Acp Umamehewsararao illigal activities today court enquiry Acb focus on laptop :
సీసీఎస్ ఎసీపీ ఉమామహేశ్వరరావు అక్రమాస్తుల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గతంలోనూ ఆయనపై అనేక ఫిర్యాదులు అందాయి. అతనిపై ఇప్పటికే మూడు సార్లు సస్పెన్షన్ వేటుసైతం పడింది. అయినా ఉమామహేశ్వరరావు తనతీరు మార్చుకోలేదు. నేడు(శుక్రవారం) కస్టడీ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేయనుంది. ఉమామహేశ్వరరావు అక్రమాల చిట్టాపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. బినామీ ఆస్తులు, వ్యాపారవేత్తలతో కలిసి పెట్టుబడులపై ఏసీబీ విచారణ చేయనుంది. కాగా ఉమామహేశ్వరరావు ల్యాప్‌టాప్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రెండు బ్యాంక్ లాకర్లను ఏసీబీ అధికారులు తెరవనున్నారు. దీంతో ఉమామహేశ్వరరావు లెక్క ఇంకా తేల్చే పనిలోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ట్యాబ్‌లో ఉన్న ఆస్తి వివరాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. బీనామీ ఆస్తులపై కూపీలాగుతున్నారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న ఆస్తులు డాక్యుమెంట్స్ వివరాలను ఏసీబీ అధికారులు కోర్టుకు అందించారు. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం మూడు కోట్ల ఆస్తులను ఏసీబీ గుర్తించింది.
గతంలో అనేక ఫిర్యాదులు
ఆస్తి విలువ అనధికారికంగా బహిరంగ మార్కెట్‌లో రూ. 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా. పలుమార్లు సస్పెండయినా కానీ కీలక పోస్టింగ్‌లు దక్కించుకోవటంపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఉమామహేశ్వరరావు వెనక ఉన్న అధికారుల అవినీతిపై ఏసీబీ విచారణ చేస్తోంది. ఉమామహేశ్వరరావు ఫిర్యాదుదారులనే బెదిరించి వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ల్యాప్ టాప్‌లో దొరికిన సమాచారం ఆధారంగా ఏసీబీ విచారణ చేపట్టింది. కొందరు పోలీస్ అధికారులతో కలిసి బినామీ వ్యాపారాలు చేసినట్టు ఏసీబీ గుర్తించింది.ఉమామహేశ్వరరావుకు సంబంధించిన ఆస్తుల చిట్టా తేల్చేందుకు చేపట్టిన సోదాల క్రమంలో హైదరాబాద్‌లో మరో డీఎస్పీ ఇంట్లోనూ సోదాలు చేయడం చర్చనీయంగా మారింది. బర్కత్‌పురా హౌసింగ్ బోర్డు కాలనీ తారకరామ ఎస్టేట్లోని టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మందడి సందీప్‌రెడ్డి ఫ్లాట్‌లోనూ అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. వీరిద్దరూ హైదరాబాద్ సీఎస్ఎస్లో కలిసి పనిచేశారు. అయితే ఉమామహేశ్వరరావుకు సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సందీప్‌రెడ్డికి ఏమైనా సంబంధముందా అని తేలాల్సి ఉంది. కాగా ఉమామహేశ్వరావు కొందరు పోలీస్ అధికారులతో కలిసి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నందున ఆ దిశగా అధికారులు దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి అతడి ల్యాప్‌టాప్‌లోని సమాచారాన్ని విశ్లేషించడంలో అధికారులు నిమగ్నమయ్యారు.