– దశాబ్దాల దొరల పీడకు చెక్ పెడుదాం
– కేసీఆర్, హరీష్ దోపిడీకి ఇక చెల్లుచీటి
– బీసీల బిడ్డ నీలం మధుదే విజయం
– ఇందిరమ్మ సీటును సోనియమ్మకు ఇద్దాం
– పదేళ్లలో మోదీ ఆదిలాబాద్‌కి ఇచ్చిందేంటి?
– ఆత్రం సుగుణ గెలిస్తే.. కేంద్రమంత్రి పదవి
– సిద్దిపేట, ఆసిఫాబాద్ సభల్లో సీఎం రేవంత్ వ్యాఖ్యలు
Siddipet: రాబోయే ఎన్నికలు ఆధిపత్యానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. మెదక్ లోక్‌సభ సీటు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాంటిదని, ఆరునూరైనా ఈ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం సిద్ధిపేటలో జరిగిన కార్నర్ రోడ్‌షోలో మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు తరపున సీఎం ప్రచారం చేశారు. 1980లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మెదక్ నుంచి ఎంపీగా బరిలో దిగిన శ్రీమతి ఇందిరా గాంధీని మెదక్ ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారని, ఈ సీటును గెలిచి సోనియమ్మకు కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. నెహ్రూ హయాంలో బీహెచ్‌ఈఎల్, ఇందిరా గాంధీ హయాంలో పటాన్‌చెరు పారిశ్రామిక వాడతో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఈ మెదక్ ప్రాంతానికి తరలివచ్చాయని, దీంతో దేశవ్యాప్తంగా మెదక్ ప్రాంతానికి ఒక గుర్తింపు వచ్చిందని తెలిపారు.
ఇక్కడ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న వెంకట్రామిరెడ్డి కరీంనగర్ నుంచి వచ్చినోడని, మెదక్ ఎంపీ సీటు బరిలో సీటివ్వటానికి ఒక్క పార్టీ కార్యకర్త కేసీఆర్‌కు దొరకలేదా అని ఎద్దేవా చేశారు. డబ్బు ఉండటంతోనే వెంకట్రామిరెడ్డికి కేసీఆర్ సీటిచ్చారనీ, ఆ డబ్బు ఇక్కడి కలెక్టర్‌గా ఉండగా పేదల భూములు ఆక్రమించుకునే వెంకట్రామిరెడ్డి కొల్లగొట్టారని మండిపడ్డారు. రాజపుష్ప కంపెనీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు మల్లన్న సాగర్ రైతులను, ఏటిగడ్డ కృష్ణాపూర్‌లో రైతులకు బేడీలు వేసి తీసుకుపోయిన వెంకట్రామిరెడ్డి ఇంటికి పంపే బాధ్యత ఓటర్లదేనని గుర్తుచేశారు. నిజాం వద్ద ఖాసీం రిజ్వీ ఎలాగో.. కేసీఆర్ హయాంలో వెంకట్రామిరెడ్డి అలాగని కీలక వ్యాఖ్యలు చేశారు. అతడు కేసీఆర్, హరీష్ తొత్తుగా వ్యవహరిస్తాడనీ, నీలం మధును గెలిపిస్తే అందరికీ అండగా నిలుస్తాడని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకొని అక్రమంగా ఫామ్‌హౌజ్‌లు కట్టుకున్నోళ్లు కావాలా? ప్రజలకు మంచి చేసేవాళ్లు కావాలో నిర్ణయించుకోవాలని సూచించారు. ఈ సారి కాంగ్రెస్ గెలవకపోతే మెదక్ జిల్లాలో శాశ్వత బానిసత్వం వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలోని ఆసిఫాబాద్‌లో గురువారం జరిగిన జనజాతర సభలో సీఎం ప్రసంగించారు. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని, గురువారం నాటి ఆసిఫాబాద్ జన జాతర సభలో సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ.. నామినేషన్ దాఖలు
ఆదిలాబాద్ రైతుల పోడు భూముల సమస్యలపై కేసీఆర్ దృష్టి పెట్టలేదని, అటు కేంద్రంలోని బీజేపీ సైతం గోండులకు స్థానం కల్పించలేదని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీలు గోండులు, లంబాడాల హక్కులను కాపాడలేవని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆ ఆయా వర్గాలకు సముచిత న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికలు మొదలైన 1952 నుంచి నేటి వరకు ఏ పార్టీ కూడా ఆదిలాబాద్ ఎంపీ టికెట్‌ను మహిళకు కేటాయించలేదని, మంత్రి సీతక్క సోనియా గాంధీకి విజ్ఞప్తి చేసి మరీ ఈ సీటును టీచరుగా పనిచేస్తున్న ఆత్రం సుగుణకు ఇప్పించారని ఆయన వెల్లడించారు. ఆదిలాబాద్‌లో సీసీఐ ఫ్యాక్టరీ మూతపడినా, కేసీఆర్, మోదీ పట్టించుకోలేదనీ, మోదీ తన పదేళ్ల పాలనలో తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డేనని సెటైర్ వేశారు. తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టి, పెరిగిన జనాభాకు అనుగుణంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించబోతోందని తెలిపారు.
దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీకి వచ్చే ఎన్నికల్లో 400 సీట్లు వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేస్తుందని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. 1881 నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి దేశంలో జనాభా లెక్కలు జరుగుతోందనీ, ఈ లెక్కన 2021లో జరగాల్సిన జనగణనను అమిత్‌షా కుట్ర చేసి ఆపించేశారని ఆరోపించారు. తాను రిజర్వేషన్ల రద్దుపై మాట్లాడితే అమిత్ షా కేసు పెట్టించారని, ఈ కుట్రలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టి, ప్రజలకు వాస్తవాలేంటో తెలియజెబుతుందని పేర్కొన్నారు. ఢిల్లీ సుల్తాన్‌లు తెలంగాణపై దాడి చేయాలని ప్రయత్నిస్తున్నారనీ, ఈ పరిస్థితిలో తెలంగాణ సమాజం అంతా ఒక్కటై కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో ఇండియా కూటమి విజయం సాధిస్తే, ఇక్కడ గెలవబోతున్న ఆత్రం సుగుణకు కేంద్రమంత్రి పదవి దక్కటం ఖాయమని ఆయన భరోసా ఇచ్చారు.