- బీజేపీకి 12 సీట్లు ఇస్తే రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేస్తామంటున్న అమిత్ షా
- తెలంగాణ పర్యటనలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి
- విమోచన దినోత్సవం అధికారికంగా జరపడం లేదని వ్యాఖ్య
- రాష్ట్ర విభజన సమయంలో గోడమీద పిల్లిలా వ్యవహరించిన బీజేపీ
- శ్రీరామ నవమి శోభాయాత్రను అడ్డుకున్న ముస్లింలంటున్న అమిత్ షా
- నగరంలో ఆ రోజు ప్రశాంతకరమైన వాతావరణం
- గతంలో తెలంగాణలో నలుగురు ఎంపీలను గెలిపించుకున్న బీజేపీ
- భారీ ప్రాజెక్టుల విషయంలో మొండి చెయ్యి
- విభజన హామీలేవీ నెరవేర్చని కేంద్రం అంటున్న ప్రతిపక్షాలు
Amit shah controversial comments(BJP news in telangana):తెలంగాణలలో బీజేపీకి 12 సీట్లు ఇస్తే రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా చేస్తామంటూ కేంద్ర మంత్రి అమిత్ షా అంటున్నారు. అంతటితో ఆగకుండా శ్రీరామనవమి శోభాయాత్రను ముస్లింలు అడ్డుకున్నారని చెబుతున్నారు. అసలు ఆ రోజు హైదరాబాద్ నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనా జరగలేదు. ఇక తెలంగాణ విమోచన దినోత్ససవాన్ని అధికారికంగా జరపడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు తెలంగాణ ఉద్యమ చరిత్ర అమిత్ షా కు ఏం తెలుసని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర విభజన సమయంలో గోడమీద పిల్లిలా వ్యవహరించిన బీజేపీకి తెలంగాణ విమోచన గురించి ప్రశ్నించే హక్కు ఉందా అని విపక్షాలు నిలదీస్తున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నదని ఆరోపించిన అమిత్ షా సహా ఆ పార్టీ నేతలు ఎన్నికల సమయంలో పాతబస్తీ, భైంసా వంటి అంశాల ప్రస్తావన లేకుండా ఓట్లు అడగగలరా? అని ప్రశ్నిస్తున్నారు.
ప్రశాంత వాతావరణంలో హైదరాబాద్
కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీల కాలం నుంచి స్వరాష్ట్రం వరకు ఎన్నడూ తెలంగాణలో విద్వేష రాజకీయాలకు తావు లేదు. హిందూ, ముస్లింలు గంగా జమునా తెహజీబ్ వలె కలిసి మెలిసి ఉన్నారు. హైదారాబాద్ లాంటి మహానగరంలో హిందూ, ముస్లింలే కాదు దేశంలోని అనేక మతాల వాళ్లు నివసిస్తున్నారు. బయటి శక్తుల కుట్ర చేసిన సందర్భాలు మినహా ఇక్కడ నిత్యం ప్రశాంత వాతావరణమే ఉండేది. ఇక్కడి ప్రజలంతా అన్ని మతాల సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తారు. అన్ని మతాల పండుగలను గౌరవిస్తారు. సోదరభావంతో కలిసి మెలిసి నిర్వహించుకుంటారు. కానీ ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు తెలంగాణను ముస్లిం రాజ్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. ఇదంతా ఓటు బ్యాంకు రాజకీయం కోసమే అన్నది అందరికీ తెలిసిందే. ఇక నిత్యం రాముడి పేరు చెప్పుకొని ఓట్లు అడిగే బీజేపీ నేతలు భద్రాచలం దేవాలయ అభివృద్ధి కోసం రూపాయి ఇవ్వకపోగా పోలవరం ప్రాజెక్టు పేరుతో ఏడు మండలాలను ఆర్డినెన్స్ ద్వారా ఏపీకి కట్టబెట్టారు. దానివల్ల ఇప్పుడు భద్రాద్రి ఆలయ మనుగడ ప్రశ్నార్థకం అయ్యింది. పోలవరం పూర్తయితే భద్రాచలం గుడికి ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి?
తెలంగాణ ప్రజలు అసలు బీజేపీ ఎందుకు ఓటు వేయాలన్నదే అసలు ప్రశ్న. నలుగురు ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు తెచ్చారా? విభజన హామీలను నెరవేర్చారా? గత ఎన్నికల్లో గెలువడానికి అనేక హామీలు ఇచ్చిన ఆ పార్టీ ఎంపీలు ఇప్పుడు వాటి గురించి ప్రశ్నిస్తే ఎదురుదాడి చేసే పరిస్థితి నెలకొన్నది. అందుకే గతంలో గెలుచుకున్న నాలుగు సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోవడమే ఆ పార్టీకి పెద్ద సవాల్‌గా మారిందని రాజకీయ పరిశీలకకులు చెబుతున్నారు. అందుకే జహీరాబాద్, వరంగల్, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, ఆదిలాబాద్, నల్లగొండ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు కరువైన కాషాయపార్టీ బీఆర్‌ఎస్ నుంచి తెచ్చుకునే దుస్థితి నెలకొన్నదని అంటున్నారు. అందుకే బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అనే ప్రచారం జరుగుతున్నదని చెబుతున్నారు. దీనికి అమిత్ షా ఏం సమాధానం చెబుతారో మరి! తెలంగాణలో ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే అనడానికి ఇంతకంటే ఉదాహరణలు అవసరం లేదని పరిశీలకులు అంటున్నారు..