Nalgonda: అడవులను నరికేస్తుంటే.. గుట్టలను తవ్విపోస్తుంటే ఆ మూగ జీవాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. చాలా గ్రామాల్లో ఇప్పుడు కోతులు ఇళ్లల్లోకి దూరడం, పంట పొలాల్లో విహారం చేయడం సాధారణమైపోయింది. అడవుల్లో వాటికి ఆహారం, ఆశ్రయం లభించడం సులువుగానీ.. జనారణ్యంలో చాలా కష్టం. మన ఏర్పాట్లు, నిర్మాణాల గురించి వానరాలకు ఏం తెలుస్తుంది? పాపం.. అందుకే నీరు కనిపించగానే ట్యాంకులోకి దూకిన వానరాలు మళ్లీ బయటికి రాలేకపోయాయి. నీటిలో గిలగిల్లాడి మృత్యువాత పడ్డాయి. ఒకటి.. రెండు.. కాదు.. సుమారు 30 కోతులు నిర్జీవంగా నీటిలో తేలియాడుతూ కనిపించాయి. మరో వైపు స్థానికుల ఆందోళన ఉండనే ఉన్నది. అసలే తాగు నీటి ట్యాంకు.. అక్కడి నుంచే తాగు నీటి సరఫరా అవుతున్నది. దీంతో పది రోజుల వరకు కళేబరాలున్న నీటిని తాగామా? అనే ఆలోచన స్థానికులను కలవరపరుస్తున్నది. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో ఓ తాగు నీటి ట్యాంకులో ఈ ఘటన చోటుచేసుకుంది.
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్ కాలనీలో ఓ తాగు నీటి ట్యాంకులో కోతుల కళేబరాలను అధికారులు గుర్తించారు. వాస్తవానికి ఆ ట్యాంకుకు మెటల్ షీట్‌తో పైకప్పు వేశారు. కానీ, కోతులు ఆ రేకులను తప్పించి దాహార్తి తీర్చుకోవడానికి అందులోకి దిగి ఉంటాయని, కానీ, తిరిగి పైకి రాలేక అందులో పడిపోయి ఉంటాయని అనుమానిస్తున్నారు. ఆ వానరాలు ట్యాంకులో పడి చనిపోయి పది రోజులు గడిచి ఉంటాయనే అనుమానాలు ఉన్నాయి. మూడు రోజులుగా ఈ ట్యాంకు నుంచి నీరు సరఫరా కాకపోవడంతో అనుమానంతో పరిశీలించగా కోతుల కళేబరాలు కనిపించినట్టు అధికారులు తెలిపారు. కాగా, స్థానికుల్లో ఆందోళనలు వెలువడుతున్నాయి. ఆరోగ్య సమస్యలు వస్తాయేమోనని టెన్షన్ పడుతున్నారు.
Also Read: టీడీపీకి పవన్ వరం.. బీజేపీ శాపం.. బాబు ఫ్యూచర్ ఏంటో?
ఈ ట్యాంకు నుంచి సుమారు 50 ఇళ్లకు మాత్రమే నీరు సరఫరా అవుతున్నాయని నాగార్జునసాగర్ ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజినీర్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. 2000 లీటర్ల సామర్థ్యంతో రెండు ట్యాంకులు, 1000 లీటర్ల సామర్థ్యంతో మరో ట్యాంకు ఉన్నదని, ఈ కోతులు పడిన ట్యాంకు వేరని ఆయన స్పష్టం చేసినట్టు తెలిసింది. మున్సిపల్ సిబ్బంది కళేబరాలను వాటర్ ట్యాంక్ నుంచి తొలగించారు. క్లోరినేట్ చేసి శుభ్రపరిచిన తర్వాత మళ్లీ ఈ ట్యాంకు నుంచి నీటి సరఫరా చేస్తామని అధికారులు వివరించారు.
ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా దిగ్భ్రాంతిని వ్యక్తపరిచారు. తెలంగాణ మున్సిపల్ శాఖ తీరు దారుణం అని పేర్కొన్నారు. రోటీన్ మెయింటెనెన్స్, ఎప్పటికప్పుడు శుభ్రపరచడం వారి విధి అని, కానీ, ఆ విధిని నిర్లక్ష్యం చేస్తున్నారని ట్వీట్ చేశారు. ఇక రేవంత్ రెడ్డికి ప్రజా సంక్షేమం కంటే రాజకీయాలే ప్రధానమైపోయాయని విమర్శించారు.