– ఆప్ అంతమే బీజేపీ లక్ష్యం
– ఆపరేషన్ ఝాడు మొదలుపెట్టింది
– బీజేపీ హెడ్ ఆఫీస్ ముట్టడికి కేజ్రీవాల్ ప్రయత్నం
– అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తం
BJP Head Quarters: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి జైలు పాలై, ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు సీఎం కేజ్రీవాల్. ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని తుడిచిపెట్టడానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’ ప్రారంభించిందని ఆరోపించారు. తద్వారా ఆప్ మరింత ఎదగకుండా, బీజేపీకి సవాల్‌గా మారకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు. మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్, సంజయ్ సింగ్, తనను ఇది వరకే అరెస్టు చేసి జైలుకు పంపారని, ఇంకా రాఘవ్ చద్దా, అతిషిలను కూడా అరెస్టు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తమను అరెస్టు చేసి ఆ తర్వాత తమ పార్టీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసి రోడ్డుకు ఈడ్చాలనేదే బీజేపీ ప్లాన్ అని తెలిపారు. అయితే, ఎన్నికలు ఉన్నందున ఈ పని చేస్తే తమకు సానుభూతి వస్తుందని ఈ ప్లాన్‌ను కొంతకాలం ఆపారని, ఎన్నికల తర్వాత ఈ పని చేయాలని బీజేపీ గట్టిగా నిర్ణయం తీసుకుందని ఆరోపణలు చేశారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడించారు కేజ్రీవాల్.
Also Read: తెలంగాణ క్యాబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్
బీజేపీ ప్రభుత్వం తమ పార్టీలో అగ్రనాయకులను ఒక్కొక్కరిగా అరెస్టులు చేస్తున్నదని శుక్రవారం పేర్కొన్నారు. తామే అంతా కలిసి బీజేపీ హెడ్ ఆఫీసుకు వస్తామని, తమలో ఎవరిని అరెస్టు చేసుకుంటారో చేసుకోవాలని సవాల్ విసిరారు. బీజేపీ కేంద్ర కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. స్వాతి మలివాల్ కేసులో తన పీఏ బిభవ్ కుమార్ అరెస్టు నేపథ్యంలో కేజ్రీవాల్ ఇలా స్పందించారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద పారామిలిటరీ బలగాలు మోహరించారు. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ నిరసనకు ఎలాంటి అనుమతి తీసుకోలేదని, 144 సెక్షన్ అమలులో ఉన్నదని, కాబట్టి, ఎవరు నిబందనలు ఉల్లంఘించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే, పోలీసుల హెచ్చరికలను ఆప్ నేతలు ఖాతరు చేయలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీసు నుంచి ర్యాలీగా దీన్‌దయాల్ మార్గ్‌లో ఉన్న బీజేపీ హెడ్ క్వార్టర్ వైపు కదిలారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయినా, బీజేపీ ఆఫీసు ముట్టడికి ప్రయత్నించారు. సుమారు 45 నిమిషాలపాటు నిరసనలు చేశారు. ఆ తర్వాత నిరసన కార్యక్రమాన్ని విరమించుకుని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
సీఎం ఇంటికి పోలీసులు
ఒకవైపు సీఎం కేజ్రీవాల్ నిరసనల కార్యక్రమాల్లో ఉండగా పోలీసులు ఆయన నివాసానికి వెళ్లారు. స్వాతి మలివాల్‌పై దాడి కేసులో సీసీటీవీ డీవీఆర్ ఆధారాల కోసం వారు వెళ్లినట్టు సమాచారం. అడిషనల్ డీసీపీ అంజిత చెప్యాల సహా ఢిల్లీ పోలీసుల బృందం సీఎం నివాసానికి వెళ్లి సీసీటీవీ డీవీఆర్‌ను సీజ్ చేశారు.