– సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ రావు ఇంట్లో సోదాలు
– ఏకకాలంలో ఆరు చోట్ల తనిఖీలు
– ఆదాయానికి మించి అక్రమార్జన
– పెద్ద మొత్తంలో నగదు, బంగారం, ల్యాండ్ డాక్యుమెంట్ల స్వాధీనం
– లాకర్లపైనా ఫోకస్ పెట్టిన ఏసీబీ అధికారులు
– సాహితీ స్కాం కేసులో లబ్ది పొందినట్టు ఆరోపణలు
– గతంలోనూ రియల్ ఎస్టేట్ కేసుల్లో సెటిల్మెంట్స్
ACP Uma Maheshwara Rao: వందల మందిని ముంచేసి వేల కోట్లు వెనకేసుకున్నాడు సాహితీ ఇన్ఫ్రా అధినేత బూదాటి లక్ష్మి నారాయణ. జైలుకు వెళ్లొచ్చి బెయిల్‌పై బయటకొచ్చి దర్జాగా తిరుగుతున్నాడు. కానీ, రోజులు గడుస్తున్నా బాధితులకు న్యాయం జరగడం లేదు. సాహితీ స్కాంలో బీఆర్ఎస్ నేతల హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు జరిపిన పోలీసులు కూడా అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వినిపించాయి. ఈ క్రమంలోనే సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ రావు నివాసంలో ఏసీబీ సోదాలకు దిగింది.
ఏకకాలంలో సోదాలు
ఏసీపీ ఉమామహేశ్వర్ రావు ఇంట్లో ఏసీబీ మంగళవారం సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు చేసింది. హైదరాబాద్ అశోక్ నగర్‌లోని ఇంటితో పాటు ఏకకాలంలో ఆయన స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో కూడా సోదాలకు దిగింది. నగరంలో ఆరు చోట్ల ఈ తనిఖీలు కొనసాగాయి. సోదాల్లో భాగంగా పెద్ద మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు, ల్యాండ్ డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉమామహేశ్వర్ రావు బ్యాంకు లాకర్లనూ గుర్తించారు. ఉమామహేశ్వర్ రావు నివాసంలో రూ. 45 లక్షల నగదు, 65 తులాల బంగారం లభించింది.
సాహితీతో చేతులు కలిపారా?
వందల కోట్ల సాహితీ ఇన్ఫ్రా స్కాం కేసు విచారణ అధికారిగా ఉన్నారు ఉమామహేశ్వర్ రావు. సుమారు 3,500 బాధితులున్న ఈ కేసులో నిందితుల వైపు నుంచి డబ్బులు పుచ్చుకున్నారని, ఇబ్రహీపంట్నంలో ఏసీపీగా చేసినప్పుడూ రియల్ ఎస్టేట్ వివాదాల్లో సెటిల్‌మెంట్లలో లక్షలు పిండుకున్నారని ఈయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది.
రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్స్ చేశారా?
ఉమామహేశ్వర్ రావు భూ వివాదాల్లో తలదూర్చి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేశారని అనుమానిస్తున్నారు. సాహితీ ఇన్ఫ్రా కేసులో నిందితుల నుంచి డబ్బులు వసూలు చేసి బాధితులకు అన్యాయం చేస్తున్నారని ఫిర్యాదులు కూడా అందాయి. సీసీఎస్‌లో రెండేళ్లుగా సాహితీ స్కాం కొనసాగుతున్నా ముందడుగు పడింది లేదు. నిందితుడు బూదాటి లక్ష్మి నారాయణ వద్ద నుంచి డబ్బులు తీసుకుని కేసును నీరు గార్చారని, ఇతర డైరెక్టర్ల నుంచి కూడా డబ్బుల కోసం నోటీసులు పంపి వేధిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఈయన ఇబ్రహీంపట్నం ఏసీపీగా వ్యవహరించినప్పుడూ అవినీతికి పాల్పడ్డారనే విమర్శలొచ్చాయి. సమూహా అనే రియల్ ఎస్టేట్ సంస్థ మోసాల కేసును డీల్ చేసి పెద్ద మొత్తంలోనే అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వినిపించాయి. అలాగే, డబుల్ మర్డర్ నిందితుడి నుంచీ ముడుపులు తీసుకున్నట్టు అభియోగాలు వచ్చాయి.
మూడు సార్లు సస్పెన్షన్
జవహర్‌నగర్‌లో విధులు నిర్వర్తించిన కాలంలో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలతో ఉమామహేశ్వర్ రావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఇబ్రహీంపట్నం రియల్ ఎస్టేట్ మర్డర్ కేసులోనూ ఈయన వ్యవహారంపై ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు వేటు వేశారు. మొత్తంగా సర్వీసులో ఇప్పటి వరకు ఉమామహేశ్వర్ రావు మూడు సార్లు సస్పెండ్ అయినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల్లో బలమైన సాక్ష్యాధారాలు లభించి అరెస్టయితే మరోసారి సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉన్నది.