుపు పక్కా
అరవింద్ కేజ్రీవాల్‌కు ఇంటి నుంచి భోజనం వస్తున్నదని, ఆయన తన బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచుకోవడానికి ఉద్దేశ్యపూర్వకంగా మామిడి పండ్లు, స్వీట్లు, ఆలూ పూరీ, తింటున్నారని, షుగర్‌తో ఉన్న టీ తాగుతున్నారని ఈడీ కోర్టులో వాదించింది. తన బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ పెరిగితే వాటిని కారణంగా చూపి బెయిల్ పొందాలని అరవింద్ కేజ్రీవాల్ అనుకుంటున్నాడని, బెయిల్ పొందడానికి ఆయన ఈ ప్లానర్ వేశారని పేర్కొంది. కాగా, ఈ వాదనలను అరవింద్ కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వివేక్ జైన్ కొట్టిపారేశారు. మీడియాలో రావడానికి ఈడీ తరఫు న్యాయవాది అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుని, మెరుగైన పిటిషన్ దాఖలు చేస్తామని వివరించారు.
కాగా, ఈడీ వాదనలను కోర్టు విన్న తర్వాత అరవింద్ కేజ్రీవాల్‌కు ఇస్తున్న డైట్ చార్ట్‌ను తమకు సమర్పించాలని ఆదేశించింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
ఈడీ, కేజ్రీవాల్ వాదనల్లో వాస్తవం ఎంత ఉందో తెలియదు.. కానీ, షుగర్ పెరగడానికి కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా తీపిని ఎక్కువగా తీసుకుంటున్నారనే మాట ఆసక్తిని కలిగిస్తున్నది. ఇలా కూడా ఆలోచిస్తారా? అనే చర్చ మొదలైంది. బెయిల్ కోసం ఇంతలా ప్లాన్ వేశారా? అని కొందరు అంటుంటే.. ప్రాణాలపైనే ప్రయోగాలు చేస్తారా? అంటూ మరికొందరు చెబుతున్నారు. కేసులో ఆధారాలేమీ లేవు.. ఈడీ ఇప్పుడు కొత్తగా మామిడికాయల ఎపిసోడ్ తెచ్చిందని ఆప్ నాయకులు ఫైర్ అవుతున్నారు. ఏదేమైనా సీరియస్‌గా నడుస్తున్న ఢిల్లీ లిక్కర్ కేసులో.. కొత్తగా మ్యాంగోల ట్విస్ట్ వచ్చింది.