Ambedkar’s Soul Is Troubled : సరిగ్గా 68 ఏళ్ల క్రితం.. 1956 మార్చి 18న ఆగ్రా సభలో నిమ్న జాతి ఉద్యోగులు తనకు చేసిన ద్రోహాన్ని తలుచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీరు ఆ సంఘటనను గుర్తు చేసింది. స్వేరో, బహుజన వాద ముసుగులో, జాతి ఉద్ధారకుడుగా నానా యాగిచేసి.. తెగ ఫోజులు కొట్టి అందరినీ నమ్మబలికించారు ఆర్ఎస్ ప్రవీణ్. ఎంతో ఊరించి బహుజన సమాజ్ పార్టీ ద్వారా పేరు, ప్రఖ్యాతలు సంపాదించి, గుర్తింపు, గౌరవం పొంది చివరకు కేసీఆర్ పంచన చేరారు. ధనము, ఆస్తులు కూడా భారీఎత్తున కూడబెట్టుకొన్న ప్రవీణ్, ఉసూరుమనిపించేలా ఒక్కటంటే ఒక శాతం మాత్రమే వున్న అగ్ర కుల కేసీఆర్ కాళ్ళ దగ్గర సాష్టాంగపడిన తీరును నిజంగా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.
కేసీఆర్ పది సంవత్సరాల నిరంకుశ, నియంతృత్వ, అరాచక, అనైతిక, అప్రజాస్వామిక పరిపాలనలో ప్రజలు ముఖ్యంగా బహుజనులు నానా యాతన, కష్టాలు పడిన పరిస్థితి ఉండేది. అనేక మందిని అకారణంగా, అన్యాయంగా అధికారుల చేత, తన ప్రవేట్ సైన్యం చేత ప్రత్యక్షంగా, పరోక్షంగా వేధించిన దుర్మార్గ పరిస్థితిని చూశాం. అటువంటి అహంకారి దగ్గరకుపోయి బాంఛన్ దొర నీకాళ్లు మొక్కుతా అన్న చందంగా మెడలో గులాబీ కండువా కప్పించుకోవడం నిజంగా సిగ్గనిపించలేదా? ఇదేనా మహనీయులు మనకు నేర్పిన ఆత్మగౌరవం, ఆత్మాభిమానం? ఇటువంటి ప్రవర్తన, వ్యవహార శైలితో మన సమాజానికి ఎటువంటి సంకేతాలు పంపదల్చుకున్నారు? ఇంతకీ మీకు ఏమైంది? కనీస విలువలు పాటించకుండా, మహనీయుల ప్రభోదాలను ఏమాత్రం పట్టించుకోకుండా మూర్ఖంగా అడుగంటిపోతున్న, భవిష్యత్తే లేకుండా పోతున్న పార్టీలోకి ఎలా పోవాలనిపించింది? ఇంతకీ బీఎస్పీ సొంతపార్టీలో లేనిది ఏంటి? అక్కడ బీఆర్ఎస్ పరాయి ఆధిపత్య, కుటుంబ, అవినీతి, పెట్టుబడిదారీ, పెత్తందారీ పార్టీలో వున్నది ఏంటి? ఏం ఆశించి అందులోకి వెళ్లారు? నమ్ముకున్న జాతి మొత్తం సర్వస్వం నీవే అని పరితపించే బిడ్డలకు ఏం సమాధానం చెపుతారు? వీటన్నింటికి ఆర్ఎస్ ప్రవీణ్ సమాధానం చెప్పి తీరాలి.
