BRS: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్‌పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. టైం, ప్లేస్ కేటీఆర్ చెప్పినా ఓకే అంటూ ఆయనకు తిరిగి సవాల్ విసిరారు. కేటీఆర్ నిజంగానే లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధంగా ఉంటే అన్ని ఏర్పాట్లు తామే చేస్తామని అన్నారు. కేటీఆర్ సమయం, వేదిక చెబితే చాలు అని కౌంటర్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజాలు బయటకు వస్తున్నా కొద్దీ కేటీఆర్‌కు వణుకు మొదలైందని అన్నారు. అందుకే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. గతంలో డ్రగ్స్ విషయంలోనూ రేవంత్ సవాల్ విసిరి గన్ పార్క్ వస్తే కేటీఆర్ పత్తా లేకుండా పారిపోయాడని అన్నారు.
గాంధీ భవన్‌లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కేకే మహేందర్, పలువురు కాంగ్రెస్ నాయకులు విలేకరులతో మాట్లాడారు. కేటీఆర్‌కు పిచ్చి ముదిరి పీక్ స్టేజ్‌కు వెళ్లిందని ఆది శ్రీనివాస్ అన్నారు. భార్య, భర్తల మాటలు, జడ్జీల ఫోన్లను కూడా కేటీఆర్ విన్నారని మండిపడ్డారు. తన ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు ఆది శ్రీనివాస్ ఆరోపించారు. తన ఫోన్ ట్యాప్ అవుతుందని ఎన్నికలకు ఎనిమిది నెలల ముందే రేవంత్ రెడ్డికి తెలిపినట్టు చెప్పారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ చేసేంత పరిస్థితి ఏమున్నదని నిలదీశారు.
Also Read: Double Bedroom: బీఆర్ఎస్‌కు డబుల్ సెగ.. అధినేత నుంచి అభ్యర్థి వరకు
రేవంత్ రెడ్డి పోరాటయోధుడు అని ఆది శ్రీనివాస్ అన్నారు. ఆయన పోరాడి గెలిచారని, కొట్లాడి ముఖ్యమంత్రి అయ్యారని వివరించారు. అలాంటిది ఆయన బీజేపీలోకి వెళ్లాడనే మాట మరోసారి కేటీఆర్ మాట్లాడితే బాగోదని వార్నింగ్ ఇచ్చారు. అసలు బీజేపీతో పొత్తు కోసం బీఆర్ఎస్ వెంపర్లాడిందని ఫైర్ అయ్యారు. బీజేపీతో పొత్తు కోసం కేటీఆర్ ప్రయత్నాలు చేయలేదా? అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని వారి పార్టీల నాయకులే చెబుతున్నారని అన్నారు.