Bandi Sanjay: ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం, సంకెపల్లి గ్రామాల్లో గురువారం మాట్లాడారు. ముంపు గ్రామాల ప్రజా సమస్యలపై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని, తాము ముంపు ప్రజలను ఎప్పటికీ మరచిపోమని హామీ ఇచ్చారు. ఎన్నికలప్పుడు కాదు.. ఎన్నికలు అయిపోయాక కూడా వచ్చేవారిని ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. ముంపు గ్రామాల సమస్యలపై ప్రజల గళంతో గళం కలిపినవాడిగా.. ప్రజల పాదంలో పాదం కలిపి నడిచినవాడిగా వారి సమస్యలు పరిష్కరించడానికి వంద శాతం కృషి చేస్తానని వివరించారు. కరీంనగర్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు ఓటు వేసి గెలిపిస్తే జోడెద్దులుగా తాము ప్రజల కోసం పని చేస్తామని చెప్పారు. అదే సందర్భంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు.
బీజేపీ కేవలం దేవుడి పేరిట రాజకీయాలు చేస్తుంటదని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. బండి సంజయ్ రాజన్న గుడికి ఎన్ని నిధులు తెచ్చావ్? అని ప్రశ్నించారు. వేములవాడ రాజన్న అణా పైసా అన్నా తెచ్చావా? అని ఎద్దేవా చేశారు. బీజేపీ రాముడు, అక్షింతలతో రాజకీయం చేస్తున్నదని, అయోధ్య రామాలయం పూర్తికాకముందే ఓట్ల కోసం అక్షింతలు పంచారని మండిపడ్డారు. దేవుడు గుడిలో ఉండాలని, భక్తి గుండెల్లో ఉండాలని ఆది శ్రీనివాస్ అన్నారు. ఇప్పుడు బీజేపీ 400 సీట్లు కావాలని అడుగుతున్నదని, అది ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేయడానికేనని ఆరోపించారు.
Also Read: మోదీ గ్యారంటీ గురించి రాహుల్ గాంధీ ఏమన్నారు?
ఐదు నెలల క్రితం బీఆర్ఎస్‌ను ఎలాగైతే పక్కన పెట్టారో అలాగే బీజేపీని కూడా పక్కనపెట్టాలని ఆది శ్రీనివాస్ ప్రజలకు పిలుపు ఇచ్చారు. రాజన్న సాక్షిగా ముంపు గ్రామాలకు ఇచ్చిన మాటను కేసీఆర్ తప్పారని ఆగ్రహించారు. ముంపు గ్రామ ప్రజల సమస్యలు పరిష్కరించలేదని అన్నారు. వినోద్ కుమార్ నాన్ లోకల్ అని, ఆయనకు ఓటు వేస్తే వ్యర్థం అని చెప్పారు.
గతంలో పీసీసీ హోదాలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సంకపల్లిలో బస చేశారని, ముంపు ప్రజల బాధలు ఆయనకు తెలుసు అని ఆది శ్రీనివాస్ తెలిపారు. వారి సమస్యలను ముఖ్యమంత్రి త్వరలోనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించడంలో వెనక్కితగ్గే ప్రసక్తే లేదని అన్నారు. ఉపాధి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని, గతంలో కలెక్టర్‌తోనూ ముంపు గ్రామాల ప్రజల సమస్యల గురించి చర్చించామని వివరించారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రజలను మోసే చేసే పార్టీలని, పేదల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. గతంలో వినోద్ కుమార్‌కు, బండి సంజయ్‌కు అవకాశం ఇచ్చారని, ఈసారి ఒక్కసరి వెలిచాల రాజేందర్ రావుకు అవకాశం ఇవ్వాలని, ఆయన మృధు స్వభావి, విద్యావేత్త అని తెలిపారు.