All Free All Political Parties All Free Promises: ప్రజాస్వామ్య వ్యవస్థకు ఉచిత పథకాలు చెప్పలేనంత నష్టం చేస్తున్నాయని ఆ మధ్య ప్రధాని మోదీ అన్నారు. అధికారం కోసం మిఠాయిల మాదిరిగా పార్టీలు ప్రకటించే ఉచిత పథకాలకు వ్యతిరేకంగా దేశ యువతరం గళమెత్తాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో ఉచిత పథకాల మీద మరోసారి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో సంపద సృష్టి మీద దృష్టి పెట్టకుండా పన్ను చెల్లింపుదారులు కట్టే డబ్బును రాజకీయ పక్షాలు ఇష్టారాజ్యంగా పంచటం వల్ల శ్రీలంక తరహా సంక్షోభంలో మనదేశమూ కూరుకుపోతుందని, ఈ పథకాల వల్ల ప్రజలు సోమరులుగా తయారవుతారని కొందరు ప్రధాని మాటలకు మద్దతుగా తమ వాదనను వినిపిస్తుండగా, దేశ సంపద గుప్పెడు మంది చేతుల్లో కేంద్రీకృతమవుతున్న ఈ రోజుల్లో, వేల కోట్ల రూపాయల కార్పోరేట్ రుణాలను యథేచ్ఛగా మాఫీ చేస్తున్న ప్రభుత్వాలు.. శ్రమశక్తికి ప్రధాన వనరుగా ఉన్న పేదల సంక్షేమం కోసం ఈ మాత్రం చేయటంలో తప్పులేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
నిజానికి ఈ చర్చ ఇప్పటిదేమీ కాదు. స్వాతంత్ర పోరాట కాలం నుంచీ మనదేశంలో ఈ చర్చ జరుగుతూనే వచ్చింది. సామ్యవాదంతోనే సమసమాజ నిర్మాణం సాధ్యమని స్వాతంత్ర్యోద్యమ కాలం నాటి కాంగ్రెస్ నేతల్లో మెజారిటీ వర్గం భావించారు. సామ్యవాదం అంటే ఆదాయాలను సమానం చేయడమన్న జార్జ్ బెర్నార్డ్‌షా మాటలను దేశ ప్రధమ ప్రధాని జవహర్ లాల్ గట్టిగా ఆచరించారు. ప్రభుత్వ రంగ సంస్థల స్థాపన ద్వారా ఉత్పత్తి సాధనాలను ప్రభుత్వం చేతిలో ఉంచి, గరిష్ట సంఖ్యలో కార్మికశక్తికి ప్రాణప్రతిష్ట చేయవచ్చని నెహ్రూ బలంగా నమ్మి ఆచరించారు. 1955 జరిగిన ఆవడిలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో సామ్యవాద తరహా సమాజ తీర్మానంపై నెహ్రూ మాట్లాడారు. సంపన్నులకు పన్నులు విధించి వాటితో పేదలకు సంక్షేమానికి ప్రణాళికలు రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు.
నెహ్రూ తర్వాత వచ్చిన ఇందిర సైతం ఇదే బాటలో బ్యాంకులు, అనేక ప్రైవేటు ఆస్తులను జాతీయం చేశారు. 1971-72లో జరిగిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో సంపద పెంచకుండా పంచటం సాధ్యమా అనే ప్రశ్నకు జవాబిస్తూ ‘ స్వాతంత్ర్యం వచ్చాక తమ జీవితాలు మారతాయని భావించిన ప్రజలకు ప్రభుత్వపు వాటాలో కొంత వాటానివ్వగలిగితే కాస్త ఆలస్యంగానైనా వారి జీవితాలు మారతాయి’ అన్నారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణతో ‘సామ్యవాదం’ అనే పదాన్ని రాజ్యాంగ పీఠికలో పొందుపరచటం, గరీబీ హటావో నినాదం వంటి చర్యలతో సామ్యవాదాన్ని రాజ్యాంగపు అంతర్లీన భావనగా నిలిపారు.
Read Also: ఉమ్మడి పౌరస్మృతికి రూట్‌మ్యాప్ ఏదీ?
తర్వాత వచ్చిన జనతా ప్రభుత్వం పెట్టుబడిదారీ ఆలోచనల వైపు మొగ్గినప్పటికీ మూడేళ్ళకే దాని ఆయువు తీరటంతో మళ్లీ కాంగ్రెస్ పేదల పక్షాన నిలుస్తూనే వచ్చింది. 1991 నాటికి పీవీ-మన్మోహన్ ద్వయం అనివార్య పరిస్థితిలో ప్రపంచీకరణకు తలుపులు తీయాల్సి వచ్చినా పాలనలో పేదల సంక్షేమాన్ని ఉపేక్షించలేదు. తర్వాత వాజ్‌పేయి హయాంలో మళ్లీ కాస్త ఇది గాడితప్పే దిశగా అడుగులు పడినా, మెజారిటీ లేకపోవటంతో భాగస్వాముల ఒత్తిడికి లొంగి మధ్యేమార్గంగా సామ్యవాదాన్ని తోసిపుచ్చలేకపోయారు. తర్వాత యూపీఏ హాయంలో ఉపాధి హామీ పథకం మొదలు పలు పథకాలు పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించబడ్డాయి. కానీ, 2014లో వచ్చిన మోదీ పాలనలో సామ్యవాదపు పరిధి తగ్గిపోతూ వస్తోంది. యూపీఏ సర్కారు కార్పోరేట్లకు రుణాల మాఫీ వంటివాటికే పరిమితం కాగా, మోదీ సర్కారు ఏకంగా దేశ ఆర్థిక వ్యవస్థలను కార్పోరేట్లకే ధారాదత్తం చేస్తూ.. బీదల కష్టాలపై సానుభూతి చూపించటానికే పరిమితమవుతోంది.
ఇక రాష్ట్రాల విషయానికి వస్తే.. తమిళనాడులో 1962లో తొలిసారి నాటి కాంగ్రెస్ సీఎం కామరాజ్ నాడార్ పేదరికం కారణంగా బడి మాని కూలికి పోతున్న బాలబాలికలకు పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం తెచ్చారు. 1982లో నాటి సీఎం తమిళనాడు అంతటా విస్తరించారు. ఈ ఒరవడిలోనే తెలుగునేల మీద ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలోబియ్యం పథకం తీసుకొచ్చారు. నాటి నుంచి నేటివరకు ఏ ప్రభుత్వమూ ఉచితాలను అనుచిత ఖర్చుగా భావించిన దాఖలాలు లేవు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పాలనలో కొన్ని సంక్షేమ పథకాలు ప్రకటించబడినా, ఆ పథకాల లబ్ది కొన్ని వర్గాలకే చేకూరటం.. మెజారిటీ పేదల ఆగ్రహానికి కారణమైంది. గత అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పేదలందరికీ అమలు చేసే విధంగా అభయహస్తం పేరుతో 6 కీలక హామీలనిచ్చి, గెలిచిన తర్వాత అర్హత ఉన్న చిట్టచివరి లబ్దిదారుడికీ ఏ పరిమితీ, వివక్ష లేకుండా వాటిని అందించే ప్రయత్నం చేస్తోంది.
Read Also: ‘చార్ సౌ’ కల నెరవేరేనా?
ఉచితాలన్నీ అనుచితం అనే వారు దేశవ్యాప్తంగా అమలవుతున్న కొన్ని పథకాలను చూస్తే తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే. మధ్యప్రదేశ్ ప్రభుత్వం బడికి ఆడపిల్లలకు ఉచితంగా సైకిళ్లు అందించటం వల్ల వెనకబడిన ఆ రాష్ట్రంలో పొరగూళ్లకు సైకిళ్ల మీద వెళ్లి చదువుకునే అమ్మాయిల సంఖ్య 80 శాతానికి పైగా పెరిగింది. నాడు తమిళనాడులో ఆరంభమైన మధ్యాహ్నభోజన పథకం.. నేడు దేశ వ్యాప్తంగా విస్తరించి 12.12 లక్షల పాఠశాలల్లో, 10.68 కోట్ల మంది బడి పిల్లల పొట్ట నింపుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి వచ్చిన ఉచిత విద్యుత్ పథకం రైతు ఆత్మహత్యల నివారణకు దోహదపడింది. నాడు ఆరోగ్య శ్రీ పేరుతో వచ్చిన పథకం.. నేడు ఆయుష్మాన్ భారత్ రూపకల్పనకు ప్రాతిపదికను ఏర్పరచిన విషయాన్ని మరచిపోలేము. గతంలో సుప్రీంకోర్టు సీజేఐ ఎన్‌వీ రమణ.. ఒక తీర్పు సందర్భంగా ‘ఒక బార్బర్‌కి షేవింగ్ కిట్, ఒక విద్యార్థికి సైకిల్, గీత కార్మికులకు కల్లుగీత పనిముట్లు, రజకునికి ఇస్త్రీపెట్టెను అందిస్తే వారి జీవితాలు మారతాయి’ అని వ్యాఖ్యానించారు.
మొత్తంగా చూసినప్పడు ఉచిత పథకాలు ప్రజలను, అందునా ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షిస్తాయనే మాట నిజమైనా, వాటి వల్ల చేకూరుతున్న సంక్షేమాన్ని పూర్తిగా నిరాకరించలేము. అయితే సంక్షేమ పథకాలు ప్రజల అవసరాలు తీర్చటానికి గాక వారి విలాసాలను ప్రోత్సహించేవిగా ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వాలదే. సంపద సృష్టి ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ప్రధానమైన అంశమే అయినా, సమాజపు శ్రామిక శక్తికి మూలంగా ఉన్న పేదలకు రవ్వంత భరోసా కల్పించటమూ అంతే ముఖ్యం. ప్రభుత్వ రంగ బ్యాంకులకు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎగవేసి, విదేశాలకు పారిపోయిన వారిని, దేశ వనరుల మీద గుత్తాధిపత్యాన్ని పెంచుకుంటున్న కార్పొరేట్లను పెంచి పోషిస్తున్న పాలకులు.. పేదలకు అందించే రవ్వంత సాయాన్ని తాయిలాలుగా భావించటం పేదలను అవమానించటమే అవుతుంది. పేదరికంలో పుట్టి, అందులోనే పెరిగి, చివరకు అందులోనే చనిపోయే అభాగ్యుల జీవితాల్లో సానుకూల మార్పురావాలంటే సంపన్నులు తమ వాటాలో కొంత వాటాను వదులుకోవటం ఎంతమాత్రం అన్యాయం కాబోదు.
-సదాశివరావు ఇక్కుర్తి (సీనియర్ జర్నలిస్ట్)