Read More: ట్యాపింగ్ లింక్స్, నెక్స్ట్ టార్గెట్‌గా ఎర్రబెల్లి
ఇంత నమ్మక ద్రోహానికి, అవకాశవాదానికి పాల్పడడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? మెడకాయమీద తలకాయ ఉన్నోడు ఇలా చేస్తాడా? పొత్తుల డ్రామా బెడిసికొట్టాక కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ మరో నాటకానికి తెరతీశారు. వీళ్ల రహస్య ఎజెండా తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు తెలియదులే అనుకుంటున్నారు. ఇద్దరూ కలిసి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత నీచ, హీన చరిత్రకు పాల్పడే దానికంటే ఎక్కడైనా నీళ్లు లేని బావిలో దూకాల్సింది. ఇంతటి పదవీ వ్యామోహమా? అధికార దాహమా? చివరికి ఆ మహానుభావుడు అంబేద్కర్ కల్పించిన రిజర్వుడు స్థానమే గతి. మనువాద పార్టీకి అనుకూలంగా.. బానిసగా మసులుకొంటూ ఆ పార్టీలోకి పోవడంలో ఔచిత్యం ఏంటి? నిజంగా మీకు చీము, నెత్తురు, మానం, మర్యాద, రోషం, పౌరుషం ఉంటే, అంబేద్కర్ ప్రసాదించిన రిజర్వుడు స్థానంలో నుంచి పోటీ చేయకు. మీ దొరను జనరల్ స్థానం ఇవ్వమని కోరు.
కేసీఆర్ రాజ్యాంగాన్ని మారుస్తానని అన్నారు. మన జాతి బిడ్డలైన డాక్టర్ రాజయ్యను ఉపముఖ్యమంత్రి పదవి నుంచి అర్ధాంతరంగా తొలగించారు. రెండో టర్మ్ మొత్తం ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదు. కొప్పుల ఈశ్వర్ అనే ఎస్సీ మాల మాల సామాజికవర్గానికి చెందిన మంత్రిని కనీస సభ్యత, సంస్కారం లేకుండా తన పక్కన నిలబడ్డాడని కస్సుబుస్సుమని ఘోరంగా అవమానించి అగౌరవపరిచారు. అలాగే, ఉస్మానియా విద్యార్థి నాయకుడు ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ పిడమర్తి రవిని కూడా ఘోరంగా అవమానపరిచారు. ఇంకా కరీంనగర్ మంథనికి చెందిన యువకుడు మధుకర్‌ను అత్యంత ఘోరంగా, కిరాతకంగా హతమారిస్తే ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. ఖమ్మం జిల్లాలో మరియమ్మ అనే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళను చిత్రహింసలు పెట్టి లాకప్ డెత్ చేస్తే ఏం చేశారు? ప్రభుత్వపరంగా త్వరితగతిన చర్యలు తీసుకోలేదు. ఇంకా అనేక మంది అణగారిన, బలహీన వర్గాల బిడ్డలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వాటికి కారకుడు కేసీఆర్. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పారు. డబుల్ బెడ్రూం ఇండ్లని, మూడెకరాల భూమి అని, ఇలా ఎన్నెన్నో అబద్ధాలు, మోసాలు, మాయమాటలు చెప్పి మభ్యపెట్టారు. అలాంటి కేసీఆర్ దగ్గరకు ఆర్ఎస్ ప్రవీణ్ వెళ్లారంటే, నిజంగా ఆయనది ఎంతటి సిగ్గులేని బతుకో అర్థం అవుతోంది. దీనిని ప్రజలందరూ గమనించాలని కోరుతున్నా.
Read More: నడుస్తున్న చరిత్ర, వేడెక్కిన తెలుగు రాజకీయం.!
చివరగా ఆర్ఎస్ ప్రవీణ్‌కు ఒకటే సూచన చేస్తున్నాం. మళ్ళీ కథలు పడి బీఆర్ఎస్‌లో నచ్చక, ఇమడక కొత్త అవతారం ఎత్తేందుకు ప్రయత్నిస్తే శంకరగిరి మాన్యాలే. ఉమ్మడి ఆంధ్ర్రప్రదేశ్‌లో కూడా నిన్ను ఆదర్శంగా తీసుకొని.. నువ్వు చేసిన ఘనకార్యాలు చూసుకొని కొందరు అధికార పార్టీలకి భజన చేస్తూ.. నీలాగే అమ్ముడుపోయేందుకు సిద్ధమయ్యారు. అలాంటి వారితో మనకు ఉపయోగం లేదు. కానీ, మన సమాజాన్ని వాడుకుంటూ ద్రోహం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోం.
-సంగటి మనోహర్ మహాజన్ (మహాజన రాజ్యం పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు)