– ఉత్తమ్‌ను వదలనంటున్న ఏలేటి
– మరోసారి సంచలన వ్యాఖ్యలు
– 18 ప్రశ్నలతో సీఎంకు బహిరంగ లేఖ
Alleti Maheshwar Reddy Write Letter To CM Revanth Reddy : బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తన విమర్శల పరంపరను కొనసాగిస్తున్నారు. సివిల్ సప్లైలో భారీ కుంభకోణం జరిగిందన్న ఆయన ఆరోపణలపై ఇప్పటికే సంబంధిత కమిషనర్ క్లారిటీ ఇచ్చారు. తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోమని అన్నారు. కాంగ్రెస్ నేతలు కూడా రియాక్ట్ అవుతూ నోటికొచ్చింది వాగొద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే, ఏలేటి తన వ్యాఖ్యలపై గట్టిగా నిలబడ్డారు.
శనివారం మరోసారి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సివిల్ సప్లై కార్పొరేషన్‌లో జరిగిన అవినీతిపై తన ప్రశ్నలకు మంత్రి ఎందుకు సమాధానం చెప్పలేదని అడిగారు. ఆ సమయంలో తాను రాష్ట్రంలో లేనని చెప్పిన ఉత్తమ్, వచ్చాక సమాధానం చెప్తానని మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. పైగా, కమిషనర్‌తో ప్రెస్ మీట్ పెట్టించి ఊరుకున్నారని మండిపడ్డారు.
అసలు, మంత్రి తప్పించుకు తిరగడానికి కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. అన్నీ ఆధారాలతోనే తాను బయటపెట్టానని, అయినా కూడా తనపై తప్పుడు కేసు పెట్టించారని మండిపడ్డారు ఏలేటి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, 18 ప్రశ్నలతో బహిరంగ లేఖ రాసినట్టు చెప్పారు.
‘‘మిల్లర్ల నుంచి రూ.22వేల కోట్ల బకాయిలు ఎందుకు వసూలు చేయడం లేదు? ఏదైనా లోపాయికారి ఒప్పందం జరిగిందా? జలసౌధలో ఏం జరిగింది? 100 రూపాయల బాండ్‌పై ఉత్తమ కుమార్, కమిషనర్‌లతో మిల్లర్ల మధ్య ఎంవోయూ ఒప్పందం జరిగింది. సన్న బియ్యం, దొడ్డు బియ్యం, టెండర్ ప్రక్రియలో జరిగిన అవినీతి గురించి మాట్లాడటం లేదు ఎందుకు?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్రానికి లేఖ రాస్తానని తెలిపారు. దీనిపై నిజనిర్థారణ కోసం సీఎం కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. అవినీతి జరిగిందని తాను అంటున్నానని, జరగకపోతే నిరూపించాలని సవాల్ చేశారు. తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని లేఖతో జత చేశారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి.