appartment balconies extended up to 100 square arrange flower pots new trend :
పచ్చని చెట్లు, గడ్డి, మొక్కల మధ్య నడుస్తూ సేద తీరాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కాంక్రీట్ జంగిల్ లాంటి సిటీలో అలాంటివి కుదరదు. పైగా ఇప్పుడంతా అపార్ట్ మెంట్ కల్చర్. ఇండిపెండెంట్ ఇళ్లే దొరకడం లేదు. కొన్ని చోట్ల టెర్రస్ పైన మొక్కలు పెంచుతుంటారు. సాయంత్రం పూట చల్లదనం అస్వాదించాలంటే టెర్రస్ పైకి చేరుకోవాలి. అంత దూరం ఎక్కలేక బద్దకిస్తుంటారు. ఏదో మన ఇంటి పరిసరాలలోనే మొక్కలు ఉండాలని అనుకుంటాం. అందుకే అలాంటి వారి కోసమే ఇప్పుడు సరికొత్తగా నిర్మాణ సంస్థలు బాల్కనీలను విశాలంగా తీర్చిదిద్దుతున్నాయి. ఈ బాల్కనీలను అందమైన పూల మొక్కల కుండీలతో ఏర్పాటు చేసి వాటి మధ్య కూర్చుని నలుగురు కాలక్షేపం చేస్తుంటే ఎంత బాగుంటుంది. వచ్చిన అతిధులు కూడా ఇంట్లో అసౌకర్యంగా ఉంటుంది…అదే బాల్కనీలో ఇలా మొక్కల మధ్య సేద తీరడానికే ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. ఒకప్పుడు బాల్కనీ అంటే నాలుగడుగులు మాత్రమే ఉండేది. ఇప్పుడు సెంట్రల్ హాల్ విస్తీర్ణం తగ్గించేసి ఆ మేరకు బాల్కనీలను 100 చదరపు అడుగుల మేర నిర్మిస్తున్నాయి నిర్మాణ సంస్థలు.
విశాలమైన బాల్కనీలు
ఇప్పటిదాకా కట్టిన అపార్ట్ మెంట్లు ఒక లెక్క.ఇకపై కట్టబోయేవి మరో లెక్క. ఏదో బాల్కనీ అంటే ఈ చివర నుంచి ఆ చివర దాకా బట్టలు ఆరేసుకోవడానికి మాత్రమే అన్నట్లు ఉండేవి. ఇక అక్కడే చెప్పుల స్టాండ్, పాత వస్తువులు అన్నీ అక్కడే దర్శనమిస్తుంటాయి. ఇప్పుడు మారిన ట్రెండ్ కు అనుగుణంగా భవన నిర్మాణ సంస్థలు సరికొత్తగా ఆలోచిస్తున్నాయి. కొనుగోలుదారుల అవసరాలను దృష్టి లో పెట్టుకుని ఇంటికి నాలుగు వైపులా బాల్కనీలు ఉండేలా రూపొందిస్తున్నారు. అంతేకాదు ప్రతి గది నుండి డైరెక్ట్ గా బాల్కనీకి వెళ్లే లా ఇళ్లను కడుతున్నారు. బాల్కనీలో ఇంటిల్లిపాదీ హాయిగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ, కాఫీలు తాగి ఎంజాయ్ చేసే లా రూపకల్పన చేస్తున్నారు. ఒకరి కన్నా ఎక్కువగా కూర్చునే ఉయ్యాలలను కూడా బాల్కనీలో ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు బర్త్ డే పార్టీలు, న్యూయియర్ పార్టీలు జరుపుకునేలా బాల్కనీలను విశాలంగా రూపొందిస్తున్నారు.
బయట కూడా ఇంటీరియర్ డిజైన్
ఇంట్లోనే కాదు ఇంటి బయటా అలంకరణలకు ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఇంటి పరిసరాలలో ఎలాంటి మొక్కలుండాలి, ఎలాంటివి ఉండకూడదో డిజైన్ చేయడానికి కూడా కొన్ని సంస్థలు ఉన్నాయి. మనం ఇంట్లోనే ఉంటున్నా మన చుట్టూ ఉన్న బాల్కనీ కనిపించేలా గ్లాస్ డోర్లు ఏర్పాటు చేస్తున్నారు. మెయిన్ డోర్ లాక్ చేసినా ఇంట్లో బందీగా ఉన్నామనే ఫీలింగ్ కలగకుండా సరికొత్తగా ఆలోచించి మరీ కడుతున్నారు. ఎత్తు తక్కువైతే ప్రమాదమని భావించి పైన ఐరన్ రెయిలింగ్ ఇస్తున్నారు. జాతీయ భవన నిర్మాణ నిబంధనల ప్రకారం బాల్కనీ రెయిలింగ్ ఎత్తు ఒక మీటర్‌కంటే ఎక్కువ ఉండాలి.
ఇంటి చుట్టుపక్కలా బాల్కనీలు
గదుల్లో మాస్టర్ బెడ్ రూం ఎలాగో. అలా ఇప్పుడు సువిశాలమైన బాల్కనీ ఒకటి ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. దానికోసం 150 చదరపు అడుగులు దాటి వెళ్తున్నారు. అంతే కాదు బాల్కనీలో కొంత భాగం ల్యాండ్‌స్కేపింగ్‌కు ఉపయోగపడేలా నిర్మిస్తున్నారు. అక్కడ మొక్కలు పెంచుకునేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం అడుగు ఎత్తు వరకు మట్టి నింపుకొనేందుకు వెసులుబాటు కల్పిస్తున్నారు. నగరంలో పర్యావరణ గృహాల పేరిట అపార్టుమెంట్లలో 10 అడుగుల ఎత్తులో గుబురుగా పెరిగే మొక్కలను పెంచేందుకు అనువుగా నిర్మిస్తున్నారు. 2 వేల నుంచి 3 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో తయారవుతున్న ఫ్లాట్‌లలో 150 నుంచి 200ల చదరపు అడుగుల విస్తీర్ణంలో బాల్కనీ ఇస్తున్నారు. బాల్కనీ వైపు చెరువులు, పార్కులుంటే మరింత విశాలంగా నిర్మిస్తున్నారు. పై అంతస్తులకు వెళ్లే కొద్దీ బయట ప్రపంచం ఎక్కువగా కనిపించే విధంగా గేటెడ్ కమ్యూనిటీల్లో పెద్ద ఫ్లాట్లలో విశాలమైన బాల్కనీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.